Begin typing your search above and press return to search.

రెండు సినిమాల‌కే సూప‌ర్‌స్టార్లా? జెన్-Zకి అమీషా కోటింగ్!

అయితే ఇటీవల సోషల్ మీడియా వేదికగా అమీషా పటేల్ నేటితరం నటీమణులపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   9 May 2026 2:22 PM IST
రెండు సినిమాల‌కే సూప‌ర్‌స్టార్లా? జెన్-Zకి అమీషా కోటింగ్!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత అదృష్టవంతురాలైన కథానాయికగా అమీషా పటేల్‌ను అభివర్ణించవచ్చు. బాలీవుడ్ డెబ్యూ `కహో నా ప్యార్ హై`... టాలీవుడ్ ఎంట్రీ `బద్రి` చిత్రాలతో ఈ పంజాబీ బ్యూటీ కెరీర్ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీ నాయికగా వెలిగారు. సుదీర్ఘ విరామం తర్వాత సన్నీ డియోల్‌తో నటించిన `గదర్ - 2` బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం సెకండ్ ఇన్నింగ్స్ లోను సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులోను అమీషా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇటీవల సోషల్ మీడియా వేదికగా అమీషా పటేల్ నేటితరం నటీమణులపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం పీఆర్ బృందాల ద్వారా సృష్టించుకునే కృత్రిమమైన స్టార్‌డమ్ శాశ్వతం కాదని ఘాటుగా విమర్శించారు. ఏడాదికి ఒకటి రెండు యావరేజ్ సినిమాల్లో నటిస్తూ తమను తాము సూపర్‌స్టార్లుగా ప్రచారం చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదని హితవు పలికారు. నిజమైన స్టార్‌డమ్ అనేది బాక్సాఫీస్ వద్ద సృష్టించే ప్రభంజనంపై ఆధారపడి ఉంటుందని.. కేవలం షూటింగ్ సెట్లలో ఉండటం వల్ల ఎవరూ స్టార్లు కాలేరని కాస్త ఘాటుగానే విమ‌ర్శించారు.

ముఖ్యంగా బాక్సాఫీస్ లెక్కల విషయంలో అమీషా తనదైన విశ్లేషణను వినిపించారు. 2026 నాటికి 100 కోట్ల వసూళ్లు సాధించడం అనేది ఒక పెద్ద విషయం కాదని.. కనీసం ఒక్క సినిమా కూడా 200 కోట్లు రాబట్టని వారు నంబర్ 1, నంబర్ 2 స్థానాల కోసం పీఆర్ బృందాలకు డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. తన కెరీర్‌లో `కహో నా ప్యార్ హై`, `గదర్ 1`,`గదర్ 2` వంటి మూడు చారిత్రాత్మక సోలో బ్లాక్ బస్టర్లను అందించానని.. అవి తన సహనటుల కెరీర్‌లో కూడా బిగ్గెస్ట్ హిట్స్ అని అమీషా గుర్తు చేశారు. ఇతర నటీమణులలా తనకు ఫేక్ పీఆర్ మెషినరీ లేకపోవడం వల్లే తన విజయాల గురించి తక్కువ చర్చ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అమీషా పటేల్ కేవలం సినిమా విషయాలకే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ ఉద్రిక్తతలపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ - యుఏయు యుద్ధం కార‌ణంగా న్యూయార్క్ నుంచి ముంబైకి రావాల్సిన తాను ముప్పు తిప్ప‌ల గురించి ప్ర‌స్థావించారు. న్యూయార్క్ నుంచి వ‌స్తుండ‌గా యుఏఇపై క్షిప‌ణి దాడి కార‌ణంగా త‌న విమానాన్ని దారి మ‌ళ్లించార‌ని ఒమ‌న్ లో 24 గంట‌ల పాటు చిక్కుకు పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితులు సామాన్యుల ప్రయాణాలను ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయో వివరిస్తూ.. ఈ యుద్ధాలు ఎప్పుడు ముగుస్తాయోన‌ని క‌ల‌త చెందారు. ఎట్టకేలకు మంగళవారం అమీషా ముంబైకి చేరుకున్నారు.

అమీషా పటేల్ భవిష్యత్తు ప్రాజెక్టుల విషయానికి వస్తే....`గదర్ 2` విజయం తర్వాత ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం `జీనియస్ 2` స‌హా మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాల చర్చల్లో ఉన్నట్లు సమాచారం. మరికొన్ని వెబ్ సిరీస్‌లు.. ఇత‌ర భాష చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా తన ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉండే పవర్‌ఫుల్ పాత్రల కోసం అమీషా కథలను వింటున్నారు. 2026లో అమీషా పటేల్ వెండితెరపై మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను పలకరించే అవకాశం ఉంది.