Begin typing your search above and press return to search.

400 హ్యాండ్ బ్యాగ్‌లు.. పెంట్‌హౌస్ కొనేయొచ్చు అమీషా!

ద‌క్షిణ బొంబాయికి చెందిన అమీషా, వ్యాపార రాజ‌కీయ కుటుంబం నుంచి ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చింది. 12 వ‌య‌సులో డిజైన‌ర్ బ్యాగుల‌ను కొన‌డం ప్రారంభించింది.

By:  Sivaji Kontham   |   20 Aug 2025 8:00 AM IST
400 హ్యాండ్ బ్యాగ్‌లు.. పెంట్‌హౌస్ కొనేయొచ్చు అమీషా!
X

ప‌వ‌న్ క‌ల్యాణ్ `బ‌ద్రి` సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మైన అమీషా ప‌టేల్, బాలీవుడ్ లో హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న `క‌హోనా ప్యార్ హై` చిత్రంతో తెరంగేట్రం చేసింది. రెండున్న‌ర‌ ద‌శాబ్ధాలుగా న‌టిగా కెరీర్ జ‌ర్నీ సాగిస్తోంది. అయితే బాల్యంలో ఉన్న‌ప్ప‌టి నుంచి అమీషాకు హ్యాండ్ బ్యాగులంటే మ‌హా పిచ్చి. ఇప్ప‌టికి దాదాపు 300-400 హ్యాండ్ బ్యాగులు కొనుక్కున్నాన‌ని అమీషా చెప్పింది. ఇందులో ఖ‌రీదైన అంత‌ర్జాతీయ బ్రాండ్లు ఉన్నాయి. మార్కెట్లోకి కొత్త బ్యాగు దిగిందంటే చాలు, దాని ట్యాగ్ ధ‌ర ఎంతో అడ‌గ‌నే అడ‌గ‌దు. వెంట‌నే కొనేయాల్సిందే.

అమీషా సేక‌రించిన 400 బ్యాగుల‌ను వేలం వేస్తే వ‌చ్చిన డ‌బ్బుతో ముంబైలో ఒక ఖ‌రీదైన‌ పెంట్ హౌస్ కొనేయొచ్చు అంటే న‌మ్మ‌గ‌ల‌రా? కొరియోగ్రాఫ‌ర్ కం డైరెక్ట‌ర్ ఫ‌రా ఖాన్ తాజాగా అమీషా ఇంటిని ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా త‌న వ్లాగ్ లో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ప‌రిచ‌యం చేసారు. అమీషాకు బ్యాగులు కొనే అల‌వాటుతో పాటు పుస్త‌కాలు కొనే అల‌వాటు ఉంది. త‌ను పుస్త‌కాల పురుగు. బాగా చ‌దువుతుంది. ప‌ది మందికి పుస్త‌కాలు కొనిస్తుంది. అలాగే ఒక‌రిని పొడిచి చంపేయ‌గ‌లిగేంత ప‌దునైన షూలు కూడా కొనుగోలు చేస్తుంద‌ని, దానికోసం ఒక్కో జ‌త షూస్ కోసం ల‌క్ష వ‌ర‌కూ వెచ్చిస్తుంద‌ని ఫ‌రా చెప్పింది.

ద‌క్షిణ బొంబాయికి చెందిన అమీషా, వ్యాపార రాజ‌కీయ కుటుంబం నుంచి ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చింది. 12 వ‌య‌సులో డిజైన‌ర్ బ్యాగుల‌ను కొన‌డం ప్రారంభించింది. ఒక్కో బ్యాగు కోసం ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేస్తుంది. అమీషా తన హ్యాండ్ బ్యాగ్‌ను ఎప్పుడూ రిపీట్ చేయ‌దు. పరిశ్రమలో గరిష్ట సంఖ్యలో డిజైనర్ బ్యాగులను సొంతం చేసుకున్న న‌టి అమీషా.. అని ఫ‌రా వెల్లడించారు. అత్యంత ఖ‌రీదైన బిర్కిన్ బ్యాగ్ లు అమీషా ఆల్మ‌రాలో ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన బ్రాండ్లలో ఒకటైన బిర్కిన్ బ్యాగ్ ధర రూ. 2-3 కోట్ల వరకు ఉంటుంది. అల్మారా లోపల ఉన్న బ్యాగుల జాబితా తిర‌గేస్తే... వివ‌రాలు ఇలా ఉన్నాయి. షెల్ఫ్ 7: హెర్మ్స్ ఎల్లో ఎవెలిన్, హెర్మ్స్ బేబీ పింక్ ఎవెలిన్, హెర్మ్స్ ఫస్చియా పింక్ ఎవెలిన్, హెర్మ్స్ ఆరెంజ్ ఎవెలిన్, హెర్మ్స్ పౌడర్ బ్లూ ఎవెలిన్, హెర్మ్స్ మినీ రెడ్ ఎవెలిన్, హెర్మ్స్ మినీ వైట్ ఎవెలిన్, డియోర్ డెనిమ్ సాడిల్ బ్యాగ్, ఫెండి ఫోన్ కేస్, ఎల్వి ఫోన్ కేస్ వంటి బ్రాండ్ల బ్యాగుల‌ను అమీషా సేక‌రించింది. భారీగా బ‌రువైన బ్యాగును త‌గిలించుకుని క‌నిపిస్తే క‌చ్ఛితంగా కూర‌గాయ‌లు కొన‌డానికి వెళుతున్నావా? అని అమీషాపై జోకులు వేస్తున్నార‌ట‌.

అమీషా షెల్ఫ్ లో క‌ర‌ణ్ కి ఇష్ట‌మైన‌ బొట్టెగా వెనెటా బ్యాగ్ కూడా ఉంది. దానిని చూపిస్తూ నువ్వు క‌ర‌ణ్ ని పెళ్లి చేసుకోవాల‌ని కోరుకుంటున్నాను అని అంది. నాక్కూడా అలాగే అనిపిస్తోంద‌ని న‌వ్వేసిన అమీషా మేం ఒంట‌రిగా ఉండాల‌నుకున్నాం.. కాబ‌ట్టి ఇది ఒక ఆద‌ర్శ బంధం అని చెప్పింది. రూ. 5.8 లక్షలు ఖ‌రీదైన తన ఆండియామో లార్జ్ టోట్ బ్యాగ్ ని అమీషా ఈ స‌మ‌యంలో చూపించింది. గ‌ద‌ర్ 2తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న అమీషా ప‌టేల్ మ‌రో రెండేళ్ల‌లో ప్రారంభ‌మ‌య్యే గ‌ద‌ర్ 3 కోసం ఎదురు చూస్తాన‌ని వెల్ల‌డించింది.