Begin typing your search above and press return to search.

'అమీర్ లోగ్'లో ప్రతి పాత్రకీ ఇంపార్టెన్స్ ఉంటుంది: వేధా జలంధర్

వేధా కెరీర్ 2019లో మొదలైందట. తాను నటించిన రెండు సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు వెళ్లినా థియేటర్లకు మాత్రం రాలేదన్నారు.

By:  M Prashanth   |   19 Aug 2026 9:28 PM IST
అమీర్ లోగ్లో ప్రతి పాత్రకీ ఇంపార్టెన్స్ ఉంటుంది: వేధా జలంధర్
X

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ‘అమీర్ లోగ్’ టీజర్ ట్రైలర్స్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంటోంది. ఇక సినిమా ఆగస్ట్ 21న రిలీజ్ కానుంది. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వేధా జలంధర్‌తో పాటు రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు చేశారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలో వేధా తన పాత్రతో పాటు సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

ఈ సినిమాలో తనది పక్కింటి అమ్మాయిలా అనిపించే క్యారెక్టర్ అని వేధా చెప్పారు. అవసరమైనప్పుడు ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉంటుందని, ఆ విషయంలో తన అమ్మ ప్రభావం కూడా పాత్రతో కలిసిపోయిందన్నారు. మహిళలకు నచ్చేలా, కొంత స్ఫూర్తి ఇచ్చేలా క్యారెక్టర్ ఉంటుందని తెలిపారు. సినిమాలో బిర్యానీ కూడా ఊరికే వచ్చే ఎలిమెంట్ కాదని, కథలో దానికి ప్రత్యేకమైన పని ఉందన్నారు. ఒక్క తన పాత్రకే కాకుండా మిగతా క్యారెక్టర్స్‌కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పారు.

వేధా కెరీర్ 2019లో మొదలైందట. తాను నటించిన రెండు సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు వెళ్లినా థియేటర్లకు మాత్రం రాలేదన్నారు. ఆ తర్వాత యాక్టింగ్‌పై మరింత పట్టుకోసం థియేటర్ కూడా నేర్చుకున్నట్లు చెప్పారు. ఆరేళ్లలో తక్కువ సినిమాలే రిలీజ్ అయ్యాయనే బాధ లేదని, సంఖ్య కంటే చేసిన పాత్రను ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవడమే తనకు ముఖ్యమన్నారు. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని కాకుండా, తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటున్నట్లు తెలిపారు.

‘అమీర్ లోగ్’ అవకాశం కూడా నేరుగా రాలేదని వేధా చెప్పారు. బషీర్ మాస్టర్ ద్వారా ఆడిషన్స్ గురించి తెలిసి వెళ్లానని, అప్పటికి దర్శకుడు తన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వర్క్ కూడా చూడలేదన్నారు. ఆడిషన్‌లో చేసిన పర్ఫామెన్స్ నచ్చడంతో వెంటనే సెలెక్ట్ చేశారని తెలిపారు. ఇప్పటికే సినిమా చూసిన కొందరు తన క్యారెక్టర్ గురించి మాట్లాడారని, ఒకటి రెండు సినిమాలే చేసినా గుర్తుపడటం సంతోషంగా ఉందన్నారు.

షూటింగ్‌లో సింక్ సౌండ్ కాస్త టఫ్‌గా అనిపించిందని వేధా చెప్పారు. ఇదివరకే ఆ విధానంలో పని చేసిన అనుభవం ఉన్నా, బయట చిన్న శబ్దం వచ్చినా రికార్డ్ అవుతుండటంతో సెట్లో జాగ్రత్త అవసరమైందన్నారు. షూటింగ్ జరిగిన బస్తీలో స్థానికులు బాగా సహకరించారని, అది దర్శకుడు రమణారెడ్డి అత్తగారి ఏరియా కావడంతో మరింత సపోర్ట్ దొరికిందని నవ్వుతూ చెప్పారు. నిర్మాత మాధవి రెడ్డి పుట్టి పెరిగిన ప్రాంతంలోనే సినిమా చేశామన్నారు. దర్శకుడు ప్రతి సీన్ ముందే వివరించేవారని, డెమో షూట్స్ కూడా చేశామని చెప్పారు. డీఓపీ ఎక్కువగా మాట్లాడకపోయినా పని బాగుంటుందని అన్నారు.

స్మరణ్ మ్యూజిక్ సినిమా ఎమోషన్‌ను బాగా తీసుకొచ్చిందని వేధా చెప్పారు. కొన్ని చోట్ల సీన్స్‌లో పూర్తిగా చెప్పలేని ఫీలింగ్‌ను బీజీఎం పూర్తి చేసిందన్నారు. స్పిరిట్ మీడియా టీమ్ సినిమా చూసి మెచ్చుకుందని, వీఎన్ ఆదిత్య కూడా తన పాత్ర రెగ్యులర్‌గా లేదని చెప్పినట్లు తెలిపారు. రమణారెడ్డి రైటింగ్‌కు నటీనటుల పర్ఫామెన్స్ బాగా కుదిరిందని ఆయన అభినందించారని చెప్పారు. హరి, మనోజ్, శశితో షూటింగ్ సరదాగా సాగిందన్నారు. సినిమాలోని భాష, యాస అర్థం కావడంలో ఇబ్బంది ఉండదని, ఎమోషన్ అందరికీ చేరుతుందనే నమ్మకం ఉందని వేధా తెలిపారు.