Begin typing your search above and press return to search.

హైదరాబాద్ వైబ్స్ తెచ్చేలా 'అమీర్ లోగ్'.. డైరెక్టర్ రమణారెడ్డి కామెంట్స్!

ట్రైలర్ ఎలా ఉందో సినిమా మొత్తం అదే రేంజ్ ఎనర్జీతో సాగుతుందని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.

By:  M Prashanth   |   13 Aug 2026 11:22 PM IST
హైదరాబాద్ వైబ్స్ తెచ్చేలా అమీర్ లోగ్.. డైరెక్టర్ రమణారెడ్డి కామెంట్స్!
X

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న 'అమీర్ లోగ్' సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు రమణారెడ్డి సోమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో ఉన్న కంటెంట్, అది ఇచ్చే ఫ్రెష్ నెస్ చూశాకే కాన్ఫిడెన్స్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

ట్రైలర్ ఎలా ఉందో సినిమా మొత్తం అదే రేంజ్ ఎనర్జీతో సాగుతుందని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. నవ్వులు, గొడవలు, గుండెకు హత్తుకునే ఎమోషన్లు, గుబులు పడే సన్నివేశాలు ఇలా ఒక మనుషుల మధ్య ఉండే ప్రతి భావాన్ని ఇందులో సహజంగా చూపించామని అన్నారు. పక్కా హైదరాబాదీ వైబ్స్ ఉన్న సినిమా వచ్చి చాలా రోజులైందని, ఈ ప్రాజెక్ట్ ఆ లోటును భర్తీ చేస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

అలాగే గతంలో వచ్చిన డాలర్ డ్రీమ్స్, హైదరాబాద్ బ్లూస్, పెళ్లిచూపులు, బలగం లాంటి ప్రాజెక్ట్‌లు ప్రేక్షక ఆదరణ పొందినట్లే, అదే కోవలో 'అమీర్ లోగ్' కూడా నిలుస్తుందని రమణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హైదరాబాద్ బస్తీల్లో ఉండే మనుషులు, వాళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలు, అందమైన సంబంధాల గురించి చెప్పే కథ అని వివరించారు.

ఇది థియేటర్లలో అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేయాల్సిన కమ్యూనిటీ వాచ్ మూవీ అని, పక్కవాళ్లతో కలిసి నవ్వడమే కాదు, భావోద్వేగాలకు గురై ఏడవడం కూడా ఒక రకమైన అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలోనే చూసి ఆదరించాలని కోరారు. ఒక సగటు హైదరాబాదీ లైఫ్ ని స్క్రీన్ మీద చూస్తున్న ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుందని అన్నారు.

ఇక యాంకర్ 'మీ దృష్టిలో అమీర్ లోగ్ అంటే ఎవరు, డబ్బు ఉన్నవాళ్లా లేక ప్రశాంతత ఉన్నవాళ్లా?' అని ప్రశ్నించగా, "అది చెప్పడానికే కదా ఈ రెండన్నర గంటల సినిమా తీసింది. నాకు ఈ విషయం అర్థం కావడానికే 40 ఏళ్లు పట్టింది, మీరు థియేటర్ కి వచ్చి రెండున్నర గంటలలో సినిమా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది" అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు.

రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ప్రెజెంట్ చేస్తున్న ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, యోగి కీలక పాత్రల్లో నటించారు. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతోంది. పక్కా నేటివిటీతో వస్తున్న ఈ హైదరాబాదీ ఫన్ రైడ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.