టైటిల్ చూసి హిందీ సినిమా అనుకున్నారా? అమీర్ లోగ్ పై డైరెక్టర్ క్లారిటీ!
రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా సమర్పణలో రిలీజ్ కు సిద్ధమవుతున్న అమీర్ లోగ్ సినిమా ప్రమోషన్లు వేగం పుంజుకున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 10 Aug 2026 3:20 PM ISTరానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా సమర్పణలో రిలీజ్ కు సిద్ధమవుతున్న అమీర్ లోగ్ సినిమా ప్రమోషన్లు వేగం పుంజుకున్నాయి. డైరెక్టర్ రమణారెడ్డి సోమ తెరకెక్కించిన ఈ సినిమాలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రలు పోషించారు. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది.
హైదరాబాద్ బస్తీలో జీవన విధానం, అక్కడి మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, ఎమోషన్స్ ను ప్రతిబింబించే కథతో ఈ సినిమా రూపొందిందని చిత్రబృందం తెలిపింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ రమణారెడ్డి సోమ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, అమీర్‌లోగ్ లో హైదరాబాద్‌లో సముద్రం ఉందనే అంశం చూపించడంపై స్పందించిన డైరెక్టర్, అది వాస్తవికత కంటే భావోద్వేగానికి సంబంధించిన ప్రతీక అని వివరించారు. ఇతర దేశాల్లో సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు వేర్వేరు మార్గాలు ఎంచుకుంటారని, కానీ భారతీయులలో చాలా మందికి సముద్రం ఒక భావోద్వేగ ఆశ్రయం లాంటిదని, అందుకే ఆ కాన్సెప్ట్‌ను సినిమాలో ఉపయోగించినట్లు చెప్పారు.
ఈ సినిమా స్పిరిట్ మీడియా వద్దకు ఎలా వెళ్లిందనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. సెకండ్ స్క్రీనింగ్‌కు స్పిరిట్ మీడియా ప్రతినిధులను ఆహ్వానించామని, సినిమా చూసిన తర్వాత వారికి బాగా నచ్చడంతో తమ ఆఫీస్‌కు పిలిచారని, తర్వాత రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే రిలీజ్ డీల్ కుదిరిందని చెప్పారు. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాల మధ్య కొత్త నటీనటులతో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం సవాలేనని అంగీకరించిన డైరెక్టర్, స్పిరిట్ మీడియా నుంచి ప్రమోషనల్ పరంగా మంచి సహకారం అందుతోందని తెలిపారు. అయితే చివరికి కంటెంటే ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. అమీర్ లోగ్ ఒక కామన్ మ్యాన్ సినిమా, హైదరాబాద్ మనుషుల కథ అని ఆయన పేర్కొన్నారు.
హీరోయిన్ వేధా జలంధర్ మాట్లాడుతూ, మొదటి రోజు నుంచే ఈ సినిమా తమ సొంత ప్రాజెక్ట్ అన్న అనుభూతి కలిగిందని చెప్పారు. ఆడిషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ బాయ్స్ ఆడిషన్ జరుగుతుందని, వారి మధ్యలోనే తాను కూడా ఆడిషన్ ఇచ్చానని, తన ఆడిషన్ డైరెక్టర్ కు నచ్చడంతో ఈ సినిమాలో అవకాశం దక్కిందని తెలిపారు. సినిమాలో హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని కూడా చిత్రబృందం ప్రత్యేకంగా ప్రస్తావించింది. పోస్టర్లు, టీజర్ చూస్తే ముగ్గురు హీరోల కథలా అనిపించినా, వారందరినీ ప్రభావితం చేసే, కథను ముందుకు నడిపించే పాత్ర హీరోయిన్‌దేనని, ఆమె పాత్ర సినిమాకు ఒక కీలక స్తంభంలా ఉంటుందని చెప్పారు.
అమీర్ లోగ్‌ను పూర్తిగా రియల్ లొకేషన్స్‌లో షూట్ చేసినట్టు డైరెక్టర్ వెల్లడించారు. స్థానిక ప్రజల సహకారం వల్ల షూటింగ్ ఎంతో సాఫీగా జరిగిందని, రాత్రి షూటింగ్‌ల సమయంలో ఫ్యాన్లు, ఏసీలు ఆపేయమన్నా ఎలాంటి ఇబ్బంది చెప్పకుండా సహకరించారని తెలిపారు. ఆ ప్రాంత ప్రజల మద్దతు వల్లే సినిమాకు కావాల్సిన సహజత్వం వచ్చిందని అన్నారు. ఇక ఈ సినిమాలో 10 పాటలను ముందుగానే ప్లాన్ చేయలేదని, ఎడిటింగ్ టైమ్ లో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ను మరింత బలంగా చూపించేందుకు ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి డెసిషన్స్ తీసుకుంటూ చివరకు పాటల సంఖ్య 10కి చేరిందని, అయితే అవి సినిమా ఫ్లోకు ఎక్కడా ఆటంకం కలిగించవని స్పష్టం చేశారు.
సినిమాను తెలంగాణ నేపథ్యంలో రూపొందించినప్పటికీ, ప్రమోషన్లలో ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువ దృష్టి పెట్టడంపై కూడా డైరెక్టర్ మాట్లాడారు. ప్రతి ప్రాంతంలో ఇలాంటి గల్లీలు, ఇలాంటి మనుషులు ఉంటారని, అందుకే ఈ కథ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతోనూ బలంగా కనెక్ట్ అవుతుందనే విశ్వాసం తమకు ఉందన్నారు. టైటిల్ హిందీ సినిమా తరహాలో ఉందనే అపోహను తొలగించేందుకే ఆంధ్రలో ముందుగా ప్రచారం ప్రారంభించినట్లు తెలిపారు.
ముగ్గురు హీరోలకు ఒకే హీరోయిన్ ఉన్న నేపథ్యంలో హీరో ఎవరు? అనే ప్రశ్నకు చిత్రబృందం ఆసక్తికరంగా స్పందించింది. కథను ముందుకు నడిపించేవారే హీరోలు, హీరోయిన్లు అని చెబుతూ, అసలు సమాధానం ఆగస్టు 21న థియేటర్లలో తెలుస్తుందని చెప్పింది. మొత్తంగా చూస్తే, అమీర్ లోగ్ హైదరాబాద్ సంస్కృతి, బస్తీ జీవితం, భావోద్వేగ అనుబంధాలు, స్థానిక భాషా నైజంతో రూపొందిన ఒక ప్రత్యేక ప్రయత్నంగా కనిపిస్తోంది. స్పిరిట్ మీడియా సపోర్ట తో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా కంటెంట్ బలంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేసింది.
