Begin typing your search above and press return to search.

అమీర్ లోగ్.. నైజాంలో సౌండ్ వినిపిస్తే అన్నిచోట్లా వినిపిస్తుంది!- ర‌మ‌ణారెడ్డి

చిత్రీకరణ అనుభవాలను షేర్ చేస్తూ.. కొత్త నటీనటులు ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్ తదితరులు తమ పాత్రల్లో జీవించారని ప్రశంసించారు.

By:  Sivaji Kontham   |   19 Aug 2026 9:47 PM IST
అమీర్ లోగ్.. నైజాంలో సౌండ్ వినిపిస్తే అన్నిచోట్లా వినిపిస్తుంది!- ర‌మ‌ణారెడ్డి
X

హైదరాబాదీ నేటివిటీ, ఓల్డ్ సిటీ నగర సంస్కృతి నేపథ్యంతో రూపుదిద్దుకున్న చిత్రం `అమీర్ లోగ్`. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడిన మాటలు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించాయి. హైద‌రాబాద్ సంస్కృతిపైన ఒక రాజా ర‌వివ‌ర్మ‌, ఎం.ఎఫ్ హుస్సేన్ లాంటి క‌ళాఖండం తీయాల‌నుకున్నాం. ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి ప్ర‌య‌త్నం ఎవ‌రూ చేయ‌లేదు! అని అన్నారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌లో ఉన్న ఎమోష‌న్స్ యూనివ‌ర్శ‌ల్. ఇటీవ‌ల ఈ సినిమా ప్రివ్యూని వీక్షించిన వారి రియాక్ష‌న్స్ చూసాక పూర్తిగా సంతృప్తిగా ఉన్నామ‌ని తెలిపారు. అమాయకత్వం, స్నేహం, పరిసరాల ప్రభావం చుట్టూ తిరిగే ఈ కథను ప్రేక్షకులకు నచ్చే రీతిలో వినోదాత్మకంగా మలిచామని ఆయన వ్యాఖ్యానించారు. నైజాంలో సౌండ్ వినిపిస్తే చాలు.. అన్నిచోట్లా వినిపిస్తుంది. 21వ తేదీన మొద‌టి షో ప‌డిన త‌ర్వాత మీరే చూస్తారు. నైజాంలో ఇది మార్మోగుతుంది! అని కాన్ఫిడెన్స్ ని వ్య‌క్తం చేసారు.

గ‌త ఇంట‌ర్వ్యూల‌లో ర‌మ‌ణారెడ్డి సినిమా వర్గీకరణ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని కేవలం యువతకు మాత్రమే పరిమితం చేయకుండా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు దర్శకుడు రమణా రెడ్డి చెప్పారు. 13 ఏళ్లు దాటిన పిల్లల నుంచి పెద్దల వరకు కుటుంబమంతా కలిసి థియేటర్లో హాయిగా నవ్వుకునేలా ఎలాంటి అసభ్యత లేకుండా క్లీన్ కామెడీతో చిత్రీకరించామని వెల్ల‌డించారు.

చిత్రీకరణ అనుభవాలను షేర్ చేస్తూ.. కొత్త నటీనటులు ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్ తదితరులు తమ పాత్రల్లో జీవించారని ప్రశంసించారు. రాత్రి వేళల్లో సీన్లు రాసుకుని.. మరుసటి రోజు ఉదయమే షూటింగ్‌కి వెళ్లి పనిచేసిన సందర్భాలను గుర్తుచేసుకుంటూ.. చిత్ర నిర్మాణంలో బృందం అందించిన శ్రమను, సహకారాన్ని కొనియాడారు.

సాంకేతిక బృందం గురించి చెబుతూ.. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోశాయని పేర్కొన్నారు. ప్రతి సన్నివేశంలో ఉన్న ఎమోషన్-కామెడీని సంగీతం మరింత పైస్థాయికి తీసుకెళ్లిందని.. ప్రేక్షకులు థియేటర్లలో ఈ మ్యూజికల్ ఫీల్‌ను బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.

చివరగా చిన్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణే ముఖ్యమని గుర్తుచేస్తూ రమణా రెడ్డి అందరికీ విజ్ఞప్తి చేశారు. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని థియేటర్లలో చూసి ప్రోత్సహించాలని.. తమ చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.