ఆయన రైలు ఇంజిన్ అయితే మేమంతా బోగీలం: ఎం.సి.హరి
నటుడు, రాపర్ ఎంసీ హరి తన ప్రసంగంలో సినిమాలోని పాట వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని షేర్ చేసారు.
By: Sivaji Kontham | 19 Aug 2026 10:48 PM ISTహైదరాబాదీ నగర జీవనశైలి, స్థానిక నేటివిటీ నేపథ్యంతో తెరకెక్కిన `అమీర్ లోగ్` చిత్రం ప్రమోషనల్ ఈవెంట్‌లో చిత్రబృందం సందడి నెటిజనుల్లో చర్చగా మారింది. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ, మనోహర్ రెడ్డి మంచూరి నిర్మించిన ఈ సినిమా ఈవెంట్‌లో రాపర్, నటుడు ఎంసీ హరి .. చిత్ర నిర్మాతలు మాట్లాడిన మాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా కంటెంట్ ఎంతో సహజంగా వచ్చిందని, ప్రతీ ఒక్కరినీ అలరించే అంశాలు ఇందులో ఉన్నాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.
నటుడు, రాపర్ ఎంసీ హరి తన ప్రసంగంలో సినిమాలోని పాట వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని షేర్ చేసారు. తన నిజ జీవిత అనుభవాల నుంచే ఈ పాట పుట్టిందని చెబుతూ ``మా నాన్న అంబర్‌పేట్‌లోనే ఉండిపోతావురా అంటే.. అమెరికా వెళ్తే గొడ్డు చాకిరీ ఉంటుంది కానీ..ఇక్కడే మనోళ్లతో బర్త్‌డే చేసుకుంటే పూలమాలలు, గోలలు ఉంటాయి`` అనే లైన్లతో పాట పాడి వినిపించారు. ఈ పాట విన్నాక తన తండ్రి కూడా ``మనోళ్లతో ఉండటమే నిజమైన ఆనందం` అని ఒప్పుకున్నారని.. పైగా ఈ సినిమాతో తన తండ్రిని కూడా నటుడిగా మార్చి తనతో పాటు నటింపజేశానని ఎంసీ హరి సరదాగా గుర్తుచేసుకున్నారు.
ఇక సాంకేతిక బృందం గురించి మాట్లాడిన ఎంసీ హరి వారికి తనదైన శైలిలో ధన్యవాదాలు తెలిపారు. టెక్నీషియన్ రోహిత్ వర్క్ చాలా క్రేజీగా వచ్చిందని మెచ్చుకోవడమే కాకుండా.. సంగీత దర్శకుడు స్మరణ్ సాయిని తన మెంటార్‌గా అభివర్ణించారు. స్మరణ్ ఒక రైలు ఇంజన్ లాంటివారైతే.. తామంతా భోగీల లాంటివారమని.. ఈ ప్రయాణంలో ప్రతి భోగీలోని సంగీతాన్ని ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. ఈ సినిమా ద్వారా తనకు అద్భుతమైన స్నేహితులు, గొప్ప అనుభవం దక్కాయని ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు నిర్మాతలు మాట్లాడుతూ,`అమీర్ లోగ్` కంటెంట్‌పై తమకున్న పూర్తి నమ్మకాన్ని వ్యక్తపరిచారు. హైదరాబాదీ సంస్కృతి, అక్కడి వాతావరణం , వ్యక్తుల జీవన శైలిని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు రమణా రెడ్డి సోమ ఎంతో వినూత్నంగా తెరకెక్కించారని ప్రశంసించారు. అలాగే యంగ్ యాక్టర్స్ ఎంసీ హరి, మనోజ్, శశిధర్‌లతో పాటు సాంకేతిక నిపుణులు అందించిన సహకారం.. స్మరణ్ సాయి సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాను గుర్తించి, దానిని పెద్ద ఎత్తున ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు అండగా నిలిచిన రాణా దగ్గుబాటి `స్పిరిట్ మీడియా` సంస్థకు నిర్మాతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నిర్ణయించేది ఆఖరికి ప్రేక్షకులే కాబట్టి.. చిన్న సినిమాలను.. కొత్త కంటెంట్‌ను ప్రోత్సహించడానికి అందరూ థియేటర్లకు వచ్చి `అమీర్ లోగ్` చిత్రాన్ని చూసి తమ చిత్రబృందాన్ని ఆశీర్వదించాలని కోరారు.
