'అమీర్ లోగ్' ట్రైలర్ టాక్.. బస్తీ కుర్రాళ్ళ మాస్ లైఫ్
క్రికెట్ టోర్నమెంట్ ఆడటానికి పడే పాట్లు, డబ్బు సంపాదన కోసం చేసే వ్యాపార ఆలోచనలు, కిరాక్ బిర్యానీ సెటప్ లాంటివి ట్రైలర్ లో ఫన్ క్రియేట్ చేస్తున్నాయి.
By: M Prashanth | 13 Aug 2026 8:02 PM ISTహైదరాబాద్ పాతబస్తీ సంస్కృతి, అక్కడి యువత జీవితాలు, ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు వచ్చి చాలా రోజులైంది. ఇక ఇప్పుడు ఆ రూట్లో తెరకెక్కుతున్న 'అమీర్ లోగ్' సినిమా టీజర్ నుంచే ఒక వైబ్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ను రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా విడుదల చేస్తోంది. ఇక ఈ ట్రైలర్ పక్కా హైదరాబాదీ నేటివిటీని, ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎమోషన్లను హైలెట్ చేస్తోంది.
లంగర్ హౌస్, లక్ష్మీనగర్ బస్తీ పరిసరాల్లో పెరిగే ముగ్గురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతున్నట్లు అర్థమవుతోంది. డైలీ లైఫ్ లో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఇంట్లో ఎదురయ్యే ఆవేదనలు, పాతబస్తీ గల్లీల్లో ఆడే క్రికెట్ మ్యాచులు, గొడవలు ఇవన్నీ కథలో కీలకమైన ఎలిమెంట్లుగా కనిపిస్తున్నాయి. బస్తీ వాతావరణం, అక్కడి మనుషుల మధ్య ఉండే అనుబంధాలను చాలా సహజంగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
క్రికెట్ టోర్నమెంట్ ఆడటానికి పడే పాట్లు, డబ్బు సంపాదన కోసం చేసే వ్యాపార ఆలోచనలు, కిరాక్ బిర్యానీ సెటప్ లాంటివి ట్రైలర్ లో ఫన్ క్రియేట్ చేస్తున్నాయి. డైలాగ్స్ విషయానికి వస్తే, ఏమాత్రం ఆడంబరాలు లేకుండా హైదరాబాదీ స్లాంగ్ తో రోజువారీ సంభాషణల తరహాలోనే సాగాయి. నాచురల్ లొకేషన్లు, రియలిస్టిక్ సెటప్ సినిమాకి బలంగా నిలిచేలా ఉన్నాయి.
ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, యోగి ముఖ్య పాత్రలు పోషించారు. కొత్త నటీనటులైనప్పటికీ స్క్రీన్ పై ఎక్కడా భయం లేకుండా నటించిన తీరు ఆకట్టుకుంటోంది. స్మరణ్ సాయి అందించిన నేపధ్య సంగీతం, పాటలు బస్తీ వాతావరణానికి సరిపోయేలా కుదిరాయి. అయితే కథాపరంగా చూస్తే బస్తీ నేపధ్యం, ఫ్రెండ్‌షిప్, బిర్యానీ బిజినెస్ లాంటివి గతంలో కొన్ని సినిమాల్లో చూసిన భావన కలిగించినప్పటికీ, కథను మలిచిన తీరు కొత్తగా ఉన్నట్లు అనిపిస్తోంది.
ఇక ఎమోషనల్ పాయింట్ ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనే దానిపైనే బాక్సాఫీస్ విజయం ఆధారపడి ఉంటుంది. ఓవర్ ది టాప్ హంగామా లేకుండా చాలా సింపుల్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇటీవలి కాలంలో ఇలా నేటివిటీని ప్రతిబింబించే చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఆదరణ పొందుతున్నాయి.
పెద్ద స్టార్లు లేకపోయినా, కథలో నిజాయితీ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ చిత్ర బృందం ఉంది. ఈ క్రమంలోనే పాతబస్తీ సంస్కృతిని తెరపై అంతే సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాధవి రెడ్డి సోమ నిర్మించారు. పక్కా నేటివిటీ కంటెంట్ తో, హైదరాబాదీ ఫ్లేవర్ తో వస్తున్న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
