డబ్బున్న వారు అమీర్ లోగా? సంతోషంగా ఉండే వారు అమీర్ లోగా?: డైరెక్టర్ రమణ
అయితే ఆ సినిమా కేవలం ముగ్గురు యువకుల కథ మాత్రమే కాదని, "డబ్బున్న వారే అమీర్ లోగా? లేక సంతోషంగా ఉండే వారే అసలైన అమీర్ లోగా?" అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నమని దర్శకుడు రమణా రెడ్డి సోమ తెలిపారు.
By: M Prashanth | 25 July 2026 10:26 PM ISTహైదరాబాద్ పాతబస్తీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన అమీర్ లోగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఆ సినిమా కేవలం ముగ్గురు యువకుల కథ మాత్రమే కాదని, "డబ్బున్న వారే అమీర్ లోగా? లేక సంతోషంగా ఉండే వారే అసలైన అమీర్ లోగా?" అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నమని దర్శకుడు రమణా రెడ్డి సోమ తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ రూపొందించిన ఫస్ట్ మూవీ అమీర్ లోగ్. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రలు పోషించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, యోగి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఆ సినిమాను ఆగస్టు 21న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మూవీ టీమ్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించడంతో పాటు అవ్వల్ దావత్ పాటను విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలోని మనుషులు, వారి లైఫ్ స్టైల్, ఎమోషన్స్ సిల్వర్ స్క్రీన్ పై చూపించాలనే ఉద్దేశంతో ఆ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు.
"మాది నల్గొండ జిల్లా రాఘవపురం. 1997లో హైదరాబాద్ కు వచ్చాను. అప్పటి నుంచి నగరంలో ఎన్నో ప్రాంతాల్లో జీవించాను. హైదరాబాద్ నాకు ఎంతో ఇచ్చింది. అందుకే ఇక్కడి మనుషుల కథ చెప్పాలని అనిపించింది. ముందుగా మా టీమ్ కు సినిమా చూపించాం. తర్వాత స్పిరిట్ మీడియా ప్రతినిధులకు ప్రదర్శించాం. వారికి సినిమా నచ్చడంతో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు" అని తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ, "సినిమాలో ఓ ఫిలాసఫీ ఉంటుంది. కానీ అది నీతులు చెప్పేలా ఉండదు. డబ్బు ఉంటేనే మనిషి అమీర్ అవుతాడా? లేక మనసులో సంతోషం ఉంటేనే అసలైన సంపద అనుకోవాలా? అనే అంశాన్ని చాలా సహజంగా చూపించాం. సినిమా చూసిన తర్వాత హైదరాబాద్ మనుషులపై ప్రేక్షకులకు మరింత ప్రేమ, గౌరవం పెరుగుతుంది" అని పేర్కొన్నారు. నిర్మాత మాధవి రెడ్డి సోమ మాట్లాడుతూ, "సినిమాలో చూపించిన బస్తీలోనే నేను పుట్టి పెరిగాను. అక్కడి నుంచి ఈ స్థాయికి రావడానికి నా భర్త రమణా రెడ్డి ఎంతో ప్రోత్సాహం అందించారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాను ఆదరించాలని కోరుతున్నాను" అని అన్నారు.
కాగా, అమీర్ లోగ్ కథ హైదరాబాద్ పాతబస్తీ గల్లీల్లో తిరిగే ముగ్గురు మిడిల్ క్లాస్ యువకుల చుట్టూ తిరుగుతుంది. కెరీర్‌లో ఇంకా స్థిరపడని ఆ ఫ్రెండ్స్ క్రికెట్ గ్రౌండ్ కోసం చేసే పోరాటాలు, వీధి పంచాయతీలు, కుటుంబ సభ్యుల మందలింపులు, ఆర్థిక ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నారు? వారి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? అన్న అంశాలను దర్శకుడు ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
