'అమీర్ లోగ్' ఈవెంట్‌లో నటుడు మనోజ్ భావోద్వేగం
ఒక నటుడిగా తన కెరీర్ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. ప్రతి నటుడికి కూడా తాము నటించగలమని, జనాలకు బాగా తెలిసే లేదా గుర్తించే మంచి పాత్ర వస్తే చాలని ఆశిస్తారని తెలిపారు.
By: Sivaji Kontham | 19 Aug 2026 10:42 PM ISTహైదరాబాదీ నేటివిటీ, ఓల్డ్ సిటీ నగర సంస్కృతి, జీవన విధానం నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం `అమీర్ లోగ్`. తాజాగా ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్‌లో నటుడు మనోజ్ పాల్గొని మాట్లాడారు. సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రేక్షకులతో పాటు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోందని..తమ చిత్ర బృందానికి ఎంతో మంది అభినందనలు - ప్రేమను తెలియజేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ లవ్, సపోర్ట్‌కి తమ టీమ్ అందరూ ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని వ్యాఖ్యానించారు.
ఒక నటుడిగా తన కెరీర్ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. ప్రతి నటుడికి కూడా తాము నటించగలమని, జనాలకు బాగా తెలిసే లేదా గుర్తించే మంచి పాత్ర వస్తే చాలని ఆశిస్తారని తెలిపారు. సరైన అవకాశాల కోసం వెతుకుతున్న క్రమంలో `అమీర్ లోగ్` చిత్రం ఒక మంచి సర్ ప్రైజ్ లా తన ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. గతంలో తాము పడ్డ కష్టాలు, ఆ క్రమంలో ఎదురైన చిన్న చిన్న మైలురాళ్లు ఎంతో నేర్పించాయని మనోజ్ తెలిపారు.
సినిమాల్లో ఆరంభంలో రెండు, మూడు రోజుల చిన్న పాత్రలు చేసినప్పుడు.. అవి ఎడిటింగ్‌లో ఉంటాయో లేదో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయని మనోజ్ అన్నారు. కానీ ఆ పాత్రలు చేస్తున్నప్పుడు సెట్‌లో దక్కిన స్పందన, స్క్రీన్ పై కనిపించినప్పుడు వచ్చే గుర్తింపు కొత్తగా వచ్చే నటులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయని చెప్పారు. అలాంటి చిన్న మైలురాళ్లే తమలాంటి నటులకు నమ్మకాన్ని.. భవిష్యత్తుపై కొత్త ఆశను పెంపొందిస్తాయని వివరించారు.
చాలా ఏళ్లపాటు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ పొతే ఎప్పటికో పదేళ్లకు ఒక మంచి పాత్ర వస్తుందేమో అని గతంలో అనుకునేవాడినని.. అయితే `అమీర్ లోగ్` సినిమా తనకు ఊహించని పెద్ద పుష్ ఇచ్చిందని తెలిపారు. తనకు సినిమాలో హీరోగా లేదా లీడ్ రోల్ మాత్రమే చేయాలనే పట్టుదలేమీ లేదని.. కానీ ఈ చిత్రం ఇచ్చిన హోప్ -కాన్ఫిడెన్స్ మునుముందు పదేళ్ల పాటు చిత్ర పరిశ్రమలో ప్రయాణించడానికి సరిపడా ధైర్యాన్ని ఇచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు.
చివరగా తానొకవేళ ఈ సినిమా తర్వాత సినిమాలు చేయడం ఆపేసినా `అమీర్ లోగ్`లో చేసిన నటన, అనుభవం తన మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన చిత్ర దర్శకుడికి, నిర్మాతకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈవెంట్‌లో పాల్గొని తమను ఎంతో ప్రోత్సహించిన ప్రొడ్యూసర్ కి, చిత్ర బృందానికి మనోజ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
