Begin typing your search above and press return to search.

బాబు థియేటర్.. అక్కడ క్లిక్కయ్యేలా బిగ్ ప్లాన్

అయితే బెంగళూరులో ఏఎంబీ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ సినిమా స్క్రీన్ ను పరిచయం చేస్తుంది. ఇప్పటి వరకు ఇండియాలో పుణెలో ఒకే ఒక్క డాల్బీ విజన్ స్క్రీన్ ఉన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   11 Dec 2025 7:19 PM IST
బాబు థియేటర్.. అక్కడ క్లిక్కయ్యేలా బిగ్ ప్లాన్
X

హైదరాబాద్ లో ఎన్నో మల్టీప్లెక్సులు ఉండగా.. అందులో ఏఎంబీ సినిమాస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రీమియం మల్టీప్లెక్స్ చైన్.. అత్యాధునిక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తూ దూసుకుపోతోంది. హైదరాబాద్ లో టాప్ మూవీ డెస్టినేషన్ గా క్రేజ్ సొంతం చేసుకుని సందడి చేస్తోంది.

2019లో ఆసియాన్ సినిమాస్- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ఏర్పాటు చేసిన ఏఎంబీ సినిమాస్.. ఇక‌పై బెంగళూరులో కూడా సందడి చేయనుంది. కపాలి థియేటర్ ప్రాంగణంలో కొత్త AMB సినిమాస్ అవుట్‌ లెట్ రాబోతోంది. బెంగ‌ళూరు న‌డిబొడ్డున ఏర్పాటు చేసిన ఆ అల్ట్రా లగ్జరీ మల్టీప్లెక్స్ త్వరలోప్రారంభం కానుంది.

డిసెంబర్ 16వ తేదీన మల్టీప్లెక్స్ ను ప్రారంభించేందుకు ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారు అవ్వగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు వెళ్లి ఓపెన్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన వారణాసి మూవీ షూటింగ్ లో బిజీగా ఉండగా.. 16వ తేదీ బెంగళూరు వెళ్లడానికి షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది.

అయితే బెంగళూరులో ఏఎంబీ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ సినిమా స్క్రీన్ ను పరిచయం చేస్తుంది. ఇప్పటి వరకు ఇండియాలో పుణెలో ఒకే ఒక్క డాల్బీ విజన్ స్క్రీన్ ఉన్న విషయం తెలిసిందే. అది నార్త్ లో ఉండగా.. ఇప్పుడు సౌత్ లో మొదటి డాల్బీ సినిమా స్క్రీన్ AMB కపాలిలో అందుబాటులోకి రానుంది.

అదే సమయంలో ఏఏంబీ బెంగ‌ళూరు మల్టీప్లెక్స్‌ లోని మొత్తం తొమ్మిది స్క్రీన్లు ఉండగా.. అన్ని కూడా అత్యుత్తమ సాంకేతికతతో ఏర్పాటు అవుతున్నాయి. అందులో ఒకటి డాల్బీ స్క్రీన్ కాగా.. అది 60 అడుగుల విస్తీర్ణంతో ఉండ‌నుండ‌డం విశేషం. ఇది పుణెలోని డాల్బీ స్క్రీన్ కంటే 5 అడుగులు పెద్దది కావడం గమనార్హం.

కాగా.. ఏఎంబీ బెంగళూరులోని అన్ని స్కీన్లలో కూడా 4K లేజర్ ప్రొజెక్షన్ ఫీచర్ ఉండనుంది. నాలుగు స్క్రీన్లలో డాల్బీ ఎట్మాస్ సౌండ్, మిగతా నాలుగు స్క్రీన్లలో Dolby 7.1 సౌండ్ ఫీచర్ ఉండనుంది. డాల్బీ సినిమా స్క్రీన్‌.. డ్యూయల్ 4K Dolby Vision ప్రొజెక్టర్, Dolby 3D సపోర్ట్, 64 ఛానల్ Atmos సౌండ్ సెటప్ ప్ర‌త్యేకత‌లు క‌లిగి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఏఎంబీ సక్సెస్ అవ్వగా.. బెంగళూరులో ఎంతటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.