Begin typing your search above and press return to search.

ఓటీటీలో యాడ్స్ వివాదం.. అసలేం జరుగుతోంది?

అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కనిపిస్తున్న యాడ్స్.. యూజర్లలో కొత్త చర్చకు దారితీశాయి.

By:  M Prashanth   |   11 Jun 2026 6:00 PM IST
ఓటీటీలో యాడ్స్ వివాదం.. అసలేం జరుగుతోంది?
X

ఓటీటీలు వచ్చాక సినీ ప్రియులు దాదాపు కేబుల్ టీవీకి దూరమయ్యారు. నచ్చిన సినిమా, వెబ్‌ సిరీస్‌ ను ఎలాంటి బ్రేక్ లేకుండా చూసే ఛాన్స్ ఉండటంతో కోట్లాది మంది ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ కు సబ్స్క్రైబ్ అయ్యారు. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కనిపిస్తున్న యాడ్స్.. యూజర్లలో కొత్త చర్చకు దారితీశాయి.

ఇప్పటికే ప్రైమ్ మెంబర్‌ షిప్ కోసం డబ్బులు చెల్లించినా.. సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు చూస్తున్న సమయంలో యాడ్స్ రావడంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది యాప్‌ లో వచ్చిన లోపం కాదు. అమెజాన్ కొత్త విధానమే. ఇండియాలోని నార్మల్ ప్రైమ్ సబ్‌ స్క్రైబర్లకు ఇప్పుడు కొన్ని కంటెంట్ల మధ్య లిమిటెడ్ యాడ్స్ చూపిస్తున్నారు. క్వాలిటీ కంటెంట్‌ ను రూపొందించేందుకు, మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ చెబుతోంది.

అయితే అసలు వివాదం ఇక్కడే మొదలైంది. ప్రకటనలు లేకుండా కంటెంట్ చూడాలంటే అదనంగా యాడ్-ఫ్రీ ప్లాన్ తీసుకోవాలని అమెజాన్ సూచిస్తోంది. ఇప్పటికే యాన్యువల్ ప్రైమ్ మెంబర్‌ షిప్ కోసం రూ.1,499 చెల్లించిన వినియోగదారులు, యాడ్స్ లేకుండా చూడటానికి మరో రూ.799 వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే మొత్తం దాదాపు రూ.2,300 చెల్లించినట్లే. అయినప్పటికీ కొన్ని సినిమాలు, షోలు చూస్తున్నప్పుడు ప్రకటనలు వస్తుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. యాడ్-ఫ్రీ ప్లాన్ అనేది ప్రైమ్ వీడియో ఒరిజినల్స్, ప్రైమ్‌ తో నేరుగా అందించే కంటెంట్‌ కు మాత్రమే వర్తిస్తుంది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌ లో ఉండే కంటెంట్ మాత్రం పూర్తిగా ప్రకటనల ఆధారంగా కొనసాగుతుంది. గతంలో మినీటీవీగా ఉన్న ఆ సర్వీస్ కు యాడ్-ఫ్రీ ఆప్షన్ వర్తించదు. అలాగే లైవ్ స్పోర్ట్స్‌ కు కూడా మినహాయింపు ఉండదు.

క్రికెట్ మ్యాచ్‌ లు లేదా ఇతర లైవ్స్ చూస్తున్న సమయంలో ప్రకటనలు కనిపిస్తాయి. లైవ్ టీవీ ఛానెల్స్‌ లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మరోవైపు సినిమా లేదా వెబ్‌ సిరీస్ ప్రారంభానికి ముందు వచ్చే ప్రమోషనల్ ట్రైలర్లను పూర్తిగా రిమూవ్ చేయలేరు. అయితే వాటిని స్కిప్ చేసే అవకాశం మాత్రం ఉంటుంది. ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండే ఇతర పార్టనర్స్ కంటెంట్‌ కు కూడా వాటి సొంత రూల్స్ ఉంటాయి.

ఉదాహరణకు థర్డ్ పార్టీ ఛానెల్స్‌ లో వచ్చే యాడ్స్ ను అమెజాన్ యాడ్-ఫ్రీ ప్లాన్ పూర్తిగా ఆపలేదు. దీంతో ఎక్స్ ట్రా డబ్బులు చెల్లించిన తర్వాత కూడా యాడ్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాక చాలామంది సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల వాదన మాత్రం చాలా సింపుల్‌ గా ఉంది. యాడ్-ఫ్రీ కోసం డబ్బులు చెల్లిస్తే ఎలాంటి యాడ్స్ రాకూడదని వారు భావిస్తున్నారు.

కానీ అమెజాన్ మాత్రం కొన్ని కంటెంట్ కేటగిరీలకు మాత్రమే అది వర్తిస్తుందని చెబుతోంది. నిబంధనల ప్రకారం చూస్తే సంస్థ తప్పు చేయకపోయినా, వినియోగదారుల అంచనాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకప్పుడు టీవీలో ప్రకటనలతో విసిగిపోయి ఓటీటీల వైపు వచ్చిన ప్రేక్షకులు.. ఇప్పుడు మళ్లీ అదే అనుభవం ఎదురవుతోందంటూ అభిప్రాయపడుతున్నారు. ఓటీటీలకు డబ్బులు చెల్లించడంలో మెయిన్ రీజన్ యాడ్స్ లేని ఎంటర్టైన్మెంట్ పొందడమే. కానీ ఎక్స్ ట్రా ఖర్చు చేసిన తర్వాత కూడా అదే ప్రయోజనం పూర్తిగా దక్కకపోతే అసంతృప్తి పెరగడం కామనే.