Begin typing your search above and press return to search.

వార‌సుడి వెన‌క‌బాటుత‌నంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్మాత కామెంట్లు

ఈ విషయమై ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ.. తాను సొంత సినిమాల నిర్మాణ పనుల్లో అత్యంత బిజీగా ఉండటం వల్ల కుమారుడి కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేయలేకపోయానని పేర్కొన్నారు.

By:  Sivaji Kontham   |   24 Oct 2026 9:49 AM IST
వార‌సుడి వెన‌క‌బాటుత‌నంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్మాత కామెంట్లు
X

ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాత, పవన్ కళ్యాణ్ `హరిహర వీరమల్లు` చిత్ర నిర్మాత అయిన ఎ.ఎం. రత్నం తన కుమారుడు రవికృష్ణ సినీ కెరీర్ వెనుకబాటుతనంపై తాజాగా స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. `7/G బృందావన కాలనీ` వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన రవికృష్ణ.. ఆ తర్వాత ఇతర సినీ వారసుల మాదిరిగా ఇండస్ట్రీని ఏలలేకపోయారు. రవికృష్ణ కెరీర్ ఆశించిన స్థాయిలో స్థిరపడకపోవడానికి గల అసలు కారణాలను ఆయన తండ్రి ఎ.ఎం. రత్నం బహిరంగంగా అంగీకరించారు.

ఈ విషయమై ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ.. తాను సొంత సినిమాల నిర్మాణ పనుల్లో అత్యంత బిజీగా ఉండటం వల్ల కుమారుడి కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేయలేకపోయానని పేర్కొన్నారు. రవికృష్ణను ఒక స్టార్‌గా నిలబెట్టేందుకు తగిన మార్గదర్శకత్వం ఇవ్వలేకపోవడమే తన పెద్ద తప్పు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్ ప్రారంభంలో రవికృష్ణకు బయటి బ్యానర్ల నుంచి దాదాపు 20 నుండి 30 సినిమాల వరకు భారీ ఆఫర్లు వచ్చినా.. కథలు నచ్చక అతడు చాలా సినిమాలను తిరస్కరించినట్లు తెలిపారు.

రవికృష్ణ నేపథ్యం విషయానికి వస్తే.. నెల్లూరుకు చెందిన అత‌డు లండన్‌లో మల్టీమీడియాలో బీఏ పూర్తి చేసి, సినిమాలపై పెద్దగా ఆసక్తి లేకుండానే యాక్టింగ్‌లోకి అడుగుపెట్టారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన `7G రెయిన్‌బో కాలనీ`(7/ జి బృందావ‌న కాల‌నీ - తెలుగు) సినిమాతో అరంగేట్రం చేసి ఉత్తమ నటుడిగా సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత సుక్రన్, కేడీ, బ్రహ్మానందం డ్రామా కంపెనీ వంటి చిత్రాల్లో నటించినా సరైన ప్లానింగ్ - బడ్జెట్ లోపాల వల్ల ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి.

అయితే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్.పి.బి. చరణ్ నిర్మాణంలో వచ్చిన జాతీయ అవార్డు గ్రహీత చిత్రం `ఆరణ్య కాండమ్`లో రవికృష్ణ చేసిన పాత్ర అత్యంత భిన్నమైనది. ఈ చిత్రంలో అత‌డి నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి గుర్తింపు కూడా లభించింది. ఆ సినిమా తర్వాత సుమారు 14 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న రవికృష్ణ ప్రస్తుతం `7/G రెయిన్‌బో కాలనీ 2` చిత్రంతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి తన పాత పాత్రను మళ్లీ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

`7జి రెయిన్‌బో కాలనీ 2` సినిమాపై దర్శకుడు సెల్వరాఘవన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదటి భాగంలో నాయిక చనిపోవడం, హీరో ఒంటరిగా తిరుగుతుండటంతో ఈ సీక్వెల్ కథను ఎలా నడిపించాలనేది నిర్మాత ఎ.ఎం. రత్నం గారితో పాటు తనకు కూడా ఒక పెద్ద సవాల్‌గా అనిపించిందని.. దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఈ కథను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కథానాయకుడు కదిర్ (ర‌వికృష్ణ‌) ఇప్పుడు ఏం చేస్తాడు? ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం ఎలా అందుకుంటుంది అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమా తొంద‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని... మళ్లీ ఆ మ్యాజికల్ బీజీఎంను, కదిర్ పాత్రను తెరపై అనుభూతి చెందవచ్చని ఆయన ఎంతో కాన్ఫిడెంట్‌గా తెలిపారు.