పులి అవసరం లేదు… సిమ్యులేషన్ చాలు!
ఇదే సమయంలో భారతీయ సినీ పరిశ్రమ కూడా టెక్నాలజీ వినియోగంలో వేగంగా ముందుకు సాగుతోంది.
By: Sravani Lakshmi Srungarapu | 6 March 2026 6:33 PM ISTసినీ ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ అభివృద్ధి కారణంగా సినిమా తయారీ విధానమే కొత్త దిశలోకి వెళ్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీఎఫ్ఎక్స్, మోషన్ క్యాప్చర్ లాంటి ఆధునిక సాంకేతికతల వల్ల దర్శకుల కల్పనలకు కొత్త రెక్కలు వచ్చాయి. ఒకప్పుడు నెలల తరబడి పడే పనులను ఇప్పుడు కొద్ది రోజుల్లోనే పూర్తి చేయగల పరిస్థితి ఏర్పడుతోంది. ఇదే సమయంలో భారతీయ సినీ పరిశ్రమ కూడా టెక్నాలజీ వినియోగంలో వేగంగా ముందుకు సాగుతోంది.
ఎక్కువైన వీఎఫ్ఎక్స్ వినియోగం
బాహుబలి సినిమాల సక్సెస్ తర్వాత ఇండియన్ సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ వినియోగం భారీగా పెరిగింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఫాంటసీ ప్రపంచాలు, డిజిటల్ క్యారెక్టర్లు లాంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే అత్యుత్తమ వీఎఫ్ఎక్స్ కోసం విదేశీ నిపుణులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఇప్పటివరకు ఎక్కువగా ఉండేది. ఈ పరిస్థితిని మార్చేందుకు హైదరాబాద్‌లో ఇటీవలే ఓ కీలక అడుగు పడింది.
అత్యాధునిక టెక్నాలజీతో ల్యాబ్
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ కలిసి అత్యాధునిక మోషన్ క్యాప్చర్ సదుపాయంతో A&M MoCapLab అనే ప్రత్యేక విజువల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రాజమౌళి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ల్యాబ్, భారతదేశంలో అత్యంత ఆధునిక మోషన్ క్యాప్చర్ సదుపాయాల్లో ఇది ఒకటిగా ఉంటుందని సుప్రియ యార్లగడ్డ, శోభు యార్లగడ్డ చెప్తున్నారు. రీసెంట్ గా ఈ ల్యాబ్ సామర్థ్యాల గురించి వారు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఈ ల్యాబ్ ద్వారా పూర్తిగా డిజిటల్ క్యారెక్టర్లను సృష్టించడం మాత్రమే కాదు, వాటికి జీవం పోసినట్టుగా నిజ జీవితానికి దగ్గరగా చూపించగల టెక్నాలజీ అందుబాటులో ఉందని తెలిపారు. నటుల కదలికలు, ఎమోషన్స్, బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మార్చి, అద్భుతమైన విజువల్ వండర్ ను ఆడియన్స్ కు అందించవచ్చని చెప్పారు.
ఈ సందర్భంగా RRR సినిమాలోని పులి ఎపిసోడ్ గురించి కూడా చర్చ వచ్చింది. ఆ సినిమాలో పులితో కూడిన యాక్షన్ సన్నివేశాన్ని రూపొందించడానికి టీమ్ చాలా కష్టపడాల్సి వచ్చిందని అప్పట్లో చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటి సన్నివేశాలను ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీతో మరింత సులభంగా చేయగలమా అని అడిగిన ప్రశ్నకు శోభు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇప్పుడైతే నిజంగా పులిని తీసుకురావాల్సిన అవసరం లేకుండానే పూర్తిగా డిజిటల్‌గా దాన్ని సిమ్యులేట్ చేసి, నిజమైనదిలా కనిపించేలా సృష్టించవచ్చని ఆయన తెలిపారు.
ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రావడం భారతీయ సినిమాలకు కొత్త అవకాశాలను తెరవనుంది. భారీ బడ్జెట్ అవసరం లేకుండానే గొప్ప విజువల్ అనుభూతులను సృష్టించే అవకాశం కలుగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఫాంటసీ, మైథాలజీ, యాక్షన్ సినిమాల తయారీలో ఈ ల్యాబ్ కీలక పాత్ర పోషించే అవకాశముంది. మొత్తంగా చూస్తే, A&M MoCapLab భారతీయ సినిమా టెక్నాలజీ ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచే అవకాశముంది.
