మెగా కాంపౌండ్‌లో వినాయక చవితి వైభవం.. వేడుకల్లో క్లిన్ కారా!
మెగాస్టార్ చిరంజీవి బాటలో అడుగులు వేస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అటు సినీ రంగంలో తిరుగులేని విజయాలతో పాటు.. ఇటు వ్యక్తిగతంగా అంతులేని దైవభక్తిని, ఆధ్యాత్మిక చింతనను ప్రదర్శిస్తుంటారు.
By: Sivaji Kontham | 14 Sept 2026 8:13 PM ISTమెగాస్టార్ చిరంజీవి బాటలో అడుగులు వేస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అటు సినీ రంగంలో తిరుగులేని విజయాలతో పాటు.. ఇటు వ్యక్తిగతంగా అంతులేని దైవభక్తిని, ఆధ్యాత్మిక చింతనను ప్రదర్శిస్తుంటారు. పండగలు, ప్రత్యేక సందర్భాలలో కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలలో పాల్గొనడం.. తోటివారికి ఎల్లప్పుడూ అండగా ఉండటం మెగా కుటుంబం ప్రత్యేకత. అభిమానులు సైతం ఆ కుటుంబంలోని సంప్రదాయాలను, వినయాన్ని ఎంతో ఆరాధిస్తుంటారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతూ రామ్ చరణ్ కేవలం నటుడిగానే కాకుండా మంచి మనసున్న మనిషిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.
తాజాగా వినాయక చవితి పర్వదినం సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అజయ్-అతుల్ సంగీతంలో ట్రెండింగ్‌లో ఉన్న గణపతి ఆరతీ సాంగ్‌ను షేర్ చేస్తూ చరణ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఈ పోస్ట్‌పై స్పందించిన అభిమానులు ``హ్యాపీ వినాయకచవితి అన్నయ్య`` అంటూ రిప్లై ఇవ్వడం మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో బిజీగా ఉన్నా చరణ్ పండుగలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇదిలాఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ కెరీర్‌కు సంబంధించి మరో క్రేజీ ప్రాజెక్ట్ చర్చల్లో నిలుస్తోంది. ఇండస్ట్రీ హిట్ `రంగస్థలం` తర్వాత మరోసారి టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి పనిచేయడానికి రామ్ చరణ్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబుతో పెద్ది గ్రాండ్ సక్సెస్ తర్వాత సుక్కూతో సినిమా కోసం తన లుక్ ని మార్చేస్తున్నాడు. తాత్కాలికంగా ఈ RC17గా పిలుస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్‌ను లాక్ చేయగా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని త్వరలోనే లాంచ్ చేసి నవంబర్ నాటికి రెగ్యులర్ షూటింగ్ సెట్స్ పైకి తీసుకువెళ్లేలా చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. `రంగస్థలం` వంటి అద్భుతమైన గ్రామీణ నేపధ్య చిత్రం తర్వాత సుకుమార్- చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ కొత్త ప్రాజెక్ట్‌తో రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు `రంగస్థలం` చిత్రంతో మిస్సయిన జాతీయ అవార్డ్ ని ఈసారి పట్టుదలగా అందించేందుకు సుకుమార్ స్క్రిప్టు పరంగా, చరణ్ పాత్ర పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
మెగా కాంపౌండ్ లో ప్రతి పండుగను కుటుంబ సభ్యులంతా కలిసి ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి, శ్రీరామనవమి, దసరా, దీపావళి, వినాయకచవితి వంటి ప్రతీ పండగను అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకునే మెగా కుటుంబం వినాయక చవితి తర్వాత రాబోవు బతుకమ్మ, విజయదశమి, దీపావళి వేడుకలను కూడా అదే రీతిలో సాంప్రదాయబద్ధంగా అంబరాన్ని అంటే సంబరాలతో వైభవంగా జరుపుకోనుంది.
