క్రిస్మస్ బిగ్ ఫైట్... స్పై థ్రిల్లర్ VS యాక్షన్ థ్రిల్లర్
టాలీవుడ్‌లో సంక్రాంతి, దసరాకి ఎక్కువగా సినిమాలు విడుదల కావడం మనం చూస్తూ ఉంటాం.
By: Ramesh Palla | 12 Sept 2025 2:00 PM ISTటాలీవుడ్‌లో సంక్రాంతి, దసరాకి ఎక్కువగా సినిమాలు విడుదల కావడం మనం చూస్తూ ఉంటాం. అలాగే బాలీవుడ్‌లోనూ రంజాన్, దీపావళి ఆ తర్వాత క్రిస్మస్‌కి ఎక్కువగా సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. బాలీవుడ్‌లో ప్రతి ఏడాది క్రిస్మస్‌కి రెండు మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం మనం చూస్తూ ఉంటాం. ఈ ఏడాది క్రిస్మస్‌కి ఆలియా భట్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ 'ఆల్ఫా'ను తీసుకు వచ్చేందుకు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ రెడీ అవుతోంది. YRF వారు బ్యాక్ టు బ్యాక్ స్పై థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇటీవలే హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లతో నిర్మించిన 'వార్ 2' తో వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో ఇప్పుడు ఆలియా భట్ ఆల్ఫా సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. తప్పకుండా ఆలియా మొదటి స్పై థ్రిల్లర్‌తో హిట్ కొట్టేలా ఉందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
ఆలియా భట్ హీరోయిన్‌గా ఆల్ఫా మూవీ
ఇప్పటి వరకు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన స్పై థ్రిల్లర్స్‌లో హీరోలు మెయిన్ లీడ్ పోషిస్తూ వచ్చారు. మొదటి సారి లేడీ ఓరియంటెడ్ స్పై థ్రిల్లర్‌ను YRF సంస్థ తీసుకు రానున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆలియా భట్ స్పై పాత్రలో కనిపించబోతుంది. అందుకోసం ఆలియా చాలా కష్టపడిందని, ఆమె చేసే యాక్షన్ సీన్స్ ఖచ్చితంగా యాక్షన్ ప్రేక్షకులకు నచ్చుతాయనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా చివరి దశ షూటింగ్ వర్క్ జరుగుతుందని, మరో వైపు వీఎఫ్‌ఎక్స్ వర్క్, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అతి త్వరలోనే ఆల్ఫా నుంచి బిగ్ అప్‌డేట్ ను ఇచ్చేందుకు గాను దర్శకుడు శివ్ రావైల్ రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కావడం పక్కా అని యశ్ రాజ్ ఫిల్మ్స్ వర్గాల వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
అడవి శేష్, మృణాల్ ల డెకాయిట్
ఒక వైపు 2025 క్రిస్మస్‌కి ఆలియా భట్ ఆల్ఫా సినిమాతో రెడీ అవుతూ ఉంటే మరో వైపు ఆమెకు పోటీగా అడవి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన 'డెకాయిట్' విడుదలకు రెడీ అవుతోంది. షానియల్ డియో దర్శకత్వంలో ఈ సినిమా తెలుగుతో పాటు సమాంతరంగా హిందీలోనూ రూపొందుతోంది. ఒక డైరెక్ట్ హిందీ సినిమా మాదిరిగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విభిన్నమైన ప్రేమ కథ చుట్టూ తిరిగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అడవి శేష్ పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుందని, అంతకు మించి మృణాల్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతుంది అంటున్నారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల కంటే కూడా ఎక్కువగా హిందీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అనే విశ్వాసంను చిత్ర యూనిట్ సభ్యుల వారు వ్యక్తం చేస్తున్నారు.
స్పై థ్రిల్లర్ ఆల్ఫా వర్సెస్ యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల చేసేందుకు గాను ప్రమోషన్ కార్యక్రమాలకు రెడీ అవుతున్నాయి. నిర్మాతలు మాట్లాడుకుని కనీసం ఒక్క రోజు తేడాతో అయినా రిలీజ్ చేస్తే రెండు సినిమాలకు పెద్ద నష్టం తప్పుతుంది అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్య కాలంలో బాలీవుడ్ సినిమాల పరిస్థితి అస్సలు బాగుండటం లేదు. భారీ హిట్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లడం లేదు, మినిమం టాక్ వచ్చినా వసూళ్లు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. కనుక ఓపెనింగ్ అనేది అత్యంత కీలకం అంటారు.
ఇలాంటి సమయంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఒకే సారి రావడం వల్ల ఖచ్చితంగా రెండు సినిమాలకు డ్యామేజీ అనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతిమంగా మాత్రం హిట్ అయిన సినిమాకే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో పై చేయి సాధించే సినిమా ఏది, ఏ సినిమా అత్యధిక వసూళ్లు సాధించి బాలీవుడ్‌లో క్రిస్మస్ 2025 విజేతగా నిలుస్తుంది అనేది చూడాలి.
