'ఆల్ఫా' బ్యూటీలు ముగించేసారా?
అన్ని అనుకున్నట్లు జరిగితే యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన స్పై థ్రిల్లర్ 'ఆల్ఫా' ఇప్పటికే రిలీజ్ అవ్వాలి.
By: Srikanth Kontham | 26 Jan 2026 8:00 PM ISTఅన్ని అనుకున్నట్లు జరిగితే యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన స్పై థ్రిల్లర్ 'ఆల్ఫా' ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేసారు. కానీ షూటింగ్ అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడంతో వాయిదా తప్పలేదు. దీంతో చిత్రాన్ని ఏప్రిల్ కి వాయిదా వేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏంటి? ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తోన్న అలియాభట్, శార్వరీ వాఘ్ తమ పోర్షన్ షూటింగ్ ముగించి రిలీవ్ అయిపోయారు. పెండింగ్ షూటింగ్ ముగించే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారు. అలాగే సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్ పాత్ర కీలకమైంది.
దీంతో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు. అనుకున్న దానికంటే విజువల్ ఎఫెక్ట్స్ పనులకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశం కూడా రిలీజ్ వాయిదాకు ఓ ప్రధాన కారణంగా వెలుగులోకి వస్తోంది. అలాగే హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లను ఎడిట్ చేయడానికి కొంత మంది హాలీవుడ్ టెక్నిషీయన్లు సినిమాకు పని చేస్తున్నారు. ఆలియా భట్, శర్వరీలతో బాబీ డియోల్ పవర్‌ఫుల్ విలన్‌గా తలపడనున్నారు. ఈ ముగ్గురి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టీమ్ ధీమా వ్యక్తం చేసింది.
బాలీవుడ్ లో ఇంత వరకూ లేడీ స్పై సినిమాలు రాలేదు. ఆ రకంగా యశ్ రాజ్ ఫిలింస్ పేరిట ఇదో రికార్డు చిత్రంగా చెప్పొచ్చు. మహిళా గుఢచారి నేపథ్యంలో వస్తోన్న తొలి చిత్రమిదే కావడం విశేషం. స్పై రోల్ ను అలియాభట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పని చేసింది. సినిమా కోస రేయింబవళ్లు పని చేసింది. అవసరమైన స్పై ట్రైనింగ్ కూడా తీసుకుంది. దీనిలో భాగంగా కొంత మంది రియల్ స్పై లను కలిసి వాళ్ల అనుభవాలను అడిగి తెలుసుకుంది. పాత్రకు అన్ని రకాలుగా ఫిట్ అయిన తర్వాత రంగంలోకి దిగింది. అలాగే యశ్ రాజ్ నుంచి ఇప్పటి వరకూ 'పఠాన్', 'టైగర్', 'వార్' లాంటి సిరీస్ లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
వాటిని మించిన ఎలివేషన్లు 'ఆల్పా'లో ఉంటాయి? అన్నది మరో సమాచారం. సినిమాలో షారుఖ్ ఖాన్ కామియో పాత్ర పోషస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నిజంగా షారుక్ కూడా ప్రాజెక్ట్ లో భాగమైతే 'ఆల్ఫా'కు మరింత హై వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ 'ఆల్ఫా'తో పాటు రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో 'మర్దానీ 3' చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన `మర్దానీ` రెండు భాగాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
