అల్లు అర్జున్ - అట్లీ RAAKA: 800 కోట్ల బడ్జెట్.. కళ్లు చెదిరే పారితోషికాలు!
ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అందుకుంటున్న రెమ్యునరేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
By: Sivaji Kontham | 10 April 2026 9:00 PM ISTభారతీయ చలనచిత్ర రంగంలో ఎన్నడూ లేని విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న `రాక` (Raaka) చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దాదాపు 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పారితోషికాల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పాన్ ఇండియా స్టార్‌గా అల్లు అర్జున్ క్రేజ్ .. `జవాన్` చిత్రంతో అట్లీ అందుకున్న గ్లోబల్ సక్సెస్ వెరసి ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశానికి చేరాయి.
ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అందుకుంటున్న రెమ్యునరేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజా సమాచారం ప్రకారం..ఈ ప్రాజెక్ట్ కోసం అతడు ఏకంగా 175 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేశారు. కేవలం ఫిక్స్‌డ్ పారితోషికమే కాకుండా.. సినిమా లాభాల్లో 15 శాతం వాటాను కూడా దక్కించుకోబోతున్నారట. ఒకవేళ సినిమా ఊహించిన విధంగా విజయం సాధిస్తే.. ఈ చిత్రంతో బన్నీ ఆర్జించే మొత్తం 300 కోట్లు దాటే అవకాశం ఉంది. ఇది భారతీయ సినీ చరిత్రలో ఒక నటుడు అందుకునే అత్యున్నత స్థాయి పారితోషికంగా నిలవనుంది.
దర్శకుడు అట్లీ పారితోషికం కూడా `రాక` కోసం భారీగా పెరిగింది. `జవాన్` సినిమాకు 30 కోట్లు తీసుకున్న అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల ఫీజు వసూలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడిగా అట్లీ విజన్.. కమర్షియల్ సక్సెస్ రేటును పరిగణనలోకి తీసుకున్న నిర్మాతలు.. అతడు అడిగిన భారీ మొత్తానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. కేవలం నటుడు- దర్శకుడు ఇద్దరికీ కలిపి దాదాపు 275 కోట్లకు పైగా కేటాయించడం ఈ సినిమా స్థాయిని తెలియజేస్తోంది.
సినిమాలో పాత్రల పరంగా కూడా అల్లు అర్జున్ ఒక సాహసోపేతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో అతడు త్రిపాత్రాభినయం (తండ్రి, ఇద్దరు కుమారులు) చేయబోతున్నారని సమాచారం. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర...మరొకటి సగం మనిషి-సగం రాక్షసుడి ఛాయలున్న పాత్ర అని ఇటీవలి పోస్టర్ రివీల్ చేసింది. హీరోయిన్ల విషయానికి వస్తే.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె సుమారు 20 కోట్లు, రష్మిక మందన్న రూ.5 నుండి రూ.7 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం.
మొత్తానికి `రాక` చిత్రం తెలుగు సినిమా మార్కెట్ పరిధిని దాటి అంతర్జాతీయ స్థాయి కమర్షియల్ హంగులతో సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం, రికార్డు స్థాయి పారితోషికాలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఈ వార్తా కథనాలు నిజమైతే.. భారతీయ సినిమాల బడ్జెట్ .. రెమ్యునరేషన్ లెక్కలు పూర్తిగా మారిపోనున్నాయి.
