ఫుల్ క్లారిటీ..శిరీష్ రిపెప్షన్‌లో బాసిల్ జోసెఫ్!
టొవినో థామస్ కథానాయకుడిగా బాసిల్ జోసెఫ్ రూపొందించిన సూపర్ హీరో మూవీ `మిన్నల్ మురళి`. ఈ సినిమాతో ప్రశంసలు అందుకున్న బాసిల్ జోసెఫ్ తాజాగా శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌లో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
By: Ravindar Gorantla | 3 March 2026 10:14 AM ISTఅల్లూ వారింట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ఓ ఇంటవాడు కాబోతున్నాడు. ఆయన ప్రేమించిన నయనికరెడ్డితో శిరీష్ వివాహం ఈ నెల 6న గ్రాండ్‌గా జరగనుంది. ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ని అల్లూ ఫ్యామిలీ అల్లూ స్టూడియోస్‌లో భారీ స్థాయిలో ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు, రాజకీయ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇండస్ట్రీకి చెందిన హీరోలు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, రామ్‌చరణ్, మోహన్ బాబు, నాని, నాగచైతన్య, గోపీచంద్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, దర్శకులు కె. రాఘవేంద్రరావు, అట్లీ, వి.వి.వినాయక్, నిర్మాత అశ్వనీదత్‌తో పాటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, ఏపీ ఉప సభాపతి రఘురాకృష్ణరాజు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ పాల్గొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టొవినో థామస్ కథానాయకుడిగా బాసిల్ జోసెఫ్ రూపొందించిన సూపర్ హీరో మూవీ `మిన్నల్ మురళి`. ఈ సినిమాతో ప్రశంసలు అందుకున్న బాసిల్ జోసెఫ్ తాజాగా శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌లో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బన్నీ ఈ కార్యక్రమంలో అట్లీతో పాటు బాసిల్ జోసెఫ్‌ని కూడా పరిచయం చేయడంతో ఇటీవల వచ్చిన వార్తలపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఐకాన్ స్టార్ అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని నెలలుగా బన్నీ కథానాయకుడిగా బాసిల్ జోసెఫ్ ఓ సూపర్ హీరో స్టోరీని తెరపైకి తీసుకురానున్నాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
శక్తిమాన్ పేరుతో భారీ పాన్ ఇండియా మూవీకి బన్నీతో కలిసి బాసిల్ జోసెఫ్ శ్రీకారం చుడుతున్నాడని వార్తలు షికారు చేశాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని బాసిల్ జోసెఫ్ ఆ వార్తలని కొట్టిపారేశాడు. ఈ ప్రాజెక్ట్ కోసం రెండేళ్లు వృధా చేశానని వెల్లడించాడు. అయితే తాజాగా శిరీష్ ప్రివెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరవడం, బన్నీ ప్రత్యేకంగా తనని అందరికి పరిచయం చేయడంతో మళ్లీ బన్నీ, బాసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్‌పై వార్తలకు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీరిద్దరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకటి అట్లీ డైరెక్ట్ చేస్తున్న సూపర్ హీరో మూవీ కాగా.. మరొకటి లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ రెండు సినిమాల్లో ప్రస్తుతం అట్లీ తో చేస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
