Begin typing your search above and press return to search.

అల్లు ఇంట మొదలైన హల్దీ హడావుడి

తాజాగా హైదరాబాద్‌ లోని అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచుడు కార్యక్రమాన్ని నిర్వహించారు కుటుంబసభ్యులు.

By:  M Prashanth   |   13 Feb 2026 2:24 PM IST
అల్లు ఇంట మొదలైన హల్దీ హడావుడి
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కుమారుడు, యంగ్ హీరో అల్లు శిరీష్.. త్వరలో తన ప్రేయసి నయనిక రెడ్డితో వివాహ బంధంలో అడుగు పెట్టనున్నారు. మార్చి 6న హైదరాబాద్‌ లో వారి పెళ్లి వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. అయితే మ్యారేజ్ డేట్ దగ్గరపడుతుండటంతో పెళ్లి పనులు మొదలయ్యాయి.

వివాహానికి ముందుగా కుటుంబసభ్యులు సంప్రదాయ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం దుబాయ్‌ లో కుటుంబసభ్యులు, ఫెండ్స్ మధ్యలో శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఓ విలాసవంతమైన నౌకలో జరిగిన ఆ ఈవెంట్ లో అంతా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. హీరో అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహా రెడ్డి సహా పలువురు పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

తాజాగా హైదరాబాద్‌ లోని అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచుడు కార్యక్రమాన్ని నిర్వహించారు కుటుంబసభ్యులు. ఇంటి పెద్దల సమక్షంలో జరిగిన ఆ కార్యక్రమంలో పూజలు నిర్వహించి పెళ్లి పనులు మొదలుపెట్టారు. అందుకు సంబంధించిన విజువల్స్ తో కూడిన స్పెషల్ వీడియోను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఫుల్ వైరల్ అవుతోంది.

అయితే పసుపు దంచుడు కార్యక్రమానికి అల్లు కుటుంబ సభ్యులు అంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్, ఆయన కుమార్తె సుస్మిత, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన, అలాగే పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా హాజరై శిరీష్ ను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి సింపుల్ గా అయినా ఆనందంగా వేడుక జరుపుకున్నారు.

సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు గ్రాండ్ నిర్వహిస్తున్న ఈ రోజుల్లో అల్లు కుటుంబం మాత్రం ఇంటి వాతావరణంలో సంప్రదాయానికి ఇంపార్టెన్స్ ఇస్తూ నిర్వహించడం విశేషం. ఇక వధువు నయనిక రెడ్డి విషయానికి వస్తే, ఆమె హైదరాబాద్‌ కు చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన యువతి. రియల్ ఎస్టేట్‌ తో పాటు పలు వ్యాపారాల్లో వారి కుటుంబం కొనసాగుతోందని సమాచారం.

2023లో హీరో నితిన్, ఆయన సతీమణి శాలిని నిర్వహించిన ఓ వేడుక లో శిరీష్– నయనికలు తొలిసారి పరిచయం అయ్యారు. అది కాస్త ప్రేమగా మారి, ఇరు వైపుల పెద్దల అనుమతితో వివాహానికి సిద్ధమయ్యారు. గత ఏడాది అక్టోబర్ 1న తన తాత, ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా శిరీష్ తన పెళ్లి విషయాన్ని అఫిషియల్ గా ప్రకటించారు. అనంతరం నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు మార్చి 6న జరిగే వారి వివాహానికి సినీ, రాజకీయ రంగాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అదే రోజు అల్లు అర్జున్ మ్యారేజ్ యానివర్సరీ కూడా కావడం విశేషం.