హీరో 'వాల్ ఆఫ్ ఫేమ్'.. బన్నీ ప్లాన్ స్పెషల్ గా ఉందే!
అందులో పేర్లు ఎవరివి ఉన్నాయి.. ఎవరివి లేవని పక్కన పెడితే.. అల్లు అర్జున్ క్రియేటివ్ ప్లాన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
By: M Prashanth | 14 March 2026 11:37 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చెందిన మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించగా.. హైదరాబాద్ లోనే అతిపెద్ద డాల్బీ అట్మాస్ సినిమా స్క్రీన్స్ తో రెడీ అయిన అల్లు సినిమాస్ లో ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో సందడి మొదలవుతుంది.
అయితే అల్లు సినిమాస్ లో అల్లు అర్జున్.. వాల్ ఆఫ్ ఫేమ్ ఏర్పాటు చేయడం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుల ఫోటోలను అక్కడ పెట్టారు. అందులో వారివి ఉన్నాయి.. వీరివి లేవంటూ నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇప్పుడు హీరోల పేర్లు ఉన్న వాల్ ఆఫ్ ఫేమ్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
అందులో పేర్లు ఎవరివి ఉన్నాయి.. ఎవరివి లేవని పక్కన పెడితే.. అల్లు అర్జున్ క్రియేటివ్ ప్లాన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వాల్ పై అనేక మంది హీరోల పేర్లు ఉండగా.. రకరకాల ఫాంట్స్ తో.. స్పెషల్ గా దాన్ని ఏర్పాటు చేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ముఖ్యంగా హీరోల ముందు ఉన్న ట్యాగ్స్ ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి.
ఎందుకంటే అల్లు అర్జున్.. అనేక హీరోల పేర్ల ముందు వింటేజ్ ట్యాగ్స్ యాడ్ చేయడం విశేషం. ముందుగా.. నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, నటసామ్రాట్ నాగేశ్వరరావు పేర్లతో వాల్ స్టార్ట్ అవ్వగా.. ఆ తర్వాత చిరంజీవి, రజినీకాంత్, నాగార్జున, వెంకటేష్, మోహన్ లాల్, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్, అజిత్ కుమార్, అక్షయ్ కుమార్, నాని, విజయ్ దేవరకొండ, సిద్ధూ జొన్నలగడ్డ సహ పలువురి పేర్లు ఉన్నాయి.
కానీ అందరి దృష్టి పడింది మాత్రం బాలయ్య, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ పేర్లపైనే. ఎందుకంటే వారందరికీ ఉన్న ట్యాగ్స్ ఇప్పుడు ఒకటైతే.. అల్లు సినిమాస్ వాల్ పై మరోలా ఉన్నాయి. బాలయ్యను నటసింహం అని అంతా పిలుస్తుంటే.. అక్కడ మాత్రం బాలకృష్ణ అని రాసుకొచ్చి.. ఆ తర్వాత జై బాలయ్య స్లోగన్ యాడ్ చేయడం విశేషం.
అల్లు అర్జున్ పేరు ముందు ఐకాన్ స్టార్ కాకుండా స్టైలిష్ స్టార్ అని ఉండగా.. మహేష్ బాబుకు సూపర్ స్టార్ ట్యాగ్ కాకుండా ప్రిన్స్ అని ఇవ్వడం గమనార్హం. ప్రభాస్ రెబల్ స్టార్ అయితే.. సింపుల్ అండ్ క్యూట్ గా డార్లింగ్ అనే ట్యాగ్ ఇచ్చారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పేరును ముద్దుగా చెర్రీ రామ్ చరణ్ అని వేశారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను టైగర్ తారక్ అంటూ క్రేజీగా వేశారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారగా.. బన్నీ ఏం చేసినా స్పెషల్ గా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
