అల్లు సినిమాస్ 'వాల్ ఆఫ్ ఫేమ్'.. ఆ చర్చేంటి?
హైదరాబాద్ లోని కోకాపేటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రస్తుతం సినీ అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
By: M Prashanth | 13 March 2026 12:08 PM ISTహైదరాబాద్ లోని కోకాపేటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రస్తుతం సినీ అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఆ మల్టీప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ ఫేమ్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ టాలెంట్ తో ప్రత్యేక స్థానం సంపాదించిన ప్రముఖ దర్శకులకు డెడికేట్ చేయడం విశేషం. సినిమా పట్ల అల్లు అర్జున్ కు ఉన్న గౌరవాన్ని ఆ వాల్ ఆఫ్ ఫేమ్ స్పష్టంగా చూపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మల్టీప్లెక్స్ లో ప్రత్యేక ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి ఫోటోను ఏర్పాటు చేశారు బన్నీ. ఆయనతో పాటు ప్రముఖ హాస్యనటుడు దివంగత అల్లు రామలింగయ్య, నిర్మాత అల్లు అరవింద్ ఫోటోలు కూడా ప్రత్యేకంగా ప్రదర్శించారు. గతంలో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అల్లు అర్జున్.. తాను తన మూలాలను ఎప్పటికీ కూడా మర్చిపోనని పేర్కొన్న విషయం తెలిసిందే.
అయితే స్పెషల్ వాల్ పై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుల ఫోటోలు ఏర్పాటు చేయగా.. అందులో ముఖ్యంగా రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, మణిరత్నం, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ సహ పలువురి పిక్స్ ఆకట్టుకున్నాయి. ఆ దర్శకులు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసిన వారిగా గుర్తింపు పొందిన వారే కావడంతో.. అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది.
అదే సమయంలో వాల్ ఆఫ్ ఫేమ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారి తీసింది. కొంతమంది నెటిజన్లు కొందరు ప్రముఖ దర్శకుల ఫోటోలు కనిపించలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా శంకర్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను వంటి దర్శకుల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ దిగ్గజ దర్శకుల ఫోటోలు కూడా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, పూర్తి వీడియో బయటకు రాకముందే ఇలా విమర్శలు చేయడం సరైంది కాదని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. మొత్తం వాల్ ఆఫ్ ఫేమ్ ను చూపించే కంప్లీట్ వీడియో విడుదలైతేనే నిజంగా ఎవరి ఫోటోలు ఉన్నాయో, లేవో స్పష్టత వస్తుందని వారు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియకుండా అనవసరమైన కామెంట్లు చేయకూడదని కూడా సూచిస్తున్నారు.
మొత్తానికి అల్లు స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ ఫేమ్ సెలబ్రిటీలకు గౌరవించే ఒక వేదికగా నిలుస్తోంది. దర్శకుల ప్రతిభను గుర్తిస్తూ వారికి రెస్పెక్ట్ ఇవ్వడం ద్వారా అల్లు అర్జున్ మరోసారి సినీ పరిశ్రమపై తనకున్న అభిమానం, గౌరవాన్ని చూపించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల నేపథ్యంలో కంప్లీట్ వీడియో విడుదలైతే అసలు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై అల్లు సినిమాస్ నిర్వాహకులు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.
