సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
అల్లు సినిమాస్‌లో సినిమా టికెట్ల బుకింగ్ విధానంపై ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. షోకు కొన్ని గంటల ముందే ఎక్కువ సీట్లు బ్లాక్ చేసి, ప్రారంభానికి పది నిమిషాల ముందు మాత్రమే వాటిని అందుబాటులోకి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను అల్లు అరవింద్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్వయంగా వీడియో రికార్డ్ చేసి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
By: Priya Chowdhary Nuthalapti | 20 Nov 2026 12:12 PM ISTసినిమా టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రేక్షకులకు ఎదురవుతున్న సమస్యలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఆన్లైన్ టికెట్ బుకింగ్ విషయంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. థియేటర్లో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ, ఆన్లైన్లో మాత్రం అవి అందుబాటులో లేవని చూపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ సమస్య అల్లు సినిమాస్ విషయంలోనూ తెరపైకి వచ్చింది.
అల్లు సినిమాస్‌లో సినిమా చూడాలనుకునే కొంతమంది ప్రేక్షకులు టికెట్ల బుకింగ్ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షో ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే చాలా సీట్లను బ్లాక్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే సినిమా మొదలవడానికి కేవలం పది నిమిషాల ముందు మాత్రమే కొన్ని సీట్లను తిరిగి బుకింగ్ కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నారని చెబుతున్నారు. అప్పటికే మిగిలిన సీట్లు మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తున్నాయని వాపోతున్నారు.
ఈ విధానం వల్ల సాధారణ సినిమా ప్రేక్షకులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి సినిమా చూడాలనుకునే వారికి ఒకేచోట సీట్లు దొరకడం కష్టంగా మారుతోంది. ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయత్నించినా, అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య తక్కువగా కనిపించడంతో చాలామంది నిరాశకు గురవుతున్నారు. ఈ సమస్యపై సోషల్ మీడియాలో కూడా పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ఇదిలా ఉంటే..తాజాగా ఇదే సమస్యను ప్రముఖ నిర్మాత, అల్లు సినిమాస్ అధినేత అల్లు అరవింద్ దృష్టికి తీసుకెళ్లారు. సాధారణంగా తమ సంస్థకు సంబంధించిన వ్యాపారంపై ఎవరైనా విమర్శలు చేస్తే స్పందించడం కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ అల్లు అరవింద్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా వ్యవహరించారు.
ప్రేక్షకుడు చెప్పిన సమస్యను ఆయన శ్రద్ధగా విన్నారు. అంతేకాదు, వెంటనే తన ఫోన్ తీసి ఈ విషయాన్ని వీడియోలో రికార్డ్ చేశారు. సమస్య గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత దీనిపై స్వయంగా దృష్టి పెడతానని, పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సొంత సంస్థకు సంబంధించిన సమస్య అయినప్పటికీ, ఫిర్యాదు చేసిన వ్యక్తిపై అసహనం చూపకుండా ఆయన స్పందించిన తీరు ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది.
ముఖ్యంగా తన వ్యాపారంలో ఉన్న లోపాన్ని ఎవరైనా ఎత్తిచూపినప్పుడు దాన్ని స్వీకరించి, పరిష్కరించడానికి ముందుకు రావడం మంచి విషయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
