జనవరి మొదటి వారంలో అల్లు క్యాంపెయిన్
2025 ఇప్పుడు గతం..! 2026 అనే వర్తమానంలోకి అడుగు పెట్టాం. కొత్త సంవత్సరం కొత్త విషయాలు చెప్పడానికి తెలుగు చిత్రసీమ ఉవ్విళ్లూరుతోంది.
By: Sivaji Kontham | 1 Jan 2026 3:25 PM IST2025 ఇప్పుడు గతం..! 2026 అనే వర్తమానంలోకి అడుగు పెట్టాం. కొత్త సంవత్సరం కొత్త విషయాలు చెప్పడానికి తెలుగు చిత్రసీమ ఉవ్విళ్లూరుతోంది. చాలా ముందే, అంటే ఈ జనవరి మొదటి వారంలో అల్లు కాంపౌండ్ ఒక ఎగ్జయిట్ చేసే క్యాంపెయిన్ తో దూసుకురానుంది. అయితే ఇది అల్లు అర్జున్- అట్లీ సినిమా గురించి కాదు!
ఏషియన్ సినిమాస్ తో కలిసి అల్లు అర్జున్ - అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న అల్లు సినిమాస్- కోకాపేట్ మల్టీప్లెక్స్ గురించి... సరికొత్త ప్రీమియం మల్టీప్లెక్స్‌లో విలాసవంతమైన సీటింగ్‌తో పాటు 75 అడుగుల వెడల్పు ఉన్న అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ని అందుబాటులోకి తెస్తుండటం ఈ మల్టీప్లెక్స్ ప్రత్యేకత. ప్రస్తుతం కోకాపేట్ - అల్లూ సినిమాస్ కి సంబంధించిన వాణిజ్య ప్రకటనలను రూపొందించే పనిలో ఉన్నారని తెలిసింది. జనవరి తొలి వారంలో ఛిత్రీకరించి, థియేటర్ లాంచింగ్ కి ముందు వీటిని పబ్లిష్ చేస్తారు. సంక్రాంతి సందర్భంగా ఈ థియేటర్లను లాంచ్ చేస్తారని కూడా తెలుస్తోంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ తెస్తారా?
హైదరాబాద్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్ నుంచి ఐమ్యాక్స్ వైదొలగడంతో ఇప్పుడు వినోద ప్రియులకు ఆ లోటు స్పష్ఠంగా తెలుస్తోంది. ఐమ్యాక్స్ లైసెన్సింగ్ పునరుద్ధరణ సహా థియేటర్ మెయింటెనెన్స్ భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం గనుక ఎవరూ `ఐమ్యాక్స్` థియేటర్ ని తెచ్చేందుకు ప్రయత్నించడం లేదు. ఏఎంబి సినిమాస్- ఏఏఏ సినిమాస్ స్టార్ హీరోలతో అలయెన్స్ లో నిర్మించిన మల్టీప్లెక్సులు.. కానీ ఇక్కడ కూడా ఐమ్యాక్స్ అందుబాటులోకి తేలేదు. భారీగా ఆదాయ వనరులు ఉన్న ఎగ్జిబిటర్లు ఎవరూ ఐమ్యాక్స్ స్క్రీన్ ఏర్పాటు కోసం ఆలోచించకపోవడం విస్మయపరుస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌళి, అమీర్ పేట్ లాంటి ప్రైమ్ ఏరియా లలో ఐమ్యాక్స్ లేకపోవడం శోచనీయం.
అయితే ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌ను ప్రారంభిస్తున్న అల్లు సినిమాస్ ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ ని కూడా అందించాలని అభిమానులు కోరుతున్నారు. హైదరాబాద్‌లో సినిమాటిక్ అనుభవాన్ని మరింత గొప్పగా మలిచే సత్తా అల్లు సినిమాస్ కి ఉంది. కానీ ఐమ్యాక్స్ తేవాలనే ఆలోచన గురించి అల్లు క్యాంప్ ఎలాంటి ప్రస్థావనా తేలేదు.
అయితే దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ని అల్లు సినీప్లెక్స్ సిద్ధం చేస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది. కోకాపేటలో ఉన్న ఈ 75 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్ డిసిఐ ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్‌లో పనిచేస్తుందని, ఇందులో డాల్బీ విజన్, డాల్బీ 3డి ప్రొజెక్షన్ సాంకేతికతో విజువల్స్ ఆకర్షిస్తాయని చెబుతున్నారు. అత్యాధునిక డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్ క్రేజ్ పెంచుతుంది. ధ్వని- వీక్షణ పరంగా 3డి, 2డి సినిమాల వీక్షణకు అత్యుత్తమ అనుభవాన్ని కోకాపేట్ థియేటర్ అందించగలదని చెబుతున్నారు. సంక్రాంతి 2026కి గ్రాండ్ లాంచింగ్ కార్యక్రమం జరుగుతుందని కూడా చెబుతున్నారు. అల్లు సినీప్లెక్స్ భారతదేశంలోని ఆరు డాల్బీ సినిమా ఇన్‌స్టాలేషన్‌లలో ఒకటిగా మారనుంది. ఈ థియేటర్ ప్రపంచస్థాయి వీక్షణ అనుభవాన్ని అందించనుంది. ఇకపైనా విడుదలకు వచ్చే భారీ హాలీవుడ్ చిత్రాలతో పాటు, నితీష్ తివారీ- రామాయణం, రాజమౌళి - వారణాసి వంటి చిత్రాలను ఇలాంటి యూనిక్ సౌండ్ క్వాలిటీ వున్న థియేటర్లలో వీక్షిస్తే ఆ అనుభవం వేరేగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కాస్ట్ లీ ఏరియా కాస్ట్ లీ హ్యాబిట్స్:
ఈ కొత్త థియేటర్ ఖరీదైన చోట ఏర్పాటవుతోంది. కోకాపేట్, గచ్చిబౌళి, గండిపేట్, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి అత్యంత ప్రైమ్ ఏరియాలకు కోకాపేట్ అనుసంధానమై ఉన్న ప్రాంతం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఉండే చోటు కావడంతో ఇక్కడ గ్లామ్ అండ్ గ్లిజ్ తో థియేటర్లకు కొత్త కళ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
