Begin typing your search above and press return to search.

అల్లు సినిమాస్ సక్సెస్ కు అసలు కారణమేంటి?

హైదరాబాద్ లోని అల్లు సినిమాస్ డాల్బీ థియేటర్ గురించి కొన్ని రోజులుగా ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.

By:  M Prashanth   |   11 March 2026 7:00 PM IST
అల్లు సినిమాస్ సక్సెస్ కు అసలు కారణమేంటి?
X

హైదరాబాద్ లోని అల్లు సినిమాస్ డాల్బీ థియేటర్ గురించి కొన్ని రోజులుగా ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అప్పుడే సక్సెస్ పాయింట్ గా మారిన ఆ థియేటర్ టికెట్ ధరలు, ప్రేక్షకుల రెస్పాన్స్ పై పలువురు ఎక్స్పర్ట్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో అందరికీ అందుబాటులోకి రానున్న అల్లు సినిమాస్ అప్పుడే ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం టికెట్ ధరలు కాదని, అసలు కారణం లొకేషన్ అడ్వాంటేజ్ అని అభిప్రాయపడుతున్నారు.

టికెట్ ధర సుమారు రూ.395 వరకు ఉండటం రీసెంట్ గా చర్చకు దారితీసింది. కానీ ఆ రేటు సిటీలోని ప్రముఖ మల్టీప్లెక్సులతో పోలిస్తే దాదాపు సమానంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గచ్చిబౌలిలో ఉన్న ప్రముఖ మల్టీప్లెక్సుల టికెట్ ధరల రేంజ్ లో అల్లు సినిమాస్ ధరలు కూడా ఉండటంతో, రేట్స్ వల్లే ప్రేక్షకులు భారీగా ఆ థియేటర్‌ వైపు మళ్లుతారని కొందరు భావించారు. అయితే ఈ అభిప్రాయంతో అందరూ ఏకీభవించడం లేదు.

అల్లు సినిమాస్ విజయానికి అసలు కారణం లొకేషన్ అని అనేక మంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆ థియేటర్ గాంధీ పేట్- కోకాపేట్ మెయిన్ రోడ్డుపై ఉండగా.. ప్రస్తుతం ఆ ప్రాంతం హైదరాబాద్‌ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. చుట్టుపక్కల అనేక గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. అందువల్ల ఆ ప్రాంత ప్రజలకు సమీపంలో ఒక మోడ్రన్ మల్టీప్లెక్స్ ఉండటం ప్లస్ పాయింట్ గా మారింది.

మణికొండ, నర్సింగి, ఆల్కాపూర్, మంచిరేవుల, కోకాపేట్, గాంధీపేట్ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఇప్పటివరకు సినిమా చూడాలంటే దూరంగా వెళ్లాల్సి వచ్చేది. ఎక్కువగా గచ్చిబౌలిలోని లేదా హైటెక్ సిటీ పరిసరాల్లోని మల్టీప్లెక్సులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఆ ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకోవడానికి సుమారు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అది కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో జర్నీ అంత ఈజీ కాదు.

పీక్ అవర్స్‌ లో సినిమా చూడటానికి వెళ్లాలంటే కనీసం 40 నుంచి 45 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కుటుంబంతో కలిసి వెళ్లే ప్రేక్షకులకు ఇది కొంత ఇబ్బందిగా మారింది. ఇప్పుడు అల్లు సినిమాస్ ప్రారంభం కావడంతో ఆ సమస్యకు పరిష్కారం లభించిందని చెప్పాలి. ఆ ప్రాంతాల నుంచి అల్లు సినిమాస్ కు చేరుకోవడానికి సాధారణంగా 3- 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ప్రయాణ సమయం సుమారు 10 నుంచి 15 నిమిషాల మధ్యలో పూర్తవుతుంది.

అందువల్ల సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు అల్లు థియేటర్‌ వైపు మొగ్గు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, ఆ ఏరియాలో మల్టీప్లెక్సుల సంఖ్య తక్కువగా ఉండటం. అందుకే అల్లు సినిమాస్‌ కు మంచి ఫుట్‌ ఫాల్ వచ్చే అవకాశముంది. సమీపంలో మరిన్ని థియేటర్లు వచ్చేవరకు లొకేషన్ అడ్వాంటేజ్ కొనసాగుతుంది. అలా అల్లు సినిమాస్ అంత పాపులర్ కావడానికి ప్రధాన కారణం టికెట్ ధరలు కాదని, లొకేషన్ అడ్వాంటేజ్ అని ఎక్స్పర్ట్స్ స్ట్రాంగ్ గా చెబుతున్నారు!