Begin typing your search above and press return to search.

అల్లు సినిమాస్.. అదొక్కటే సమస్య?

హైదరాబాద్ లో ఇటీవల ప్రారంభమైన మల్టీప్లెక్స్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చెందిన అల్లు సినిమాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

By:  M Prashanth   |   23 March 2026 1:59 PM IST
అల్లు సినిమాస్.. అదొక్కటే సమస్య?
X

హైదరాబాద్ లో ఇటీవల ప్రారంభమైన మల్టీప్లెక్స్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చెందిన అల్లు సినిమాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మోడ్రన్ ఫెసిలిటీస్, విశాలమైన స్క్రీన్లు, కుటుంబాలకు అనుకూలమైన వాతావరణంతో ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. విడుదలైన కొత్త సినిమాలకు అక్కడ భారీగా రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా వీకెండ్స్ లోనే కాదు, వర్కింగ్ డేస్‌ లో కూడా ఉదయం నుంచే సినీ ప్రియులు రద్దీ కనిపిస్తోంది.

ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్ లో కనిపించే వాహనాల సంఖ్య చూస్తేనే అల్లు సినిమాకు ఎంత ఆదరణ ఉందో అర్థమవుతుంది. రోజూ ఉదయం 11 గంటలకు పార్కింగ్ ఏరియా నిండిపోతుండటం గమనార్హం. రోజుకు సుమారు 200 నుంచి 300 కార్లు పార్కింగ్‌ లో ఉంటున్నాయని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఇది అల్లు సినిమాస్ కు వస్తున్న భారీ రెస్పాన్స్ కు నిదర్శనం.

అయితే పార్కింగ్ సదుపాయం విషయంలో మాత్రం అసంతృప్తి వినిపిస్తోంది. ప్రధానంగా పార్కింగ్ స్థలం పూర్తిగా ఓపెన్ స్పేస్‌ గా ఉండటం వల్ల వాహన యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి షెడ్ లేదా కవరింగ్ లేకపోవడం వల్ల వేసవి కాలంలో కార్లు ఎండలో వేడెక్కుతున్నాయి. తీవ్రమైన ఎండలో గంటల తరబడి నిలిపిన కార్లు లోపలికి వెళ్ళేటప్పుడు ఉక్కపోతగా మారుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే పరిస్థితి వర్షాకాలంలో మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఓపెన్ పార్కింగ్ కారణంగా వర్షం పడితే కార్లు పూర్తిగా తడిసిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో భారీ వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండటం వల్ల వాహనాలకు నష్టం కలిగే అవకాశం ఉందని వినియోగదారులు చెబుతున్నారు. దీంతో పార్కింగ్ సదుపాయం ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం సిటీలోని చాలా మల్టీప్లెక్స్ థియేటర్స్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ లేదా షెడ్ సదుపాయాలను కల్పిస్తున్నాయి. అలాంటి సదుపాయం ఉంటే వాహనాలకు ఎండ, వర్షం నుంచి సేఫ్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో అల్లు సినిమాస్ యాజమాన్యం కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయాలని ప్రేక్షకులు కోరుతున్నారు. ఇంత పెద్ద స్థాయిలో నిర్మించిన థియేటర్‌ లో పార్కింగ్ విషయంలో మరింత పక్కా ప్లాన్ చేయాల్సిందని అభిప్రాయపడ్డారు.

అండర్ గ్రౌండ్ పార్కింగ్ లేదా కనీసం పైకప్పుతో కూడిన షెడ్ ఏర్పాటు చేస్తే మరింత సౌకర్యం కలుగుతుందని సూచిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు అల్లు సినిమాస్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నప్పటికీ, పార్కింగ్ సమస్య మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది. ఆ విషయాన్ని యాజమాన్యం పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటే, ప్రేక్షకుల అనుభవం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..