Begin typing your search above and press return to search.

అల్లు అయాన్ అప్పుడే వేషాలు! లెగసీని నడిపించే వారసుడొచ్చాడు!!

అల్లు అయాన్ భవిష్యత్తు గురించి స్వయంగా తాతగారు, మెగా నిర్మాత అల్లు అరవింద్ ఏఏఏ సినిమాస్ - కోకాపేట మ‌ల్టీప్లెక్స్ లాంచ్ కార్య‌క్ర‌మంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Sivaji Kontham   |   13 March 2026 9:21 AM IST
అల్లు అయాన్ అప్పుడే వేషాలు! లెగసీని నడిపించే వారసుడొచ్చాడు!!
X

అల్లు కుటుంబం నుండి మరో స్టార్ తారాలోకాన్ని ఏల‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్ఠ‌త వ‌చ్చేసింది. అల్లు రామలింగయ్య గారి వారసత్వాన్ని అల్లు అరవింద్ అగ్ర నిర్మాతగా కొనసాగిస్తుంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నటనతో లెగ‌సీని ముందుకు న‌డిపిస్తూ ప్రపంచాన్ని ఏల్తున్నారు. ఇప్పుడు అదే బాటలో అల్లు అయాన్ కూడా నటుడు అవుతాడనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్న వయసులోనే ఇంట్లో తన అభినయంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది. అయాన్ తీరిక స‌మ‌యాల్లో ఇంట్లో వేషాలు వేస్తూ ఉంటే, అత‌డి భ‌విత‌వ్యం ఎలా ఉంటుందో తాత గారు అల్లు అర‌వింద్ ముందే ఊహించారు. అల్లు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే లక్షణాలు అయాన్ లో పుష్కలంగా ఉన్నాయని ఆయ‌న బ‌లంగా న‌మ్ముతున్నారు.

అల్లు అయాన్ భవిష్యత్తు గురించి స్వయంగా తాతగారు, మెగా నిర్మాత అల్లు అరవింద్ ఏఏఏ సినిమాస్ - కోకాపేట మ‌ల్టీప్లెక్స్ లాంచ్ కార్య‌క్ర‌మంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ``అయాన్ అప్పుడే ఇంట్లో వేషాలు వేస్తున్నాడు. నాలుగో త‌రం కూడా వ‌చ్చేసింది`` అని స్వ‌యంగా వెల్ల‌డించారు.

దీనిని బ‌ట్టి అల్లు అయాన్ కచ్చితంగా నటుడు అవుతాడనే నమ్మకాన్ని అల్లు అర‌వింద్ వ్య‌క్తం చేసారు. ఇప్పటికే చిన్నారి అయాన్ చిన్న చిన్న వేషాలు వేస్తూ తనలోని నటుడిని బయటపెడుతున్నాడు. స్కూల్ కి వెళ్లే వ‌య‌సులో బాలుడిగా ఉన్నప్పుడే ఆ ఉత్సాహం చూస్తుంటే అల్లు కుటుంబం నుండి మరో మంచి నటుడు రాబోతున్నాడని ఇప్పుడు అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. ఇది అల్లు ఫ్యాన్స్ లో గొప్ప ఉత్సాహం నింపుతోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి `పుష్ప` ఫ్రాంఛైజీ చిత్రాలతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రభాస్ తర్వాత పాన్ వరల్డ్ రేంజ్‌లో బాక్సాఫీస్‌ను ఏలే సత్తా ఉన్న హీరోగా బన్నీ దూసుకుపోతున్నారు. ఇంతటి భారీ ఇమేజ్ ఉన్న స్టార్ వారసుడిగా అల్లు అయాన్ ఎంట్రీ ఇస్తే.. ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడమే అభిమానులకు పెద్ద పండగలా ఉంది. తండ్రి సెట్ చేసిన బెంచ్ మార్క్ అయాన్ కెరీర్‌కు గట్టి పునాది కానుంది.

గణాంకాల ప్రకారం చూస్తే... అల్లు అయాన్ వయసు 2026 నాటికి 11 ఏళ్లు. మరో ఏడెనిమిది ఏళ్లలో అంటే సరిగ్గా 2033 నాటికి అయాన్ నూనూగు మీసాల హీరోగా వెండితెరకు పరిచయం అయ్యే అవకాశాలు స్ప‌ష్ఠంగా ఉన్నాయి. అప్పటికి అల్లు అర్జున్ గ్లోబల్ మార్కెట్‌లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించి ఉంటారు కాబట్టి తన కుమారుడికి ప్రపంచ స్థాయి లాంచింగ్ ఇచ్చేందుకు అన్ని దారులు సిద్ధంగా ఉంటాయి.

హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ వారసుడు జడెన్ స్మిత్ ఎలాగైతే భారీ స్థాయిలో ఎంట్రీ ఇచ్చాడో.. అయాన్ ఇంట్రడక్షన్ కూడా అదే రేంజ్‌లో వరల్డ్ వైడ్‌గా ఉండబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అల్లు అరవింద్ వ్యూహరచన.. అల్లు అర్జున్ ఇమేజ్ తోడైతే అల్లు అయాన్ బాక్సాఫీస్‌ను కుమ్మేయడం ఖాయం. ఆ రోజు కోసం అటు మెగా ఫ్యాన్స్.. ఇటు అల్లు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

గ్లోబ‌ల్ మార్కెట్లో హ‌వా:

అల్లు అర్జున్ ప్ర‌స్తుతం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ ఫాంట‌సీ- సైన్స్ ఫిక్ష‌న్ బ్యాక్ డ్రాప్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా అత‌డికి గ్లోబ‌ల్ మార్కెట్లో మ‌రో రేంజును చూపిస్తుంద‌ని అంతా న‌మ్ముతున్నారు. 1000 కోట్ల క్ల‌బ్ ని అధిగ‌మించి `పుష్ప 2` చిత్రం 1800కోట్లు వ‌సూలు చేసింది. ఇప్పుడు 2000 కోట్లు అంత‌కుమించిన క్ల‌బ్ ల‌ను ఐకాన్ స్టార్ సృష్టించే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అల్లు అర్జున్ ఇప్ప‌టికే ప్ర‌పంచ‌స్థాయిలో అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నారు. ఇది అత‌డి మార్కెట్ ప‌రిధిని అమాంతం పెంచేయ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఏఏఏ సినిమాస్ లాంచింగ్ వేడుక‌లో ముఖ్య అతిథి అయిన‌ తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ హాలీవుడ్ లోను న‌టించాల‌ని ఆకాంక్షించారు. అది సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే సాధ్య‌ప‌డాల‌ని ఆకాంక్షిద్దాం.