కోర్టుకు స్టార్ హీరో వర్చువల్ హాజరు.. ఈ చాయిస్ ఎవరెవరికి?
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు స్వయంగా హాజరుకాలేని పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి కోరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
By: Sivaji Kontham | 23 Jun 2026 9:10 AM ISTటాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు స్వయంగా హాజరుకాలేని పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి కోరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు కోర్టులో వర్చువల్ హాజరు లేదా వీడియో కాన్ఫరెన్సింగ్ అటెండెన్స్ అంటే ఏమిటి? ఇది ఎలాంటి ప్రత్యేక సందర్భాలలో ఎవరికి వర్తిస్తుంది? చట్టం ఏం చెబుతోందో పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు తెలిసాయి.
భారతదేశ న్యాయవ్యవస్థలో వీడియో కాన్ఫరెన్సింగ్ లేదా వర్చువల్ హియరింగ్ ద్వారా కోర్టుకు హాజరుకావడం అనేది కేవలం సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక హక్కు కాదు. భారత సర్వోన్నత న్యాయస్థానం.. అలాగే హైకోర్టుల నిబంధనల ప్రకారం...సాధారణ పౌరులకు కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే హక్కు ఉంది.
అసలు ఈ వర్చువల్ అటెండెన్స్ అంటే ఏమిటి? ఇది ఎవరికి, ఏ సందర్భాలలో అందుబాటులో ఉంటుందో పరిశీలిస్తే...కోర్టుకు స్వయంగా ఫిజికల్‌గా వెళ్లకుండా ఉన్న చోటు నుంచే లాప్‌టాప్, మొబైల్ లేదా ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరై... వాదనలు లేదా సాక్ష్యాలు నమోదు చేయడాన్ని `వర్చువల్ హాజరు`అంటారు. కోవిడ్-19 పాండమిక్ తర్వాత భారత న్యాయవ్యవస్థలో ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
ఈ ఛాయిస్ ఎవరికి అందుబాటులో ఉంటుంది? అంటే న్యాయస్థానం అనుమతితో కింది కేటగిరీల వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావచ్చు:
సాక్షులు : కేసులో కీలక సాక్ష్యం చెప్పాల్సిన వారు వేరే ఊరిలో లేదా విదేశాల్లో ఉన్నప్పుడు.
బాధితులు : ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, శారీరక..లైంగిక వేధింపులకు గురైన వారు కోర్టు వాతావరణంలోకి రావడానికి భయపడినా లేదా ఇబ్బంది పడినా.
నిందితులు : జైలులో ఉన్న ఖైదీలను భద్రతా కారణాల దృష్ట్యా కోర్టుకు తీసుకురాలేనప్పుడు లేదా విదేశాలు..దూర ప్రాంతాల్లో ఉన్న నిందితులకు ముందస్తు అనుమతి ఉన్నప్పుడు.
సెలబ్రిటీలు-విఐపీలు: వీరు కోర్టుకు వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నప్పుడు లేదా విపరీతమైన జనం గుమిగూడి తోపులాట జరిగే ప్రమాదం ఉన్నప్పుడు.
వైద్యులు-నిపుణులు: పోస్ట్‌మార్టం రిపోర్టులు లేదా ఫోరెన్సిక్ రిపోర్టులు ఇచ్చిన నిపుణులు తమ విధుల్లో బిజీగా ఉండి కోర్టుకు రాలేనప్పుడు.
ఎలాంటి ప్రత్యేక సందర్భాలలో ఈ అనుమతి ఇస్తారు?
న్యాయస్థానాలు ప్రతి ఒక్కరికీ వర్చువల్ హాజరుకు అనుమతి ఇవ్వవు. దానికి బలమైన కారణాలు ఉండాలి. కోర్టుకు రావడం వల్ల సదరు వ్యక్తి ప్రాణానికి ముప్పు ఉందనుకున్నప్పుడు లేదా సదరు వ్యక్తి రాకవల్ల కోర్టు ప్రాంగణంలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నప్పుడు.. తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నా, పక్షవాతం లేదా నడవలేని స్థితిలో ఉన్నా లేదా ప్రయాణించలేని వృద్ధులైనా... సదరు వ్యక్తి భారతదేశంలోని సుదూర ప్రాంతంలో లేదా విదేశాలలో నివసిస్తున్నప్పుడు.. ప్రయాణ ఖర్చులు, సమయం వృధా కాకుండా ఉండేందుకు... దేశ రక్షణ రంగంలో లేదా అత్యవసర సేవలలో ఉండి లీవ్ దొరకని పరిస్థితి ఉంటే వారికి అనుమతి లభిస్తుంది.
అనుమతి ఎలా లభిస్తుంది?
ఇది నేరుగా వచ్చే హక్కు కాదు. దీనికోసం సదరు వ్యక్తి తరపు న్యాయవాది కోర్టులో `సిఆర్పిసి` - బిఎన్ఎస్ నిబంధనల ప్రకారం ఒక ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలి. తాము ఎందుకు స్వయంగా హాజరుకాలేకపోతున్నామో బలమైన కారణాలను.. వైద్య ధృవీకరణ పత్రాలు లేదా భద్రతా కారణాల ఆధారాలు కోర్టుకు సమర్పించాలి. న్యాయమూర్తి సంతృప్తి చెందితేనే వీడియో కాన్ఫరెన్స్‌కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు.
కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుడు లేదా సాక్షి వర్చువల్ గా హాజరవుతున్నప్పుడు.. వారు ఏ ప్రదేశం నుండి మాట్లాడుతున్నారో (ఉదా: వేరే కోర్టు రూమ్, జైలు, లేదా భారత రాయబార కార్యాలయం) అక్కడ ఒక అధికారిక ప్రతినిధి పర్యవేక్షణ ఉండేలా కోర్టులు జాగ్రత్తలు తీసుకుంటాయి. కొన్ని కారణాల వల్ల నేరుగా హాజరు కాలేకపోయినా.. జూలై 6న నెక్ట్స్ హియరింగుకి స్టార్ హీరో అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరవుతారని సమాచారం.
