Begin typing your search above and press return to search.

బన్నీ మరొకటా? అసలు గ్యాప్ ఎక్కడుంది?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ స్పీడ్ ను ఇప్పుడు చూస్తుంటే బన్నీకి బ్రేక్ అన్న మాటే లేదేమో అని అనిపిస్తోంది.

By:  M Prashanth   |   2 Feb 2026 2:57 PM IST
బన్నీ మరొకటా? అసలు గ్యాప్ ఎక్కడుంది?
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ స్పీడ్ ను ఇప్పుడు చూస్తుంటే బన్నీకి బ్రేక్ అన్న మాటే లేదేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే ఒక సినిమా పూర్తి కాకముందే మరో మూడు చిత్రాలను లైన్‌ లో పెట్టేస్తూ ఫుల్ బిజీ బిజీ షెడ్యూల్‌ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ చూసిన అభిమానులు, సినీ వర్గాల్లో అసలు గ్యాప్ ఎక్కడుందని ప్రశ్న వినిపిస్తోంది.

ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ భారీ ప్రాజెక్ట్‌ షూటింగ్ లో పాల్గొంటున్నారు. పాన్ ఇండియా రేంజ్‌ లో హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ స్టైల్ మాస్ ట్రీట్మెంట్, బన్నీ ఎనర్జీ కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.

అదే సమయంలో మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగారాజ్‌ తో కూడా బన్నీ సినిమా చేయనున్నట్టు అధికారిక ప్రకటన రావడం విశేషం. ఖైదీ, విక్రమ్, లియో వంటి స్టైలిష్ యాక్షన్ సినిమాలతో లోకేష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆ కాంబోపై కూడా భారీ హైప్ నెలకొంది. బన్నీని లోకేష్ ఎలా ప్రెజెంట్ చేస్తారో అన్న ఆసక్తి అందరిలో ఉంది.

అంతటితో ఆగలేదు. ఇప్పటికే సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కూడా అల్లు అర్జున్ మూవీ ఫిక్స్ అయ్యింది. మధ్యలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా ఇది ఇంకా లైనప్‌ లోనే ఉందని క్లారిటీ వచ్చింది. సందీప్ వంగా స్టైల్ ఇంటెన్స్ డ్రామాలో బన్నీ కనిపిస్తే అది కంప్లీట్ గా కొత్త యాంగిల్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

అలాగే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తో మరోసారి చేతులు కలపనున్నారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హిట్ సినిమాల తర్వాత ఆ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయితే ఫ్యాన్స్‌ కు పండుగే. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కూడా బన్నీకి కథ వినిపించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ధురంధర్ తో బ్లాక్‌ బస్టర్ అందుకున్న ఆయన కథ చెప్పడంతో మరో కొత్త కాంబినేషన్ చర్చకు వచ్చింది. అయితే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావాలంటే టైమ్ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బన్నీ డైరీ ఫుల్ అయ్యిందనే చెప్పాలి. వరుస ప్రాజెక్టులు, పెద్ద డైరెక్టర్లు, పాన్ ఇండియా ప్లానింగ్.. ఇవి చూస్తుంటే ఆయన కెరీర్‌ లో గ్యాప్ అనే మాటే కనిపించడం లేదు. ఏ ప్రాజెక్ట్ ముందుకు వస్తుంది? ఏది తర్వాత మొదలవుతుంది? అనేది ఇంకా క్లారిటీ రాకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టం. అల్లు అర్జున్ స్పీడ్ తగ్గేదేలే.