Begin typing your search above and press return to search.

త్రిపాత్రాభిన‌యం: మెగాస్టార్ త‌ర్వాత అల్లు అర్జున్‌కే ఆ ఛాన్స్?

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన త‌దుప‌రి చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారంతో మెగా హీరోల మల్టీ-రోల్స్ వ్యవహారం మళ్లీ అభిమానుల్లో చ‌ర్చ‌గా మారింది.

By:  Sivaji Kontham   |   29 Aug 2026 10:00 AM IST
త్రిపాత్రాభిన‌యం: మెగాస్టార్ త‌ర్వాత అల్లు అర్జున్‌కే ఆ ఛాన్స్?
X

తెలుగు చిత్రసీమలో ఒకే నటుడు ఒక‌టికి మించి పాత్రల్లో (ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం) కనిపించడం ఎప్పుడూ ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా మెగా కాంపౌండ్ హీరోలైన చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాల్లో ఉండే పాత్రల వైవిధ్యం.. వారు చేసే ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ ఒక హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన త‌దుప‌రి చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారంతో మెగా హీరోల మల్టీ-రోల్స్ వ్యవహారం మళ్లీ అభిమానుల్లో చ‌ర్చ‌గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. జాబితాను వెతికితే..రక్తసింధూరం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, అల్లుడా మజాకా చిత్రాల్లో ద్విపాత్ర‌లు చేసి మెప్పించారు. అయితే ఆయన తన కెరీర్‌లో కేవలం `ముగ్గురు మొనగాళ్లు` (1994) చిత్రంలో మాత్రమే పూర్తిస్థాయి త్రిపాత్రాభినయం చేశారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో చిరంజీవి తండ్రిగా .. ఆయన ఇద్దరు కవల కొడుకులుగా .. మొత్తం మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు.

ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే.. అత‌డు ఇప్పటివరకు కేవలం ద్విపాత్రాభినయం మాత్రమే చేశారు తప్ప త్రిపాత్రాభినయం వైపు అడుగులు వేయలేదు. `మగధీర` (2009) చిత్రంలో కాలభైరవ, హర్షగా రెండు వేర్వేరు జన్మలకు సంబంధించిన పాత్రల్లో రామ్ చరణ్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత `నాయక్` (2013) లో సిద్ధార్థ్ నాయక్, చరణ్‌గా ... శంకర్ దర్శకత్వంలో వచ్చిన `గేమ్ ఛేంజర్` (2025) లో తండ్రి (అప్పన్న), కొడుకు (రామ్ నందన్)గా ద్విపాత్రల్లో మెరిసి తన వైవిధ్యాన్ని చాటుకున్నారు.

ఇదిలా ఉంటే తమిళ స్టార్ డైరెక్టర్ ఆట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `రాకా`లో బ‌న్ని ద్విపాత్రాభినయం కాదని, ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రిగా.. ఆయన ఇద్దరు కొడుకులుగా కనిపిస్తారని లేదా ఒక పోలీస్, తండ్రి, మాన్‌స్ట‌ర్ వంటి మూడు భిన్నమైన రోల్స్‌లో అలరిస్తారని ఇండస్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

వేర్వేరు తరాలు, విభిన్న ప్రపంచాలు, టైమ్‌లైన్‌ల చుట్టూ తిరిగే సంక్లిష్టమైన కథాంశంతో ఆట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా తన సినిమాల్లో ప్రధాన పాత్రలను ఓపెన్ చేయ‌కుండా స‌ర్ ప్రైజింగ్‌గా ఉంచే ఆట్లీ.. ఈ త్రిపాత్రల విషయమై మేకర్స్‌తో కలిసి సీక్ర‌సీని పాటిస్తున్నారు. ఒకవేళ ఈ ట్రిపుల్ రోల్ వార్త కనుక నిజమైతే అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది అత్యంత ప్రత్యేకం కానుండగా... మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి తర్వాత త్రిపాత్రాభినయం చేసిన హీరోగా అల్లు అర్జున్ కొత్త చరిత్ర సృష్టిస్తారు.