బన్నీకి జపాన్ లో ఘన స్వాగతం.. పుష్ప 2 రిలీజ్ వేళ.. టైటిల్ ఏంటంటే?
ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోలు తమ సినిమాలను ప్రాంతీయంగా, ఇటు పాన్ ఇండియా భాషల్లో విడుదల చేయడమే కాకుండా.. ఇతర దేశాలలో కూడా విడుదల చేస్తూ పాన్ వరల్డ్ క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
By: Madhu Reddy | 13 Jan 2026 5:36 PM ISTఈ మధ్యకాలంలో కొంతమంది హీరోలు తమ సినిమాలను ప్రాంతీయంగా, ఇటు పాన్ ఇండియా భాషల్లో విడుదల చేయడమే కాకుండా.. ఇతర దేశాలలో కూడా విడుదల చేస్తూ పాన్ వరల్డ్ క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్నామధ్య ఎన్టీఆర్ తన దేవర చిత్రాన్ని జపాన్లో విడుదల చేసి, ప్రేక్షక ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలోనే మరో హీరో కూడా చేరిపోయారు. ఆయన ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇదివరకే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేసి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించారు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది.
ఇకపోతే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు జపాన్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు జపాన్లో ల్యాండ్ అయిన అల్లు అర్జున్ కి అక్కడి జపాన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. విషయం తెలియని బన్నీ ఎందుకు జపాన్ వెళ్ళాడు అని కొంతమంది అభిమానులు ఆరా తీస్తున్నారు.
విషయంలోకి వెళ్తే .. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన పుష్ప 2: ది రూల్ చిత్రం ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. జనవరి 16వ తేదీన "పుష్ప కున్రిన్" పేరుతో విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన భార్య కుటుంబంతో కలిసి టోక్యో చేరుకున్నారు. జపాన్ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మొత్తానికైతే ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వెళ్లిన అల్లు అర్జున్ అక్కడి మీడియా, అభిమానులతో ముచ్చటించనున్నారు. ఇండియాలో సంచలనం సృష్టించిన ఈ సినిమా అటు జపాన్లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
అల్లు అర్జున్ చిత్రాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రముఖ కోలివుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో AA22xA6 వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా మృనాల్ ఠాకూర్, రష్మిక మందన్న తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ కార్తికేయుడి కథ ఆధారంగా రాబోతున్న మైథలాజికల్ మూవీలో నటిస్తున్నట్లు సమాచారం.
