అప్పుడు ప్రభాస్ అనుకున్నట్లు ఇప్పుడు అల్లు అర్జున్...!
బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు ఇతర భాషల స్టార్ హీరోలతో పోల్చితే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి.
By: Ramesh Palla | 15 Sept 2026 11:41 AM ISTబాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు ఇతర భాషల స్టార్ హీరోలతో పోల్చితే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఇతర భాషల స్టార్ హీరోలు ఏడాదికి సగటున ఒక సినిమాను చేస్తుండగా, టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం రెండు ఏళ్లకు ఒకటి చొప్పున చేస్తూ వస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోలు కాస్త పర్వాలేదు, కానీ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ వంటి హీరోలు ఒక్క సినిమాకు దాదాపు రెండు ఏళ్లు తీసుకుంటున్నారు. దాంతో వారి అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్న వారు, సినిమాలను అభిమానించే వారు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఏడాదిలో రెండు కాకున్నా కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేయడం ద్వారా ఇండస్ట్రీకి మంచి చేసిన వారు అవుతారు. కానీ ఏ ఒక్క హీరో కూడా అలా చేయడం లేదు. ప్రతి హీరో స్పీడ్‌గా సినిమాలు చేయాలి అనుకుంటున్నారు కానీ సాధ్యం కావడం లేదు.
బాహుబలి సినిమాతో ప్రభాస్‌కి...
బాహుబలి వల్ల ప్రభాస్‌కి చాలా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత రెండు సినిమాలు సైతం చాలా గ్యాప్ తీసుకుని చేసిన విషయం తెల్సిందే. అందుకే ప్రభాస్ ఇక మీదట నా నుంచి ఏడాదికి రెండు సినిమాలు వస్తాయంటూ ఒకటి రెండు సార్లు మీడియా ముందే చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటి వరకు అది సాధ్యం కావడం లేదు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలను విడుదల చేయాలనే గట్టి పట్టుదలతో ప్రభాస్ వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. వాటి షూటింగ్ సైతం మొదలు పెట్టాడు. కానీ దర్శకుల తీరు, ప్రభాస్ డేట్లు కుదరక పోవడం వల్ల షూటింగ్ పూర్తి చేయలేక పోయారు. ఏడాదికి రెండు కాదు కదా కనీసం ఏడాదిలో ఒక్క సినిమాను సైతం విడుదల చేయలేక పోయారు. ప్రభాస్ ఈ ఏడాదిలో ఇప్పటికే ఒక సినిమాతో వచ్చాడు. మరో సినిమా ఫౌజీ తో రావాల్సి ఉన్నా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల ప్రేక్షకుల ముందుకు రాలేక పోతున్నాడు.
అల్లు అర్జున్ రాకా సినిమా షూటింగ్....
ప్రభాస్ ఇంతకు ముందు ఎలా అయితే ఏడాదికి రెండు సినిమాలతో రావాలి, సినిమాకు సినిమాకు ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోవాలి అనుకున్నాడో అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పుష్ప సినిమా కోసం దాదాపుగా ఐదేళ్ల సమయం కేటాయించిన అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా సైతం చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాదికి కానీ సినిమా వచ్చే పరిస్థితి లేదు. దాంతో బన్నీ సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువ కావడంతో పాటు, సినిమాల సంఖ్య చాలా తగ్గింది. అందుకే ఇక మీదట ఇలా ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోవడంతో పాటు, ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నాడట. అందుకే ఇప్పటికే రెండు మూడు సినిమాలకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా...
అట్లీతో చేస్తున్న 'రాకా' సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కాబోతుంది. ఆ వెంటనే లోకేష్ కనగరాజ్ మూవీని సెట్స్ పైకి తీసుకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది చివరి వరకు షూటింగ్ పూర్తి చేసి 2028 ఆరంభంలోనే ఆ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత బాసిల్ దర్శకత్వంలోనూ ఒక సినిమాను చేసేందుకు బన్నీ ఓకే చెప్పాడు. అది 2027 చివర్లో షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయాలని సూచించాడు. ఈ మూడు సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువ లేకుండా బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకు ముందు ప్రభాస్ ఎలా అయితే ప్లాన్ చేశాడో అలాగే బన్నీ సైతం ప్లాన్ చేస్తున్నాడు కానీ ఇది ఎంతవరకు సాధ్యం అయ్యేనో చూడాలి. ఎందుకంటే సినిమాకు సినిమాకు గ్యాప్ అనేది ఇప్పుడు స్టార్ హీరోలకు కచ్చితంగా వస్తుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ నుంచి మొదలుకుని బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ వరకు చాలా పనులు ఉంటాయి. కనుక కనీసం రెండు మూడు నెలల గ్యాప్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఏడాదిలో ఒక్క సినిమా అయినా స్టార్ హీరోలకు సాధ్యం కాకపోవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం. మరి బన్నీ వారి అంచనాలను తలకిందులు చేసి రాబోయే రెండేళ్లలో మూడు సినిమాలతో వస్తాడా అనేది చూడాలి.
