సైన్స్ ఫిక్షన్ మూవీ తర్వాత బన్నీ టార్గెట్ ఇదే
పుష్ప, పుష్ప 2 చిత్రాల కోసం ఐదేళ్లు కేటాయించిన అల్లు అర్జున్ తనను తాను తిరుగు లేని పాన్ ఇండియన్ స్టార్ గా ఆవిష్కరించుకున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 14 Nov 2025 9:20 AM ISTపుష్ప, పుష్ప 2 చిత్రాల కోసం ఐదేళ్లు కేటాయించిన అల్లు అర్జున్ తనను తాను తిరుగు లేని పాన్ ఇండియన్ స్టార్ గా ఆవిష్కరించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన మార్కెట్ ని పాన్ వరల్డ్ రేంజుకు చేర్చేందుకు అతడు అహర్నిశలు రాజీ అన్నదే లేకుండా శ్రమిస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న AA22XA6 చిత్రం కోసం అతడు వందశాతం ఎఫర్ట్ పెట్టి పని చేస్తున్నాడు. తన కెరీర్ బెస్ట్ ఇచ్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని బన్ని విడిచిపెట్టడం లేదని సమాచారం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా హిస్టరీలో నెవ్వర్ బిఫోర్ అనే రేంజులో తెరకెక్కిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో దీపిక పదుకొనే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ ప్రమాణాలతో ఆర్.ఆర్ ని డిజైన్ చేస్తున్నారు. అలాగే బన్ని బాడీ లాంగ్వేజ్, డ్యాన్సింగ్ ఎబిలిటీకి తగ్గట్టుగా వైవిధ్యమైన ట్యూన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే బన్ని ఈ సినిమా కోసం ఏకంగా రెండేళ్లు పైగానే కేటాయించడం అభిమానుల్లో నిరాశను పెంచుతోంది. అతడు వేగంగా సినిమాలను పూర్తి చేసి, వెంట వెంటనే థియేటర్లలో ట్రీటివ్వాలని ఆశిస్తున్నారు. దీనికి తగ్గట్టు ఇప్పుడు అల్లు అర్జున్ తన ప్రస్తుత చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి తదుపరి సినిమా సెట్స్ పైకి వెళ్లాలని భావిస్తున్నారట. దానికి తగ్గట్టే బన్నీ స్వయంగా టార్గెట్ ని ఫిక్స్ చేసుకుని దర్శకనిర్మాతలకు సహకరిస్తున్నాడు. చాలా సైలెంట్ గా తన పార్ట్ ని బన్నీ పూర్తి చేసేస్తున్నారని తెలుస్తోంది. తన పార్ట్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నాటికి పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నాడని తెలిసింది.
అట్లీతో సైన్స్ ఫిక్షన్ మూవీ టాకీ పార్ట్ పూర్తి చేయగానే, అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్ పైకి వెళతాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బన్ని రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. అయితే త్రివిక్రమ్ తన స్క్రిప్టుతో బన్నీని ఓకే చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అధికారికంగా ఏదైనా ప్రకటించగలరు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత త్రివిక్రమ్ తో సినిమా కోసం బన్ని ఆసక్తిగానే ఉన్నారు. అయితే త్రివిక్రమ్ తో పాటు పలువురు పాన్ ఇండియన్ దర్శకులు అల్లు అర్జున్ కోసం పోటాపోటీగా స్క్రిప్టుల్ని రెడీ చేస్తున్నారు. వీళ్లలో ప్రశాంత్ నీల్, రాజమౌళి, కొరటాల శివ, సంజయ్ లీలా భన్సాలీ వంటి దిగ్గజ దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్- దిల్ రాజు ఇప్పటికే బన్నీని లాక్ చేయాలని స్పష్ఠమైన ప్రణాళికతోఉన్నట్టు తెలిసింది. అలాగే మహేష్ తో గ్లోబ్ ట్రోటర్ సినిమాని పూర్తి చేసాక రాజమౌళి బన్నీ కోసం పని చేస్తారని గుసగుస వినిపిస్తోంది. అలాగే కొరటాల శివతో ఆగిపోయిన ప్రాజెక్టును బన్ని పట్టాలెక్కించే వీలుంది. అయితే ఈసారి కొరటాల అందించే స్క్రిప్టు ప్రతిదీ డిసైడ్ చేస్తుంది. మరోవైపు సరైనోడు లాంటి మాస్ హిట్ ని అందించిన బోయపాటి కూడా అల్లు అర్జున్ కోసం స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారని సమాచారం.
బన్ని లైనప్ చూస్తుంటే, అతడు సినిమా సినిమాకి వైవిధ్యం చూపించేందుకు తనవంతు ప్రయత్నాల్లో ఉన్నట్టు అర్థమవుతోంది. పుష్ప లాంటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తర్వాత అట్లీతో సైన్స్ ఫిక్షన్ కథాంశాన్ని ఎంచుకోవడం తెలివైన ఎత్తుగడ. తదుపరి త్రివిక్రమ్ తో లైటర్ వెయిన్ సినిమా చేస్తాడా? ప్రశాంత్ నీల్ తో సూపర్ హీరో తరహాలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తాడా? పాన్ వరల్డ్ డైరెక్టర్ రాజమౌళితో లాక్ అయిపోతాడా? అన్నది ఇప్పుడే చెప్పలేం. రాజమౌళి, ప్రశాంత్ నీల్ బౌండ్ స్క్రిప్టుతో రెడీగా ఉంటే బన్ని మొదట తన కాల్షీట్లను ఆ ఇద్దరికే ఇస్తాడని కూడా అభిమానులు ఊహిస్తున్నారు. బన్నీ వాట్ నెక్ట్స్? అనేదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
