ఆ డైరెక్టర్స్ విషయంలో బన్నీ లెక్క తప్పదుగా?
ఐకాన్ స్టార్.. పుష్ప సిరీస్‌లతో వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌లని సొంతం చేసుకుని ప్రభాస్ తరువాత సౌత్ నుంచి పాన్ ఇండియా స్టార్‌ల జాబితాలో చేరడం తెలిసిందే.
By: Tupaki Entertainment Desk | 17 Jan 2026 7:00 PM ISTఐకాన్ స్టార్.. పుష్ప సిరీస్‌లతో వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌లని సొంతం చేసుకుని ప్రభాస్ తరువాత సౌత్ నుంచి పాన్ ఇండియా స్టార్‌ల జాబితాలో చేరడం తెలిసిందే. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన `పుష్ప 2` మూవీ వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుని దాదాపు రూ.1800 కోట్లు రాబట్టి బన్నీ సినిమాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశ వ్యాప్తంగా బన్నీ మేనియా తారా స్థాయికి చేరేలా చేసింది. బాలీవుడ్ దిగ్దర్శకులు సైతం బన్నీని ప్రత్యేకంగా ఆహ్వానించేలా చేసింది.
`పుష్ప 2`తో తన బ్రాండ్ ఇమేజ్ తారా స్థాయికి చేరడంతో బన్నీ తన ఇమేజ్‌కు తగ్గట్టుగా ప్రాజెక్ట్‌లని ఎంచుకోవడం మొదలు పెట్టాడు. `పుష్ప 2` తరువాత అంతకు మించిన ప్రాజెక్ట్‌తో పాన్ వరల్డ్ స్థాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇండియన్ సూపర్ హీరో స్టోరీతో భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. దీని కోసం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీని రంగంలోకి దించేస్తూనే తమిళనాట స్టార్ ప్రొడక్షన్ కంపనీగా పేరున్న సన్ పిక్చర్స్‌తో ఈ భారీ పాన్ వరల్డ్ మూవీని స్టార్ట్ చేయడం తెలిసిందే.
కాంబినేషన్‌తోనే సర్‌ప్రైజ్ చేసిన బన్నీ స్టార్ కాస్టింగ్‌తోనూ అంతే సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకోన్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. వీరితో పాటు జాన్వీ కపూర్, రష్మిక మందన్న కూడా హీరోయిన్‌లుగా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై టీమ్ ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక హాలీవుడ్ టెక్నీషియన్‌లు వర్క్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు బన్నీ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తన 23వ ప్రాజెక్ట్‌ని ఇటీవలే ప్రకటించాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ రీసెంట్ ట్రాక్ రికార్డ్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. లోకేష్ కనగరాజ్ చేసిన `కూలీ` మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో బన్నీ ఫ్యాన్స్,తో పాటు సినీ లవర్స్ కంగారు పడుతున్నారు. అంతే కాకుండా గతంలో టాలీవుడ్ హీరోలు తమిళ డైరెక్టర్లతో కలిసి చేసిన సినిమాల రిజల్డ్స్‌ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత రామ్‌చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి `గేమ్ ఛేంజర్` చేయగా అది డిజాస్టర్ కావడం తెలిసిందే.
ఏ.ఆర్. మురుగదాస్‌తో మహేష్ బాబు `స్పైడర్` మూవీ చేశాడు. అది కూడా దారుణంగా డిజాస్టర్ అయి షాక్ ఇచ్చింది. ఇక ఎన్. లింగుసామితో రామ్ `వారియర్` చేస్తే అది ఎలాంటి ఫలితాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వెంకట్ ప్రభుతో చైతూ చేసిన `కస్టడీ` గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా తమిళ దర్శకులతో తెలుగు హీరోలు చేసిన సినిమాలు డిజాస్టర్లుగా నిలిచిన రికార్డ్‌ని చూసి కూడా బన్నీ ఈ దశలో ఇలాంటి సాహసం ఎందుకు చేస్తున్నాడని అంతా వాపోతున్నారు. ఒకేసారి అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి ఇద్దరు తమిళ డైరెక్టర్లతో భారీ సినిమాలు చేస్తున్న బన్నీ సక్సెస్‌లు సాధించి ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తాడా? లేక ఓవర్‌గా వెళ్లి లెక్క తప్పుతాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
