Begin typing your search above and press return to search.

టీవీ మార్కెట్.. ఊపిరి పోస్తున్న బన్నీ

కానీ, ఈ కష్టకాలంలో టెలివిజన్ రంగానికి 'ఆక్సిజన్' అందిస్తున్న ఏకైక స్టార్ గా అల్లు అర్జున్ నిలుస్తున్నాడు.

By:  M Prashanth   |   21 Nov 2025 12:26 PM IST
టీవీ మార్కెట్.. ఊపిరి పోస్తున్న బన్నీ
X

ప్రస్తుత డిజిటల్ యుగంలో వినోదం స్వరూపం పూర్తిగా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో వైఫై ఉన్నప్పుడు టీవీ ముందు కూర్చుని యాడ్స్ భరిస్తూ సినిమాలు చూసే ఓపిక ఎవరికీ ఉండటం లేదు. దీంతో శాటిలైట్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఛానల్స్ రేటింగ్స్ కోసం నానా తంటాలు పడుతున్నాయి. స్టార్ హీరోల కొత్త సినిమాలకు కూడా ప్రీమియర్ రోజున కనీస టీఆర్పీలు రావడం లేదు. కానీ, ఈ కష్టకాలంలో టెలివిజన్ రంగానికి 'ఆక్సిజన్' అందిస్తున్న ఏకైక స్టార్ గా అల్లు అర్జున్ నిలుస్తున్నాడు.

తాజాగా వెలువడిన బార్క్ రేటింగ్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమాను టీవీలో ఏడోసారి ప్రసారం చేశారు. సాధారణంగా రెండోసారి వేస్తేనే జనం చూడరు. అలాంటిది ఏడోసారి వేసినా సరే, ఈ చిత్రానికి ఏకంగా 6.78 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి వస్తున్న రేటింగ్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. దీన్ని బట్టి బన్నీ సినిమాలకు బుల్లితెరపై ఏ రేంజ్ లో "రిపీట్ వాల్యూ" ఉందో అర్థం చేసుకోవచ్చు.

కేవలం కొత్త సినిమాలే కాదు, దశాబ్దం క్రితం వచ్చిన సినిమాలు కూడా ఇప్పుడు ఛానల్స్ ను కాపాడుతున్నాయి. ఎప్పుడో రిలీజైన 'రేసుగుర్రం' చిత్రాన్ని రీసెంట్ గా టెలికాస్ట్ చేస్తే, దానికి 3.65 టీఆర్పీ దక్కింది. కొత్తగా రిలీజైన మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఈమధ్య ఈ స్థాయి రేటింగ్ రావడం గగనమైపోతోంది. కానీ బన్నీ పాత సినిమాలు మాత్రం ఇంకా ఫ్రెష్ గానే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ సినిమాల్లో ఉండే "యూనివర్సల్ అప్పీల్". మాస్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడమే కాదు, ఇళ్లల్లో ఉండే మహిళలు, పిల్లలను టీవీల ముందు కట్టిపడేసే మ్యాజిక్ బన్నీకి బాగా తెలుసు. ఆయన కామెడీ టైమింగ్, డ్యాన్సులు ఫ్యామిలీ ఆడియన్స్ కు బోర్ కొట్టనివ్వవు. అందుకే ఓటీటీలో ఎన్నిసార్లు చూసినా, టీవీలో వస్తుందంటే చాలు రిమోట్ అక్కడ ఆగిపోతోంది.

ప్రస్తుతం శాటిలైట్ రైట్స్ బిజినెస్ డల్ గా ఉన్న సమయంలో, బన్నీ సినిమాలు మాత్రం ఛానల్స్ కు లక్కీగా మారాయి. సినిమా ఫ్లాప్ అయినా సరే, టీవీలో హిట్ అవుతుందనే నమ్మకం బయ్యర్లలో ఉంది. అందుకే ఆయన సినిమాలకు శాటిలైట్ రైట్స్ రూపంలో భారీ ఆఫర్లు వస్తుంటాయి. మొత్తానికి చచ్చిపోతున్న టీవీ సినిమా మార్కెట్ కు అల్లు అర్జున్ కొత్త ఊపిరి పోస్తున్నాడనే చెప్పాలి.