ముంబై నుంచి కోర్టుకు బన్నీ.. కోర్టు ఏమందంటే?
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు మరోసారి ఊరట ఇచ్చింది.
By: M Prashanth | 6 July 2026 7:20 PM ISTహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు మరోసారి ఊరట ఇచ్చింది. ప్రస్తుతం రాకా సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్న అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఆయన సోమవారం వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు.
ఈ కేసులో గత విచారణ సమయంలో కూడా అల్లు అర్జున్ వర్చువల్ గానే హాజరయ్యారు. అయితే జులై 6న జరిగే విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని పోలీసులు గత నెల నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ తరఫు న్యాయవాది, షూటింగ్ కారణంగా ఆయన ముంబైలో ఉన్నారని, అందువల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.
ప్రత్యేక పరిస్థితులు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆ అభ్యర్థనను అంగీకరించారు. అయితే సోమవారం జరిగిన విచారణలో అల్లు అర్జున్‌తో పాటు కేసులోని మిగిలిన నిందితులంతా హాజరు కాలేదు. కొందరు వ్యక్తిగత కారణాలతో కోర్టుకు రాకపోవడంతో పూర్తి విచారణ జరగలేదు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అలాగే కేసుకు సంబంధించిన 500 పేజీల ఛార్జ్ షీట్ కాపీలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు. ఇందులో అల్లు అర్జున్‌కు ఏ-11గా స్థానం కల్పించారు. తొలి పది మంది నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యం, నిర్వహణకు సంబంధించిన వ్యక్తుల పేర్లు నమోదు చేశారు. థియేటర్ లో తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, జనసందోహాన్ని నియంత్రించడంలో నిర్లక్ష్యం వహించడం వంటి అంశాలపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటన డిసెంబరు 2024లో పుష్ప-2 సినిమా విడుదల సమయంలో జరిగింది. ప్రీమియర్స్ షో కోసం అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో అభిమానులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా జనాలు ముందుకు దూసుకురావడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ఊపిరాడక మృతి చెందగా, ఆమె కొడుకు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సంఘటన అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఘటనపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు సుదీర్ఘ దర్యాప్తు నిర్వహించి ఛార్జ్‌షీట్ ను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆ ఛార్జ్ షీట్ ను కోర్టులో సమర్పించడంతో కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఇకపై నిందితుల హాజరు, అభియోగాల పరిశీలన, తదుపరి ప్రక్రియలపై విచారణ కొనసాగనుంది. ముంబైలో షూటింగ్ లో ఉన్న కారణంగా అల్లు అర్జున్ కు వర్చువల్ హాజరుకు కోర్టు అనుమతి ఇవ్వడం విచారణలో కీలక పరిణామంగా నిలిచింది. అదే సమయంలో మిగిలిన నిందితులు హాజరుకాకపోవడంతో కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. మరి తదుపరి విచారణలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
