Begin typing your search above and press return to search.

బన్నీ దగ్గర ఇద్దరు దర్శకుల లైన్ ఆగిపోయిందా?

అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ఒకప్పుడు సందీప్ రెడ్డి వంగా, బోయపాటి శ్రీను ఇద్దరి పేర్లు గట్టిగానే వినిపించాయి.

By:  M Prashanth   |   21 Aug 2026 4:00 PM IST
బన్నీ దగ్గర ఇద్దరు దర్శకుల లైన్ ఆగిపోయిందా?
X

అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ఒకప్పుడు సందీప్ రెడ్డి వంగా, బోయపాటి శ్రీను ఇద్దరి పేర్లు గట్టిగానే వినిపించాయి. వంగా సినిమా అయితే 2023లోనే అఫీషియల్‌గా అనౌన్స్ అయింది. బోయపాటితో ‘సరైనోడు’ తర్వాత మరో సినిమా ఉంటుందనే టాక్ కూడా చాలాకాలంగా నడుస్తోంది. కానీ ఇప్పుడు బన్నీ ‘రాకా’తో బిజీగా ఉండగా.. ఈ ఇద్దరు దర్శకులు కూడా తమ తర్వాతి సినిమాల కోసం మరో లెక్కలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

వంగా సంగతి చూస్తే ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ మీదే పూర్తి ఫోకస్ ఉంది. ఈ సినిమా 2027 మార్చి 5న రిలీజ్ కానుందని మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత కూడా బన్నీ సినిమా వైపు వెళ్లడం లేదు. రణబీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ను 2027 మధ్యలో మొదలుపెడతానని వంగానే చెప్పాడు. అంటే బన్నీతో అనౌన్స్ చేసిన సినిమా ఉన్నా అది ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందన్నది ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి.

అయితే వంగా బన్నీ సినిమా ఆగిపోయిందని కూడా ఫిక్స్ అవ్వలేం. నిర్మాత భూషణ్ కుమార్ ఈ ఏడాది మొదట్లోనే ఈ కాంబినేషన్ ఇంకా ఉందని చెప్పాడు. సమస్య సినిమా క్యాన్సిల్ కావడం కంటే ఇద్దరి లైనప్‌లో ఖాళీ లేకపోవడమే. వంగా దగ్గర ‘స్పిరిట్’, ‘యానిమల్ పార్క్’ ఉంటే.. బన్నీ ప్రస్తుతం అట్లీతో తన కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అలాగే లోకేష్ సినిమా కూడా త్వరలోనే స్టార్ట్ కావచ్చు.

బోయపాటి దగ్గర పరిస్థితి మరోలా ఉంది. బన్నీతో రెండో సినిమా చేయాలనే ప్లాన్ ఉన్నప్పటికీ అది వెంటనే జరిగేలా కనిపించడం లేదు. అందుకే ఆయన తన తర్వాతి సినిమా కోసం మరో హీరోను చూసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో తన కుమారుడు హర్షిత్‌ను దర్శకుడిగా పరిచయం చేసే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అంటే బన్నీ డేట్స్ కోసం ఖాళీగా ఉండకుండా తన సినిమా, కొడుకు సినిమా రెండింటినీ ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నారు.

నిజానికి ‘సరైనోడు’ కాంబినేషన్ కావడంతో బోయపాటి బన్నీ సినిమా మీద ఎప్పటి నుంచో చర్చల్లో ఉంది. 2016లో వచ్చిన ఆ సినిమా బన్నీకి అప్పట్లో పెద్ద కమర్షియల్ హిట్ ఇచ్చింది. కానీ పదేళ్ల తర్వాత ఇద్దరి కెరీర్లు కూడా చాలా మారిపోయాయి. పుష్ప తర్వాత బన్నీ పాన్ ఇండియా లెక్కలోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు ‘రాకా’ కూడా భారీ స్కేల్‌లో సిద్ధమవుతోంది.

అందుకే వంగా, బోయపాటి సినిమాలు లేవని ఇప్పుడే కొట్టేయడం కరెక్ట్ కాదు. వంగా సినిమా అఫీషియల్‌గా ఇంకా లైనప్‌లోనే ఉంది. బోయపాటి కాంబినేషన్ కూడా పూర్తిగా పక్కకు వెళ్లిందనే క్లారిటీ లేదు. కాకపోతే బన్నీ కోసం ఇద్దరూ తమ సినిమాలను ఆపుకొని కూర్చునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఒకప్పుడు బన్నీ నెక్స్ట్ ఎవరిది అనే లిస్టులో ముందున్న ఈ ఇద్దరూ.. ఇప్పుడు ముందు తమ సినిమాలు చేసుకుని మళ్లీ ఆయన దగ్గరకు వచ్చేలా ఉన్నారు.