సన్ పిక్చర్స్ నమ్మకం.. రజనీ తర్వాత అంత భారీగా బన్నీపైనేనా?
నిజానికి సన్ పిక్చర్స్ గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందిన నటులతోనే సినిమాలు నిర్మిస్తోంది.
By: M Prashanth | 22 July 2026 12:31 PM ISTసౌత్ సినీ ఇండస్ట్రీలో భారీ సినిమాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చే నిర్మాణ సంస్థల్లో సన్ పిక్చర్స్ ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్, అన్నాత్తే వంటి చిత్రాలను నిర్మించిన ఆ బ్యానర్, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రాకా ప్రాజెక్టును తెరకెక్కిస్తోంది. దీంతో రజనీ తర్వాత సన్ పిక్చర్స్ అంతటి నమ్మకాన్ని అల్లు అర్జున్ పైనే ఉంచిందా అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
నిజానికి సన్ పిక్చర్స్ గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందిన నటులతోనే సినిమాలు నిర్మిస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్ తో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. అదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా ఆ సంస్థ పనిచేసింది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ తో వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తోంది.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ మార్కెట్ లో కూడా ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. పుష్ప-2 విజయంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సన్ పిక్చర్స్ అల్లు అర్జున్ తో భారీ ప్రాజెక్టుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక రాకా చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తుండటం మరో ప్రత్యేకత.
కమర్షియల్ ఎలిమెంట్స్ ను భారీ స్థాయిలో ప్రేక్షకులకు అందించడంలో అట్లీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో జవాన్ తో సత్తా చాటిన ఆయన, ఇప్పుడు బన్నీతో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంతో ఆ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారట. అంత భారీ క్యాస్టింగ్ తో రూపొందుతున్న ఆ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.
అయితే సన్ పిక్చర్స్ ఇప్పటివరకు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన చిత్రాల్లో ఎక్కువగా తమిళ హీరోలే కనిపించారు. కానీ ఇప్పుడు తెలుగు హీరో అల్లు అర్జున్ ను సెలెక్ట్ చేయడం, ఆయన మార్కెట్ పై సంస్థకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోందని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నార్త్ లో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ ఆ నిర్ణయానికి ప్రధాన కారణమై ఉండొచ్చని అంటున్నారు.
మరోవైపు, రాకా సినిమా పూర్తయ్యాక అల్లు అర్జున్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. దీంతో వచ్చే కొన్నేళ్ల పాటు పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ హవా కొనసాగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా రజనీకాంత్ తర్వాత సన్ పిక్చర్స్ అంతటి భారీ స్థాయిలో నమ్మకం ఉంచిన హీరోగా అల్లు అర్జున్ నిలుస్తారా? అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే రాకా విడుదల తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది.
