ఐకాన్ స్టార్ 'రాకా' అలా ఫిక్సైందా?
తన పార్ట్ వరకూ డిసెంబర్ లోగా పూర్తి చేసి బయటకు రావాలని అట్లీతో చేసుకున్న ఒప్పందంలో ఉందని సమాచారం.
By: Srikanth Kontham | 8 July 2026 1:52 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. `పుష్ప 2` వంటి సంచలన విజయం తర్వాత బన్నీ తదుపరి సినిమాల విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `రాకా`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ముంబై , హైదరాబాద్ కేంద్రంగా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ లీకైంది. అల్లు అర్జున్ కెరీర్‌లో ఏనాడూ లేని విధంగా పక్కా ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని డిసెంబర్ లోపే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారుట.
తన పార్ట్ వరకూ డిసెంబర్ లోగా పూర్తి చేసి బయటకు రావాలని అట్లీతో చేసుకున్న ఒప్పందంలో ఉందని సమాచారం. ఇదే నిజమైతే డైరెక్టర్లు అంతా మరింత అలెర్ట్ గా పని చేయాల్సి ఉంటుంది. బన్నీ వేగం చూస్తుంటే టాలీవుడ్ హీరోలందరికీ ఓ కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తున్నట్లే. అట్లీ వంటి స్టార్ డైరెక్టర్‌తో సినిమా అంటే చాలా సమయం పడుతుంది. కానీ బన్నీ మాత్రం డేట్లను పకడ్బందీగా కేటాయించినట్లు తెలుస్తోంది. ఏడాదిలో రెండు భారీ పాన్-ఇండియా చిత్రాలను పూర్తి చేయాలనేది బన్నీ టార్గెట్ కావొచ్చు. `రాకా` షూటింగ్ పూర్తి కాగానే జనవరి నుంచి మరో సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమ వుతున్నారుట.
లోకేష్ కనగరాజ్ యూనివర్స్ సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ - లోకేష్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ఇలా అట్లీ - లోకేష్ వంటి అగ్ర దర్శకులతో వరుసగా సినిమాలు చేయడం అనేది బన్నీ పాన్-ఇండియా మార్కెట్‌ను మరింత విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నంగా చూడొచ్చు. ఓ వైపు భారీ యాక్షన్, మరోవైపు విభిన్నమైన కథాంశాలతో బన్నీ చేస్తున్న ప్రయాణం ట్రేడ్ వర్గాల్లో సైతం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏడాది గ్యాప్‌లో రెండు భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడం అంటే అది సాహసమే.
కానీ ఐకాన్ స్టార్ తనకున్న స్టార్‌డమ్‌ను సరైన పద్ధతిలో వాడుకుంటూ బాక్సాఫీస్ వద్ద నిరంతరం ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. అల్లు అర్జున్ సినిమాలను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా దేశవ్యాప్త ప్రేక్షకులను మెప్పించేలా ప్లాన్ చేయడం ఆయన గ్లోబల్ విజన్‌ను తెలియజేస్తోంది. బన్నీ వేగం కేవలం సినిమాల సంఖ్యను పెంచడానికే కాదు. ఒక నటుడిగా తన పరిధిని పెంచుకోవడానికి అని అర్థమవుతోంది. అట్లీ మార్క్ యాక్షన్, లోకేష్ కనగరాజ్ మేకింగ్ స్టైల్ రెండూ అల్లు అర్జున్ స్టైల్ అండ్ స్వాగ్‌కు అద్భుతంగా సరిపోతాయి . రెండు చిత్రాలు పూర్తయ్యే సమయానికి అల్లు అర్జున్ పాన్-ఇండియా స్థాయిలో మరింత బలమైన స్థానానికి చేరుకోవడం ఖాయం.
అభిమానులు కూడా హీరో నుండి ఇలాంటి హై-వోల్టేజ్ ప్రాజెక్టులనే ఆశిస్తున్నారు. బన్నీ వేసిన ఈ ప్రణాళిక పక్కాగా అమలు అయితే? రికార్డు బ్రేక్ అవుతుంది. పాన్ ఇండియా హీరోల్లో వేగంగా సినిమాలు ఎవరు చేస్తున్నారంటే? రెబల్ స్టార్ ప్రభాస్ పేరు చెబుతారంతా. ఒకేసారి రెండు..మూడు సినిమాలను సెట్స్ కు తీసుకెళ్లడం ఇంతవరకూ అతడికి మాత్రమే సాధ్యమైంది. మిగతా హీరోలెవరు అంత సాహసం చేయలేదు. తాజాగా బన్నీ మాత్రం ప్రభాస్ తరహాలో రెడీ అవ్వడం విశేషం.
