Begin typing your search above and press return to search.

బన్నీ 'రాకా'.. ఆ ట్రెండ్ నే అంతా ఫాలో అవుతున్నారా?

ఇదిలా ఉంటే, మలయాళ సినీ పరిశ్రమలో ఇప్పటికే ఫాంటసీ యూనివర్స్‌ సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి.

By:  M Prashanth   |   20 April 2026 3:50 PM IST
బన్నీ రాకా.. ఆ ట్రెండ్ నే అంతా ఫాలో అవుతున్నారా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న రాకా సినిమా టాలీవుడ్‌ లో కొత్త ట్రెండ్‌ కు నాంది పలుకుతోందా అన్న చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది. ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత వేర్‌ వుల్ఫ్‌ (మనిషి- నక్క మిశ్రమ జీవి) కథతో రాకా చిత్రం తెరకెక్కుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా చూడని ఆ జానర్‌ పై ఇప్పుడు ఒక్కసారిగా ఆసక్తి పెరిగినట్టు కనిపిస్తోంది.

ఇటీవల ఫాంటసీ, మైథాలజీ, సూపర్‌ నేచురల్ కథలపై సినీ ప్రియుల్లో పెరుగుతున్న ఆసక్తిని గమనించిన దర్శకనిర్మాతలు కొత్త ప్రయోగాల వైపు అడుగులు వేస్తున్నారు. రాకా మూవీ కూడా ఇప్పుడు ఈ నేపథ్యంలోనే వస్తుండగా, ఇదే తరహాలో మరికొన్ని ప్రాజెక్టులు కూడా లైన్‌ లోకి వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

యంగ్ హీరో రామ్ పోతినేని కూడా వేర్‌ వుల్ఫ్‌ కథతో ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమైతే.. టాలీవుడ్‌ లో వేర్‌ వుల్ఫ్‌ జానర్‌ కు మరితం బూస్ట్ లభించే అవకాశముంది. ఇప్పటివరకు రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పరిమితమైన ఆయన.. ఇలా పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే, మలయాళ సినీ పరిశ్రమలో ఇప్పటికే ఫాంటసీ యూనివర్స్‌ సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ముఖ్యంగా లోకా చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో, ఆ యూనివర్స్‌ ను విస్తరించే పనిలో మేకర్స్ ఉన్నారు. ఈ క్రమంలో స్టార్ నటులు టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో మరిన్ని సినిమాలు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

వీటన్నింటినీ చూస్తుంటే.. దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తం ఇప్పుడు ఫాంటసీ, సూపర్‌ నేచురల్ ప్రపంచాల వైపు దృష్టి సారిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ తరహా కాన్సెప్ట్‌ లను భారతీయ కథలతో మేళవించి ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ట్రెండ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇలాంటి కథలకు మంచి విజువల్ ఎఫెక్ట్స్, భారీ బడ్జెట్ అవసరం. అదే సమయంలో కథ కూడా బలంగా ఉండాలి. లేకపోతే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం.

ఇప్పటికే బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి భారీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో.. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ కూడా పెరిగాయి. అందుకే ఇప్పుడు మేకర్స్ కూడా కొత్త జానర్లతో రిస్క్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ రాకాతో మొదలైన వేర్‌ వుల్ఫ్ ట్రెండ్ నిజంగానే టాలీవుడ్‌ లో స్థిరపడుతుందా? లేక టెంపరరీ హైప్‌ గా మిగిలిపోతుందా? అన్నది చూడాలి. అయితే ప్రేక్షకులకు మాత్రం కొత్త కథలు, కొత్త ప్రపంచాలు చూసే అవకాశం రావడం మాత్రం ఖాయమని చెప్పాలి.