రాకా టైటిల్ బ్యాక్ స్టోరీ..బన్నీ, అట్లీ ప్లాన్ అదుర్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన `రాకా` టైటిల్, బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని షాక్‌కు గురి చేసింది.
By: Ravindar Gorantla | 9 April 2026 12:15 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన `రాకా` టైటిల్, బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని షాక్‌కు గురి చేసింది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సినిమలకు వీఎఫ్ ఎక్స్ అందించిన పలు సంస్థలు దీనికి వర్క్ చేస్తున్నాయి.
అనౌన్స్ మెంట్ వీడియోలోనే ఈ మూవీని హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ధీటుగా నిర్మించబోతున్నామని, వీఎఫ్ ఎక్స్ స్టూడియోలని విజిట్ చేసిన వీడియోలని రిలీజ్ చేసిన అట్లీ, బన్నీ ఈ మూవీ కోసం భారీ ప్లాన్‌నే రెడీ చేసినట్టుగా ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్‌తో స్పష్టమవుతోంది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి షాక్ ఇచ్చారు. బన్నీ ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని, అసలే ట్రై చేస్తాడని కూడా ఊహించి గుండు గెటప్‌లో ఓల్ఫ్ హ్యాండ్‌తో కనిపించడంతో ఫ్యాన్స్, సినీ లవర్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
దీంతో ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారి ట్రెండ్ అవుతూ టైటిల్, ఫస్ట్ లుక్‌లపై ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. రాకా టైటిల్ బ్యాక్ స్టోరీ ఏంటీ? ఫస్ట్ లుక్ వెనకున్న ఆసక్తికరమైన కథేంటీ? ఇంతకీ `రాకా` అంటే అర్థమేంటీ? అని నెటిజన్‌లు, అభిమానులు నెట్టింట సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. పోస్టర్‌కు `ఇది ఆరంభం మాత్రమే` అని జోడించడంతో అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. దీంతో `రాకా` టైటిల్, బన్నీ ఫస్ట్‌లుక్ వెనకున్న ఆసక్తికరమైన స్టోరీ ఏంటని, రాకా టైటిల్‌కున్న అర్థమేంటని వెతుకుతున్నారు. ఇంటర్నెట్‌లో దీని గురించి తెలుసుకోవాలని సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ వెతుకు లాటలో ఒక్కొక్కరు ఒక్కొ విధంగా స్పందిస్తూ తమకు నచ్చిన థియరీని వైరల్ చేసేస్తున్నారు.
పురాణాలకు సంబంధం...
తెలుగు, సంస్కృతంలో `రాకా` అంటే పున్నమి చంద్రుడు..పౌర్ణమి అని అర్థం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ట్విలైట్ అని అర్థం. అంతే కాకుండా ప్రత్యేకంగా పౌర్ణమి రోజుకు ఆదిదేవతగా సూచిస్తుంది. పురాణ గ్రంథాలతో రాకాదేవి పౌర్ణమికి ఆదిదేవత. రామాయణానికి కూడా దగ్గరి సంబంధం ఉంది. రాకా విశ్వరవ మహర్షి భార్యలలో ఒకరిగా పేర్కొనబడింది.
రాకా శక్తికి ప్రతీక...
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం `రాకా` అంటే పౌర్ణమి యోధుడు అని అర్థం. అంతే కాకుండా పౌర్ణమి రాత్రులలో శక్తివంతమైన మృగం అని అర్థం. ఫస్ట్ లుక్‌లో తోడేలు చేయి కనిపించడంతో శక్తివంతమైన, అతిబలమైన మృగం అని అర్థంగా చెబుతున్నారు. అంతే కాకుండా కొన్ని సందర్భాలలో `రాకా` అనే పదానికి క్రూరమైన వ్యక్తిగా అభివర్ణిస్తారట. ఫస్ట్‌లుక్‌ని బట్టి సినిమాలో బన్నీ క్యారెక్టర్ అత్యంత క్రూరంగా, భయంకరంగా ఉంటుందని తెలుస్తోంది.
ది ట్విలైట్ సాగా: ఎక్లిప్స్...
హాలీవుడ్ మూవీ ట్విలైట్ ఎక్లిప్స్‌లో హీరో, విలన్ పౌర్ణమి వేళ తోడేళ్లుగా మారి భీకర యుద్ధం చేస్తుంటారు. తమకు నచ్చిన వారిని కాపాడే క్రమంలో తోడేళ్లుగా మారుతుంటారు. బన్నీ `రాకా` ఫస్ట్ లుక్ చూస్తుంటే ఆ సినిమాని గుర్తు చేస్తోందనే కామెంట్‌లు కూడా వనిపిస్తున్నాయి. హాలీవుడ్‌లో సిరీస్‌లుగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడమే కాకుండా ఇందులో నటించిన క్రిస్టన్ స్టీవర్ట్, రాబర్ట్ పాటిన్సన్, టైలర్ లౌంటర్‌లకు మంచి పాపులారిటీని తెచ్చి పెట్టింది.
భేడియా ఛాయలు...
వరుణ్ ధావన్ హీరోగా నటించిన కామెడీ హారర్ ఫాంటసీ మూవీ `భేడియా`. ఇందులో వరుణ్ ధావన్ తోడేలుగా మారి భీభత్సం సృష్టించడం తెలిసిందే. `రాకా` ఫస్ట్ లుక్‌ని చూసిన వారంతా వరుణ్ ధావన్ `భేడియా` తరహాలో బన్నీ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బన్నీ ఫస్ట్ లుక్ చాలా ప్రశ్నలని లేవెనెత్తుతోందని, అట్లీ బన్నీతో కలసి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని మరి కొంత మంది అంటున్నారు. ఇదిలా ఉంటే ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, అందులో ఒక క్యారెక్ట్ లుక్ ఇదని, ఇది విలన్ రోల్ అని, హీరో లుక్ త్వరలో రిలీజ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా `రాకా` టైటిల్, ఫస్ట్ లుక్‌పై భిన్నమైన కథనాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇవన్నింటీలో ఏది నిజం అన్నది తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే.
