Begin typing your search above and press return to search.

2027 - 2028 సీజ‌న్ : బాక్సాఫీస్ వార్‌లో ఎదురే లేని ఐకాన్!?

అటు బాలీవుడ్, ఇటు హాలీవుడ్ నుంచి కొన్ని క్రేజీ సినిమాలు బరిలో ఉన్నా.. ఈ సీజన్‌లో ఐకాన్ స్టార్‌కు ఎదురే లేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   13 Jun 2026 8:00 AM IST
2027 - 2028 సీజ‌న్ : బాక్సాఫీస్ వార్‌లో ఎదురే లేని ఐకాన్!?
X

పాన్ ఇండియాలో బాక్సాఫీస్ రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డంలో పుష్ప‌రాజ్ చూపించిన‌ స్పీడ్ ని ఇప్ప‌ట్లో మార్కెట్ వ‌ర్గాలు అంత తేలిగ్గా మ‌ర్చిపోవు. 2024-25 సీజ‌న్ అంతా పుష్ప‌రాజ్ రికార్డుల గురించే చ‌ర్చ సాగింది. అయితే మ‌రోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హవా గురించి చ‌ర్చ ఎప్పుడు మొద‌ల‌వుతుంది? అంటే క‌చ్ఛితంగా అది 2027-28 సీజ‌న్ లో పాజిబుల్ అవుతుంద‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ న‌టిస్తున్న `రాకా` రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది అప్పుడే గ‌నుక‌. అల్లు అర్జున్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX), హై-ఎండ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందుతున్న భారీ ఫిక్షన్ చిత్రం `రాకా` 2027 డిసెంబర్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు భారీగా సమయం తీసుకుంటున్న ఈ చిత్రం ఆశించిన విధంగా అన్నీ కుదిరితే బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల వేట కొనసాగిస్తుంద‌ని బ‌న్ని అభిమానులు భావిస్తున్నారు. అయితే రాకా హ‌వా స‌జావుగా కొన‌సాగాలంటే మంచి రిలీజ్ తో పాటు పోటీ లేక‌పోవ‌డం కూడా క‌లిసొస్తుది. అయితే రాకా రిలీజ్ స‌మయంలో ధీటైన సినిమా ఏదీ ఇప్ప‌టివ‌ర‌కూ ఫిక్స్ కాక‌పోవ‌డం ప్ర‌ధాన అస్సెట్. అటు బాలీవుడ్, ఇటు హాలీవుడ్ నుంచి కొన్ని క్రేజీ సినిమాలు బరిలో ఉన్నా.. ఈ సీజన్‌లో ఐకాన్ స్టార్‌కు ఎదురే లేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బాలీవుడ్ మార్కెట్ విషయానికి వస్తే.. డిసెంబర్ 2027లో రెండు క్రేజీ ప్రాజెక్టులు థియేటర్లలోకి రానున్నాయి. అందులో మొదటిది 2018 నాటి కల్ట్ క్లాసిక్ హారర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న `తుంబాడ్ 2`. సోహమ్ షా, నవాజుద్దీన్ సిద్దికీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ జానపద హారర్ చిత్రం 3 డిసెంబర్ 2027న విడుదల కానుంది. దీనితో పాటు క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడే విండోను టార్గెట్ చేస్తూ రోహిత్ శెట్టి - అజయ్ దేవగన్ కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ `గోల్‌మాల్ -5` కూడా పోటీ బరిలో నిలవనుంది. అయితే ఉత్తరాదిన అల్లు అర్జున్‌కు ఉన్న విపరీతమైన మాస్ ఫాలోయింగ్- క్రేజ్ ముందు ఈ రెండు హిందీ సినిమాలు `రాకా` చిత్ర భారీ ఓపెనింగులకు ఎలాంటి అడ్డంకి కాలేవని స్పష్టమవుతోంది.

మరోవైపు అదే నెలలో హాలీవుడ్ చిత్రాల నుండి `రాకా`కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. 17 డిసెంబర్ 2027న ప్రపంచవ్యాప్తంగా రెండు మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ టెంట్పోల్స్ విడుదల కానున్నాయి. మార్వెల్ స్టూడియోస్ మల్టీవర్స్ సాగాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం `అవెంజర్స్: సీక్రెట్ వార్స్` వాల్ట్ డిస్నీ స్టూడియోస్ ద్వారా విడుదల కానుండగా, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నుండి అండీ సెర్కిస్ దర్శకత్వంలో మిడిల్-ఎర్త్ నేపథ్యంతో వస్తున్న లైవ్-యాక్షన్ మూవీ `ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది హంట్ ఫర్ గొల్లమ్` కూడా అదే రోజున బరిలోకి దిగుతోంది. ఈ రెండు గ్లోబల్ ఫ్రాంచైజీ సినిమాలకు భారతదేశంలోనూ భారీ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం.

హాలీవుడ్ నుండి అంతర్జాతీయ స్థాయి భారీ చిత్రాలు థియేటర్లకు వస్తున్నా..ఒక ఇండియన్ సూపర్ స్టార్ మాస్ ఇమేజ్ - లోకల్ కనెక్ట్ ముందు ఆ చిత్రాల హవా కొంతవరకు తగ్గుతుందనే చెప్పాలి. హాలీవుడ్ సినిమాలకు మన దేశంలో ఉండే పరిమిత ఆడియన్స్ మార్కెట్ దృష్ట్యా అవి భారతీయ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 100 కోట్ల లోపు వసూళ్లను మాత్రమే సాధించగలవు. కానీ ఐకాన్ స్టార్ నటిస్తున్న `రాకా` చిత్రం కనుక థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. గతంలో `పుష్ప 2` సృష్టించిన ప్రభంజనం తరహాలో ఏకంగా రూ. 1500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను తిరగరాసేందుకు ఛాన్సుంటుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తుంది.

అత్యంత భారీ బడ్జెట్, అత్యాధునిక గ్రాఫిక్స్- విజువల్ వండర్‌గా రాబోతున్న `రాకా` సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించబోతోంది. బాలీవుడ్ కామెడీ, హారర్ చిత్రాల లైనప్ ఒకవైపు, హాలీవుడ్ అవెంజర్స్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి దిగ్గజ ఫ్రాంచైజీలు మరోవైపు బ‌రిలో ఉన్నా... 2027 డిసెంబర్ బాక్సాఫీస్ విండోను రూల్ చేయడానికి అల్లు అర్జున్ తన వన్-మ్యాన్ షోతో సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రేజీ సీజన్‌లో ఐకాన్ స్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తారో చూడటానికి ఇటు అభిమానులు, అటు ట్రేడ్ వర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి.