Begin typing your search above and press return to search.

అఛీవ్ చేయలేకపోయావంటూ నితిన్‌ని నిల‌దీసిన దిల్ రాజు!

అల్లు అర్జున్, నితిన్ కెరీర్లపై నిర్మాత దిల్ రాజు గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరినీ భవిష్యత్ స్టార్లుగా ఊహించానని, అయితే కెరీర్‌ను హ్యాండిల్ చేసే విధానంలో తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. బన్నీ అగ్రస్థాయికి చేరుకోగా, నితిన్ ఆశించిన స్థాయిని అందుకోలేకపోయారని అభిప్రాయపడ్డారు. ‘అలియాస్ రుక్మిణి’తో నితిన్ మళ్లీ సత్తా చాటుతాడేమో చూడాలి.

By:  Sivaji Kontham   |   28 Nov 2026 8:11 AM IST
అఛీవ్ చేయలేకపోయావంటూ నితిన్‌ని నిల‌దీసిన దిల్ రాజు!
X

టాలీవుడ్‌లో ఒకే దశలో దాదాపు సమానమైన అంచనాల మధ్య కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లిన ఇద్దరు హీరోల ప్రయాణాలను పోల్చుతూ నిర్మాత దిల్ రాజు గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. `అలియాస్ రుక్మిణి` ఇంట‌ర్వ్యూల‌లో నితిన్ మాట్లాడిన‌వాటిని, అప్ప‌టి ఇంట‌ర్వ్యూలో దిల్ రాజు మాట‌ల క్లిప్‌ల‌ను జోడించి మీడియాలో క‌థ‌నాలు వేస్తుండ‌టం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అయితే ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే... నితిన్ 2002లోనే హీరోగా అడుగుపెట్టగా.. తాను 2003లో నిర్మాతగా మారానని ఆ లెక్కన నితిన్ తనకంటే ఏడాది సీనియర్ అయినా.. గత 23 ఏళ్ల ప్రయాణంలో తాను జూనియర్‌గా ఉంటూనే ఎదిగి టాప్ స్థాయికి చేరుకున్నానని దిల్ రాజు గుర్తుచేశారు. విషయాలను హ్యాండిల్ చేసే... మేనేజ్ చేసే కెపాసిటీ విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోందని ఆయన సూటిగా వ్యాఖ్యానించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా నిలిచింది.

`ఆర్య` సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్‌ను, `దిల్` సినిమా చేస్తున్నప్పుడు నితిన్‌ను ఫ్యూచర్ స్టార్స్‌గా ఊహించానని దిల్ రాజు వెల్లడించారు. ఆరంభంలో ఇద్దరూ బలమైన గుర్తింపు తెచ్చుకున్నా.. నితిన్ తాను ఊహించిన ఆ స్థాయి మార్క్‌ను అఛీవ్ చేయలేకపోయాడని.. అతడు కోల్పోయింది అదేననేది తన ఫీలింగ్ అని దిల్ రాజు స్పష్టం చేశారు. త‌దుప‌రి చిత్రాల‌తో పెద్ద విజ‌యం అందుకోవాల‌ని ఆకాంక్షించారు. అలాగే `దిల్`కు ఉన్న బ్రాండ్ వాల్యూను ప్రస్తావిస్తూ.. వినాయక్‌తో కలిసి `దిల్ పార్ట్ 2` చేస్తే ఫాదర్ క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్ కూడా నితిన్ చేస్తూ, చివరి సీన్‌లో ప్రకాష్ రాజ్ ఫోటోను రివీల్ చేసేలా ఉండాలని సరదాగా ప్లాన్ చెప్పారు.

దిల్ రాజు లేవనెత్తిన ``హ్యాండిల్ చేసే..మేనేజ్ చేసే కెపాసిటీ`` అనే అంశమే బన్నీ, నితిన్‌ల కెరీర్ గ్రాఫ్‌లలో కనిపిస్తున్న ప్రధాన వ్యత్యాసాన్ని వివరిస్తుంది. అల్లు అర్జున్ ఆర్య తర్వాత ప్రతి ప్రాజెక్ట్‌ను కొత్తదనం-మార్కెట్ విస్తరణ- స్క్రిప్ట్ ఎంపిక- ప్రమోషన్లతో పాన్-ఇండియా స్థాయి ప్రణాళికలతో పక్కాగా మేనేజ్ చేస్తూ స్టార్‌డమ్‌ను దశలవారీగా అగ్రస్థాయికి తీసుకెళ్లారు. ఆరంభంలో వచ్చిన హిట్‌ల ఊపును నిలబెట్టుకుంటూ.. తన బలాలు, బలహీనతలను అంచనా వేసుకుని ప్రాజెక్టులను ఎంచుకోవడంలో బన్నీ చూపిన నిలకడ అతన్ని అగ్ర హీరోగా నిలబెట్టింది.

మరోవైపు `దిల్` వంటి బ్లాక్‌బస్టర్‌తో మంచి ఆరంభం అందుకున్న నితిన్ ఆ తర్వాత కెరీర్‌లో వరుస ఒడుదొడుకులు, అస్థిరమైన సక్సెస్ రేట్ కారణంగా ఆరంభంలో ఏర్పడిన ఫ్యూచర్ స్టార్ అంచనాలను పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేకపోయారు. కమర్షియల్ లెక్కలు, స్క్రిప్ట్ సెలక్షన్, కెరీర్ ప్లానింగ్‌లో నిలకడ లోపించడం.. అలాగే మారుతున్న ట్రెండ్స్, పాన్-ఇండియా స్థాయి మార్కెట్ రేసులో తన స్థానాన్ని మరింత బలంగా పదిలపరుచుకోవడంలో వెనుకబడటం వల్ల బన్నీ స్థాయి అగ్ర హీరోల లిగ్‌లోకి చేరలేకపోయారనే విశ్లేషణలు సాగుతున్నాయి.

23 ఏళ్ల అనుభవంలో ఒకేసారి రేసు మొదలైనా కెరీర్‌ను మేనేజ్ చేసుకునే విధానం.. ప్రాజెక్టుల ఎంపికలో నిలకడ.. మార్కెట్‌ను విస్తరించుకునే వ్యూహాలే అల్లు అర్జున్‌ను అగ్ర హీరోగా నిలబెట్టగా... నితిన్‌ను ఆ స్థాయి మార్క్‌కు దూరంగా ఉంచాయని దిల్ రాజు వ్యాఖ్యలను విశ్లేషించ‌వ‌చ్చు. అయితే పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్ డ‌మ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. స‌రైన సినిమాల‌తో నితిన్ తన కెరీర్‌ను పెద్ద స్థాయికి తీసుకెళ్ల‌డానికి ఇంకా ఆస్కారం లేక‌పోలేదు. అత‌డు ఎలా కెరీర్ ని గాడిలో పెట్టుకుంటాడో చూడాలి. నితిన్ న‌టించిన అలియాస్ రుక్మిణి చిత్రం త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లోకి విడుద‌ల‌వుతోంది.