ఐకాన్ స్టార్ పెండింగ్ జానర్స్ కవర్ చేసేయనున్నారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినీ జర్నీలో దాదాపు అన్ని కమర్షియల్ జానర్స్ లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 14 July 2026 11:40 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినీ జర్నీలో దాదాపు అన్ని కమర్షియల్ జానర్స్ లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, మాస్ యాక్షన్, గ్యాంగ్ స్టర్ డ్రామాలు, పీరియాడికల్ కథలు, దేశభక్తి చిత్రాలు.. ఇలా ప్రేక్షకులు కోరుకునే ప్రతి విభాగంలో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా పుష్ప సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఇకపై అల్లు అర్జున్ ఎలాంటి కథలను ఎంచుకుంటారనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.
కెరీర్ ప్రారంభంలో ఆర్య, హ్యాపీ, పరుగు వంటి ప్రేమకథలతో యువతను ఆకట్టుకున్న అల్లు అర్జున్.. జులాయి, రేసుగుర్రంతో కామెడీ, యాక్షన్ మిక్స్ అయిన ఎంటర్టైనర్లలోనూ విజయాలు అందుకున్నారు. సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులను మెప్పించారు. సరైనోడు, డీజే, పుష్ప చిత్రాలతో మాస్ యాక్షన్ హీరోగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. వేదం వంటి మల్టీ స్టారర్, నా పేరు సూర్య వంటి దేశభక్తి చిత్రం, రుద్రమదేవి వంటి పీరియాడిక్ నేపథ్యంలోనూ నటించి విభిన్న పాత్రలను పోషించారు.
అయితే ఇప్పటికీ కొన్ని జానర్స్ మాత్రం అల్లు అర్జున్ కెరీర్ లో మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా పూర్తి స్థాయి పురాణ నేపథ్య చిత్రం, హారర్, సైన్స్ ఫిక్షన్, స్పోర్ట్స్ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా, డిటెక్టివ్ థ్రిల్లర్, బయోపిక్ వంటి జానర్స్ లో ఆయన ఇంకా నటించలేదు. అందుకే ఫ్యూచర్ లో ఈ తరహా కథలపై దృష్టి పెడతారా అనే చర్చ జరుగుతోంది. కొంతకాలంగా అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ కాంబోలో మూవీపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఆ సినిమా పురాణాల నుంచి స్ఫూర్తి పొందిన కథతో రూపొందే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కాబట్టి దీనిని టాక్ గా మాత్రమే చూడాలి. మరోవైపు దర్శకుడు అట్లీతో బన్నీ చేస్తున్న భారీ చిత్రం సైన్స్ ఫిక్షన్ అంశాలతో రూపొందనున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ అదే నిజమైతే, ఇప్పటివరకు చేయని మరో జానర్స్ ను కూడా అల్లు అర్జున్ తన ఖాతాలో వేసుకున్నట్టే అవుతుంది. దీంతో వరుసగా కొత్త తరహా కథలను ఎంచుకుంటూ తన రేంజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో ప్రేక్షకుల టేస్ట్ వేగంగా మారుతోంది. ఒకే తరహా కథల కంటే కొత్త కాన్సెప్టులు, విభిన్న ప్రపంచాలు, వైవిధ్యమైన పాత్రలకు మంచి ఆదరణ లభిస్తోంది.
ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు కొత్త జానర్స్ ఎంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. అల్లు అర్జున్ కూడా అదే దిశగా అడుగులు వేస్తే, ఆయన కెరీర్ లో మరిన్ని వైవిధ్యమైన చిత్రాలు చేరే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పటికే అనేక జానర్స్ లో విజయాలు అందుకున్న ఐకాన్ స్టార్.. మిగిలిన జానర్స్ ను కూడా కవర్ చేస్తారా? పురాణాల టచ్, సైన్స్ ఫిక్షన్, హారర్ లేదా స్పోర్ట్స్ డ్రామా వంటి కథలతో సినిమాలు చేస్తారా? అన్నది వేచి చూడాలి.
