Begin typing your search above and press return to search.

మొద‌టి సినిమా మిస్.. కానీ కెరీర్ హిట్! అల్లు అర్జున్ జ‌ర్నీ చెప్పే పాఠం ఇదే!

అలాంటి డిస్క‌ష‌న్స్ లో తాజాగా మరోసారి అల్లు అర్జున్ ప్రారంభ కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   24 July 2026 11:45 PM IST
మొద‌టి సినిమా మిస్.. కానీ కెరీర్ హిట్! అల్లు అర్జున్ జ‌ర్నీ చెప్పే పాఠం ఇదే!
X

సినీ పరిశ్రమలో అవకాశాలెప్పుడూ స్థిరంగా ఉండవు. ముఖ్యంగా ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు హీరోలు, డైరెక్ట‌ర్లు లేదా ఇతర కీలక సభ్యుల్లో మార్పులు జరగడం కొత్త విషయం కాదు. కథలో మార్పులు, నిర్మాతల వ్యూహాలు, మార్కెట్ పరిస్థితులు లేదా క్రియేటివ్ డెసిష‌న్స్ కారణంగా చివరి నిమిషంలో కూడా నటీనటుల ఎంపిక మారిన సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. అలాంటి డిస్క‌ష‌న్స్ లో తాజాగా మరోసారి అల్లు అర్జున్ ప్రారంభ కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

ఇటీవల రైట‌ర్ చిన్నికృష్ణ చేసిన కామెంట్స్ తో, అల్లు అర్జున్ హీరోగా రావాల్సిన మొద‌టి సినిమా వేరొక‌టి అయ్యుండేదనే డిస్క‌ష‌న్ సోషల్ మీడియాలో మళ్లీ మొదలైంది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, ఒక దశలో జయం సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించే అవకాశం ఉందని భావించినప్పటికీ, చివరకు ఆ ప్రాజెక్ట్ నితిన్‌తో మొద‌లైంద‌ని చెప్పారు. దీంతో చిన్నికృష్ణ చేసిన కామెంట్స్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

అయితే ఒక సినిమా చేజారిపోవడం కెరీర్‌ను డిసైడ్ చేయ‌ద‌నే విషయానికి అల్లు అర్జున్ జ‌ర్నీనే మంచి ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. త‌ర్వాత గంగోత్రితో హీరోగా పరిచయమైన బ‌న్నీకి తొలి రోజుల్లోనే విమర్శలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆయన లుక్స్‌పై వచ్చిన కామెంట్స్ అప్పట్లో పెద్ద డిస్క‌ష‌న్ కు దారితీశాయి. కానీ ఆ విమర్శలను వెనుకడుగు వేయడానికి కారణంగా కాకుండా, తనను తాను మెరుగుపరుచుకోవడానికి అవకాశంగా తీసుకున్నారు.

సినిమా సినిమాకీ యాక్టింగ్ లో మెచ్యూరిటీ పెంచుకోవడం, డ్యాన్స్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించడం, యాక్షన్ ఇమేజ్‌ను నిర్మించుకోవడం, ఫిట్‌నెస్‌పై స్పెష‌ల్ కేర్ తీసుకోవ‌డం ద్వారా అల్లు అర్జున్ తనను పూర్తిగా మార్చుకున్నారు. ఒకప్పుడు విమర్శించిన వారే తర్వాత ఆయన కష్టాన్ని ప్రశంసించే స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్‌గా నిలవడం వెనుక ఈ నిరంతర మార్పు, క్రమశిక్షణ కీలక పాత్ర పోషించాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.

ఇండస్ట్రీలో హీరోల మార్పులు జరిగిన సంద‌ర్భాలు చాలానే ఉన్నారు. కథ ఒక హీరో కోసం సిద్ధమై, చివరికి మరొకరితో తెరకెక్కిన సినిమాలెన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ మార్పు కొత్త హీరో కెరీర్‌కు బలమైన పునాది వేస్తే, మరికొన్ని సందర్భాల్లో అవకాశం కోల్పోయిన నటుడు తర్వాత మరిన్ని పెద్ద స‌క్సెస్‌ల‌ను అందుకున్నాడు. అందుకే ఒక సినిమా దక్కడం లేదా మిస్ కావడం కంటే, ఆ తర్వాత తీసుకునే డెసిష‌న్సే కెరీర్‌ను తీర్చిదిద్దుతాయని పరిశ్రమ తరచూ నిరూపిస్తోంది. జయంలో నటించే అవకాశం దక్కలేదనే డిస్క‌ష‌న్ మరోసారి వెలుగులోకి వచ్చినప్పటికీ, అల్లు అర్జున్ కెరీర్‌ను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రారంభంలో ఎదురైన నిరాశలు, విమర్శలు, సవాళ్లను అధిగమిస్తూ తన టాలెంట్ ను నిరూపించుకున్న ఆయన, నేడు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో అత్యంత ప్రభావవంతమైన స్టార్‌లలో ఒకరిగా ఎదిగారు.