ఎలాంటి హడావిడి లేకుండా పవన్ ఇంటికి బన్నీ.. మెగా ఫ్యాన్స్‌కు గట్టి సంకేతం?
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం కొత్తది కాదు. కుటుంబ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇద్దరూ ఒకరిపై ఒకరు గౌరవభావం కలిగి ఉన్నారనే విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 10 Jun 2026 4:58 PM ISTఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న టైమ్ లో జరిగిన ఒక పర్సనల్ భేటీ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా ఈ భేటీ దాదాపు మూడు గంటల పాటు కొనసాగిందనే వార్త అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు సినీ పరిశ్రమలో మెగా కుటుంబానికి చెందిన ప్రముఖ నటులుగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇద్దరికీ ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే గత కొంతకాలంగా రాజకీయ పరిణామాలు, సోషల్ మీడియాలో అభిమానుల మధ్య జరిగిన వాదోపవాదాల కారణంగా వారి సంబంధాలపై అనేక రకాల ప్రచారాలు వినిపించాయి. ముఖ్యంగా ఎలక్షన్స్ టైమ్ లో అల్లు అర్జున్ చేసిన కొన్ని విషయాల నేపథ్యంలో పవన్ అభిమానులు, బన్నీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విభేదాలు కనిపించాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం కూడా జరిగింది.
తర్వాత బన్నీ, పవన్ పలుమార్లు కలిసిన విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీరిద్దరి కలయిక ఇపపుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సందర్శన పూర్తిగా పర్సనల్ గా జరిగిందని, ఎలాంటి ప్రచారం లేకుండా ఉండాలని బన్నీ స్పెషల్ గా కోరుకున్నారని సమాచారం. అందుకే ఆయన అక్కడ ఎలాంటి ఫొటోలు దిగకుండా, మీడియా దృష్టికి దూరంగా తన పరామర్శను ముగించినట్లు తెలుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి సందర్శనలను సోషల్ మీడియాలో పంచుకోవడం లేదా ఫొటోలు రిలీజ్ చేయడం చూస్తుంటాం. కానీ ఈ సందర్భంలో అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం ఈ భేటీ వెనుక ఉన్న ఆప్యాయతను మరింత స్పష్టంగా చూపిస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం కొత్తది కాదు. కుటుంబ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇద్దరూ ఒకరిపై ఒకరు గౌరవభావం కలిగి ఉన్నారనే విషయం తెలిసిందే. బయట పరిస్థితులు ఎలా ఉన్నా, అభిమానుల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా, వ్యక్తిగత సంబంధాలను మాత్రం వారెప్పుడూ బాగానే మెయిన్‌టెయిన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు జరిగిన ఈ భేటీ కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఫ్యాన్స్ యాంగిల్ లో చూస్తే ఈ సంఘటన ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్‌లు, ఫ్యాన్ వార్స్ తరచూ వ్యక్తిగత సంబంధాలపై అనవసర అపోహలు సృష్టిస్తుంటాయి. కానీ నిజ జీవితంలో స్టార్ హీరోలు పరస్పరం గౌరవం, ప్రేమ, ఆప్యాయతలతోనే ఉంటారనే విషయాన్ని ఈ పరిణామం మరోసారి నిరూపించినట్లైంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయనను స్వయంగా కలిసిన అల్లు అర్జున్ చర్య అభిమానులకు కూడా ఒక పాజిటివ్ సందేశంగా మారింది. కనీసం ఇకనైనా ఫ్యాన్స్ వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి తమ అభిమాన హీరోల మాదిరిగానే పరస్పర గౌరవంతో వ్యవహరిస్తే మంచిదనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.
