Begin typing your search above and press return to search.

మరో మూడేళ్లు 'హైదరాబాద్‌'లో బన్నీ కనిపించరా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌ లో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

By:  M Prashanth   |   20 April 2026 1:00 PM IST
మరో మూడేళ్లు హైదరాబాద్‌లో బన్నీ కనిపించరా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌ లో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు హైదరాబాద్‌ ను కేంద్రంగా చేసుకుని సినిమాలు చేసిన బన్నీ.. ఇకపై ముంబైలో ఎక్కువ టైమ్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు ముంబైలోనే ఎక్కువగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

పుష్ప సిరీస్‌ తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌ గా మాత్రమే కాకుండా గ్లోబల్ రేంజ్‌ లో తన స్థాయిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మార్కెట్‌ పై మరింత ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలోనే తనకు అనుకూలంగా ఉండేలా ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కూడా కొనుగోలు చేసినట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే బన్నీ నిర్ణయానికి ఆయన లైనప్‌ లో ఉన్న ప్రాజెక్టులు ఆ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా దర్శకుడు అట్లీతో తెరకెక్కిస్తున్న రాకా చిత్రం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా రూపొందుతున్న ఆ సినిమా దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఆ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ముంబైలోనే జరగనుండటంతో, అక్కడ ఉండడం సౌకర్యంగా ఉంటుందని బన్నీ భావిస్తున్నారట.

ఇక మరోవైపు, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న AA23 కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కూడా భారీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో ఉండబోతోందని, గ్లోబల్ మార్కెట్‌ ను టార్గెట్ చేస్తుందని సమాచారం. ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కూడా ముంబైతో పాటు విదేశాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయని టాక్.

ఇవే కాకుండా, అల్లు అర్జున్ ప్రస్తుతం నేషనల్ లెవల్ బ్రాండ్లకు అంబాసిడర్‌ గా వ్యవహరిస్తున్నారు. పలు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కోసం తరచూ ముంబై వెళ్లాల్సి వస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి తరచూ ప్రయాణించడం కష్టంగా మారడంతో, అక్కడే ఉంటే సమయం ఆదా అవుతుందని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కుటుంబం మాత్రం హైదరాబాద్‌ లోనే కొనసాగుతుందని వినికిడి.

అవసరమైనప్పుడు ముంబైకి వెళ్లి వస్తారని తెలుస్తోంది. బన్నీ మాత్రం తన ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టేందుకు ముంబైలో ఎక్కువ కాలం గడపనున్నారు. మొత్తానికి షిఫ్టింగ్ నిర్ణయం అల్లు అర్జున్ కెరీర్‌ లో ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు. తెలుగు హీరోగా మాత్రమే కాకుండా.. గ్లోబల్ స్టార్ గా ఎదగాలనే లక్ష్యంతో బన్నీ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో రాబోయే కొన్నేళ్ల పాటు హైదరాబాద్‌ లో బన్నీ కనిపించడమే అరుదుగా మారుతుందా అన్న చర్చ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి అందులో నిజమెంతో వేచి చూడాలి.