Begin typing your search above and press return to search.

బోయపాటి శ్రీను కొత్త కథ ఎంత వరకు వచ్చింది?

‘అఖండ 2’ విజయంతో జోష్‌లో ఉన్న బోయపాటి శ్రీను, అల్లు అర్జున్‌తో మరో సినిమా చేసేందుకు కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘సరైనోడు’ తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని, రూ.150 కోట్ల బడ్జెట్‌తో మైథలాజికల్ మూవీగా తెరకెక్కవచ్చని టాక్. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

By:  Ramesh Palla   |   17 Nov 2026 7:00 AM IST
బోయపాటి శ్రీను కొత్త కథ ఎంత వరకు వచ్చింది?
X

అఖండ 2 తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ బోయపాటి శ్రీను తదుపరి సినిమాకు చాలా సమయం తీసుకుంటున్నాడు. స్టార్ హీరోతోనే సినిమాను చేయాలనే ఉద్దేశంతో బోయపాటి శ్రీను కథను రెడీ చేసుకుని కూర్చున్నాడు. బోయపాటి శ్రీను వచ్చే ఏడాది అల్లు అర్జున్‌తో సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో పదేళ్ల క్రితం సరైనోడు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, అల్లు అర్జున్‌కి మంచి మాస్ ఇమేజ్‌ను తెచ్చి పెట్టింది. అందుకే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరోసారి నటించాలని అల్లు అర్జున్‌ భావించాడు. ఆ సమయంలోనే బోయపాటితో సినిమాకు నాంధి పడినట్లు అయింది. అల్లు అర్జున్‌ గతంలో ఇచ్చిన మాట ఉన్న కారణంగా బోయపాటి శ్రీను ఆయనకు కథను రెడీ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్‌ మూవీ..

బోయపాటి శ్రీను రెడీ చేసుకు వచ్చిన కథ నచ్చడంతో అల్లు అర్జున్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది. అల్లు అరవింద్‌ స్వయంగా నిర్మించేంతగా సినిమా కథ నచ్చిందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. దాదాపుగా రూ.150 కోట్ల బడ్జెట్‌తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సినిమా రూపొందించే అవకాశాలు ఉన్నాయని కూడా చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్‌ ప్రస్తుతం రాకా సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న రాకా సినిమా వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కాబోతున్న సినిమాను సైతం వచ్చే ఏడాది లేదా 2028 ఆరంభంలో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత బోయపాటి శ్రీను మూవీ విడుదల ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. రాకా సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయింది.

రాకా సినిమా తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ మూవీ...

ఈ ఏడాది డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాదిలో లోకేష్ కనగరాజ్‌ మూవీ ప్రారంభం కానుంది. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి కాకుండానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను బన్నీ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకేష్ సినిమాతో సమాంతరంగా బోయపాటి మూవీ కూడా బన్నీ చేయడం ద్వారా రాకా, లోకేష్‌ మూవీ, బోయపాటి మూవీ అటు ఇటుగా రెండు మూడు నెలల గ్యాప్‌ తో వచ్చే అవకాశాలు ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు. అల్లు అర్జున్‌ పుష్ప తర్వాత చాలా ఎక్కువ గ్యాప్‌ తీసుకున్నాడు. ఆ గ్యాప్‌ ను ఫిల్‌ చేయడం కోసం ఇలా మూడు సినిమాలు ఒకే సారి విడుదల ప్లాన్‌ చేస్తున్నాడా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది. అల్లు అర్జున్‌కు ఉన్న స్టార్‌డం నేపథ్యంలో బోయపాటితో తీయబోతున్న మైథలాజికల్ మూవీపై అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి బోయపాటి ఎంత వరకు ఆ ఒత్తిడి బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.

అల్లు అర్జున్‌ వరుస సినిమాలు...

అల్లు అర్జున్‌ కోసం బోయపాటి రూపొందిస్తున్న కథకు సంబంధించిన అప్‌డేట్‌ సినీ వర్గాల ద్వారా అందుతోంది. చాలా నెలల క్రితం అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌లకు బోయపాటి మైథలాజికల్‌ స్టోరీ లైన్ వినిపించడం, అది ఇద్దరికీ బాగా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు. ఆ స్టోరీ లైన్ తో రెండు మూడు వర్షన్‌లుగా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అందులోంచి ఒక వర్షన్‌ను బన్నీ పిక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త కన్యూజన్‌లో బోయపాటి శ్రీను అండ్‌ టీం ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో ఇటీవల ఒక చర్చ కనిపించింది. ఈ ఏడాది చివరి వరకు అల్లు అర్జున్‌ కోసం బోయపాటి రెడీ చేస్తున్న స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు అల్లు అర్జున్‌ సైతం అప్పటి వరకు రాకా సినిమా వర్క్‌ నుంచి విముక్తి పొందే అవకాశాలు ఉన్నాయి. కనుక బోయపాటి, అల్లు అర్జున్‌ కాంబో మూవీ వచ్చే ఏడాది పట్టాలు ఎక్కడం ఖాయం అని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు.