బన్నీ ఇంటికి త్రివిక్రమ్, బీవీఎస్ రవి.. అక్కడే చిరు కూడా..
గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కనకరత్నమ్మ.. శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు.
By: M Prashanth | 30 Aug 2025 1:06 PM ISTటాలీవుడ్ ప్రముఖ అల్లు కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నానమ్మ, అల్లు కనకరత్నమ్మ (94) తుదిశ్వాస విడవడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. అల్లు కుటుంబంతో పాటు మెగా కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కనకరత్నమ్మ.. శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. అయితే ఇప్పటికే చిరంజీవి కుటుంబం అల్లు అరవింద్ నివాసానికి చేరుకుంది. అల్లు అర్జున్ షూటింగ్ లో భాగంగా ముంబైలో ఉండగా, హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం నానమ్మ మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.
అదే సమయంలో కనకరత్నమ్మ మరణంతో శోకసంద్రంలో ఉన్న అల్లు అరవింద్, తీవ్ర దుఃఖంలో ఉన్న అల్లు అర్జున్ ను చిరంజీవి ఓదార్చారు. అయితే స్టార్ డైరెక్టర్స్ త్రివిక్రమ్, బీవీఎస్ రవి అల్లు అరవింద్ నివాసానికి తాజాగా చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కనకరత్నమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న చిరంజీవి, బన్నీతో కూడా మాట్లాడారు.
అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. చిరంజీవి, బన్నీ పక్క పక్కనే కూర్చుని కనిపించారు. ఇద్దరూ విషాద వదనంతోనే కనిపించారనే చెప్పాలి. అయితే త్రివిక్రమ్, బీవీఎస్ రవితోపాటు అనేక మంది సినీ ప్రముఖులు.. నివాళులు అర్పించి, పరామర్శించేందుకు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాగా.. కనకరత్నమ్మ విషయానికొస్తే, అల్లు రామలింగయ్య కొన్నేళ్ల క్రితం ఆమెను వివాహం చేసుకున్నారు. వారిద్దరికి నలుగురు సంతానం. ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు కాగా.. వారిలో కుమారుడు అల్లు అరవింద్ టాలీవుడ్ టాప్ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు రూపొందించారు. భారీ హిట్స్ ను అందుకున్నారు.
కుమార్తెల్లో ఒకరైన సురేఖను మెగాస్టార్ చిరంజీవి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరో ఇద్దరు కుమార్తెలు వసంత లక్ష్మి, నవభారతి వీరిద్దరూ సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితాలను గడుపుతున్నారు. ఇప్పుడు కనకరత్నమ్మ మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు!
