Begin typing your search above and press return to search.

'బ‌న్ని వాసు' పేరుపై అల్లు అర్జున్ సరదా కామెంట్.. స్నేహానికి బ్రాండ్ అత‌డే!

ఈ సందర్భంగా తన ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్క అభిమానికి అల్లు అర్జున్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

By:  Sivaji Kontham   |   29 July 2026 9:37 AM IST
బ‌న్ని వాసు పేరుపై అల్లు అర్జున్ సరదా కామెంట్.. స్నేహానికి బ్రాండ్ అత‌డే!
X

ఇటీవలి ఫ్యాన్స్ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్ఫూర్తివంత‌మైన‌ ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా త‌న‌కు అత్యంత సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాస్ పేరు వెనుక ఉన్న కథను గుర్తుచేసుకుంటూ వేదికపై చేసిన సరదా వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. అప్పట్లో తనపై ఉన్న అభిమానం, ఇష్టంతోనే ఆయన `బన్నీ వాస్` అని పేరు పెట్టుకున్నారని అల్లు అర్జున్ తెలిపారు. అయితే ఇప్పుడు కనుక పేరు పెట్టుకోవాల్సి వస్తే , బ‌న్నీని పూర్తిగా తీసేసి VAASUలోని V ని తీసేసి AASUగా మార్చుకోవాలని సలహా ఇచ్చేవాడినని నవ్వుతూ స‌ర‌దాగా వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా తన ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్క అభిమానికి అల్లు అర్జున్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించలేకపోయినా.. ఏఏఎఫ్ఏ (అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేష‌న్) సంస్థ ఏర్పాటుకు .. తన ఎదుగుదలకు కారణమైన ప్రతీ ఒక్కరూ తన మనసులో ఎప్పటికీ ఉంటారని ఎమోషనల్ అయ్యారు. అక్కడికి వచ్చిన అభిమానుల కోలాహలం మధ్య వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ..వారి ఉత్సాహాన్ని చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు.

కేవలం సరదా ముచ్చట్లే కాకుండా..ఇదే వేదికపై నుంచి అభిమానులకు, హేటర్స్‌కు ఒక ఉపయోగకరమైన సందేశాన్ని కూడా ఆయన ఇచ్చారు. ప్రతి మనిషి వద్ద రోజుకు 100 శాతం శక్తి లేదా సమయం ఉంటుందని..దానిని నచ్చని వారిపై ద్వేషం చూపడానికి లేదా ట్రోల్స్ చేయడానికి వెచ్చించి టైమ్ వేస్ట్ చేసుకోవద్దని హితవు పలికారు. మన శక్తిని మనకు సంతోషాన్ని, అభివృద్ధిని ఇచ్చే పనుల కోసమే ఉపయోగించుకోవాలని... అనవసర విషయాలను వదిలేయడమే తెలివైన పని అని స్పష్టం చేశారు.

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మనిషికి లభించే శక్తి 100 శాతం నిండిన బ్యాటరీ లాంటిదని.. దానిని రోజు చివరకు ఎలా ఖర్చు చేస్తామనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ శక్తిని సమయం రూపంలోనో, డబ్బు రూపంలోనో లేదా మానసిక ఏకాగ్రత రూపంలోనో ఊహించుకోవచ్చని ఆయన విశ్లేషించారు.

వేలాదిగా త‌ర‌లి వ‌చ్చిన ఫ్యాన్స్ మ‌ధ్య అల్లు అర్జున్ స్పీచ్ స్ఫూర్తిని నింపింది. ఈ ప్రసంగం కేవలం అభిమానులను అలరించడానికి మాత్రమే కాకుండా.. నేటి యువతకు అవసరమైన ఒక ప్రాక్టికల్ లైఫ్ లెసన్‌గా నిలిచింది. ప్రతికూలతలను విస్మరిస్తూ.. స్నేహాన్ని గౌర‌విస్తూ.. అభిమానుల‌ను ప్రేమిస్తూ ఆయ‌న చేసిన ప్ర‌సంగం హృద‌యాల‌ను గెలుచుకుంది. మన వద్ద ఉన్న 100 శాతం శక్తిని సానుకూల ఆలోచనలు .. వ్యక్తిగత వికాసం కోసం ఉపయోగించుకోవడమే నిజమైన విజయమని బ‌న్ని ఇచ్చిన సందేశానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి.